సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత-112: అరుంధతీ గిరుంధతీ అగపడట్లేదు గని అప్పు మాత్రం అగపడ్తున్నది అన్నట్లు
*†***
అవ్వా! గా పెండ్లి పిలగాన్ని జెర తేరిపార జూశినవా? గాడేంది మస్తు పరేషాన్ ఉన్నడు.లగ్గం జూసి మనంద్రం సంబుర పడ్తుంటే ఆడేందవ్వా దివాల దీశినోడి లెక్క అగపడ్తుండు.
"నిజమే శెల్లె! పెండ్లి సంమ్మందం జూశేటప్పుడు బాగనే ఉండు. పిల్లేమన్న నచ్చలేదా అన్కుంటే 'పిల్లకేం బంగారం లెక్కుందని' కితాబిచ్చిండు. మరేమైందో శెల్లే!"
ఒక్కడే గద పెండ్లి ఘనంగ జెయ్యాలని అమ్మా నాయిన మస్తు పట్టుబట్టిండ్రంట.అస్లే గీ రోజుల్ల ఆడివిల్లలు దొర్కుడే కట్టంగుంది. గా మాటకి పెండ్లి పిల్ల అమ్మా నాయిన "మా వొల్లగాదు. అప్పో సప్పో జేసి మీరన్నట్టు పెండ్లి జేత్తే ఇంకో పిల్ల పెండ్లెట్ట జేయాలె. మాకు దగ్గ సంమ్మందం మాకు దొరక్కబోదు.వొదులుకుంటమని శెప్పిండ్రంట అవ్వా! ఆటెంక ఏమైందో ఏమో దెల్వదు. మల్ల గిప్పుడు లగ్గంలనే జూసుడు."
 "అవ్వా! ఘనంగ జెయ్యడాన్కి వొప్పుకోని పెండ్లి పిల్ల తండ్రి గిప్పుడేంది  వొచ్చినోళ్ళంత ఆచ్చెరంతో నోళ్ళు దెర్సేలా గింత బాగ అంగరంగ వైభోగంగ జేత్తుండు. గాళ్ళకేమన్న లాట్రీ టికెట్ తగిలిందా ఏంటి?"
 " నిజమే శెల్లె! "తవ్వల్నే ఉంది కువ్వారం" అన్నట్లు గిందులో ఏదో మత్లబ్ ఉంది.అటు ఆడపెండ్లోళ్ళు బాగనే ఉండ్రు.గిటు పెండ్లి కొడుకోళ్ళు బాగనే ఉండ్రు.మరి పెండ్లి కొడుక్కి ఏమైంది శెల్లే! గట్ల తెచ్చిపెట్టుకున్న నవ్వును నవ్వలేక అవత్త పడుతుండు?"
శిడమైతే శిన్నోడి పెండ్లయితది."  ఆనెక్క అసల్ యిషయం దెల్వకుండనే ఉంటదా శెల్లె? లగ్గం ఆసాంతం సూద్దాం "అన్నది
గంతట్లనే అయ్యోరు పెండ్లి పిల్లని, పిలగాన్ని  దీస్కెల్లి అరుంధతీ నచ్చత్రం సూడమని మొగులొంక ఏలు బెట్టి సూపుతూ... బాగ కండ్లు బెట్టి సూడుండ్రి. "అగ్గో అరుంధతి నచ్చత్రం" అని సూపిత్తుంటే...
 పెండ్లి పిలగాడు 'ఓ అయ్యోరూ! అరుంధతీ గిరుంధతీ అగపడట్లేదు గని అప్పు మాత్రం మాబాగ అగపడ్తుంది" అనంగనే గక్కడున్నోళ్ళందరు ఘొల్లున నవ్విండ్రు.గా మాటల్ల మర్మం ఏందో అవ్వకి అర్తమైంది.
 "అవును గని  అవ్వా"ఇగ్గో గీ  పెండ్లిపిల్ల దోత్తులు ఏందో  ఓ సోట జేరి  శెవులు గొరుక్కుంటున్నరు ఏంటిదో అంటుంటే"
శెవులు రిక్కించి యిన్న అవ్వకి అసలిషయం ఆసాంతం సమజైంది.
ఏందవ్వా! పెండ్లి పిలగాడు గట్లెందుకుండో శెప్పవేంది? అంటుంటే...
"గాడిని అరుంధతి అగుపిత్తుందా సూడమంటే నవ్వతాల్కి అప్పు గనిపిత్తుంది అన్నడు గద.గిట్ల తల్కాయ మీద అచ్చెంతలు బడక ముందు నుంచే మావ అప్పు తల్సుకొని రంది జేత్తుండు శెల్లె!" అన్కుంట మాట మార్శింది. 
గీ దినాల్లో  అమ్మ నాయిన పట్టు కంటే అత్త మామల పట్టే వుంటుండ్రు పెండ్లి కొడుకులు. ఏం జేత్తం కాలం మారిందవ్వా! గందుకే పెండ్లి కొడుకు అరుంధతీ గిరుంధతీ అగపడట్లేదు గని అప్పు మాత్తరం అగపడ్తుంది"అన్నడు"సూశినవా అవ్వా అన్కుంట సుట్టాల్ని పల్కరించ బోయింది  శెల్లె ఈరమ్మ.
 అడావుడంత తగ్గినంక పెండ్లి పిలగాని దగ్గర్కెల్లి  శెభాష్ రా మన్వడా! నువ్వు నాకు మస్తు నచ్చినవ్! పెండ్లి జేస్కునే మొగ పొల్ల గాండ్లు నీ లెక్క ఉండాలే " అంటుంటే..."
 'గీ రహస్సెం నీకెవలు జెప్పిండ్రవ్వా! మా నాయినకి దెలుత్తే కొంప మునుగుద్ది" అన్న మాటల్కి నాకు దెల్వదా మనవడా!" గందుకే ఎవలికి శెప్పంది. అగ్గో గా శెల్లె ఈరమ్మ అడ్గిన సుత జెప్పలే. అంటున్న అవ్వ పెద్దమనసుకు పెండ్లి పిలగాడు - పెండ్లి పిలగాని మంచితనాన్కి అవ్వ ఎవలికి వాళ్ళే మనసుల పొగుడుకున్నరు‌"
 గదండీ సంగతి!  "అరుంధతీ గిరుంధతీ అగపడట్లేదు గని అప్పు మాత్రం అగపడ్తున్నది" అంటే గదే మరి.
 "పిల్లను ఇట్ట పడ్డ పెండ్లి పిలగాడు  అత్తోళ్ళు లెనోళ్ళని  ఎవలికి దెల్వకుండ అప్పు దెచ్చి ఆళ్ళకిచ్చిండు. తేనైతె తెచ్చిండు గని ఇంగ అప్పెట్ల దీర్సాలాని మనియాది బడుకుంటున్నడు.గదన్న మాట.

కామెంట్‌లు