సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -130:-అల్పున్ని దగ్గర్కి తీస్తే అతి వాగుడు- కుక్కని దగ్గర్కి తీస్తే మూతి నాకుడు
****
"ఏందిరా మన్వడా గట్లున్నవ్! అడ్డెడు ఆముదం తాగినట్టు మొకం బెట్టినవ్?"
"అవ్వా! నీకు గీ నడ్మల పరాశ్కాలుడుడు జర ఎక్వైంది. లాక్కోలేక పీక్కోలేక నేనస్లే ఇస్మసంధిలుంటే నువ్వేమో గిట్ల బనాయిత్తుంటివి."
 "ఉన్నమాటంటే ఉల్కు ఎక్కువని" గిప్పుడు నేనేమన్నరా మన్వడా! ఊకూకెనే ఉల్కులికి పడ్తున్నవ్!" ఇష్యమేందో జర చెప్పరాదురా!"
"నువ్వేమన్న ఆర్తవా! తీర్తవా? అసలే దోత్తుగాళ్ళ ముచ్చెటి."
"ఏ దోత్తురా అయ్యా! గా బక్క పల్సగ వొక్కిరి కట్టేలున్నోడా? బుగ్గలు బూరెల్లా ఉండే లంబూ గాడా? గీ నడ్మల కొత్తగా గాడెవన్నో ఎంటేస్కుని తిర్గుతున్నవ్! శనం ఇరాం లేకుండ వొస పిట్టోలే వాగుతడే గాడా? ఎవలి ముచ్చెట్నో శెప్పరా అయ్యా!"
"వామ్మో! నువ్వు మామూల్దానివి కాదే అవ్వా!  నా దోత్తుగాళ్ళందర్కి గిస్మంటి పేర్నాలు పెడ్తావ్! గిట్ల నాకు సుత పేరు బెట్టే వుంటవ్! గని గిప్పుడసలే మనియాదిల ఉన్న.గాన్నెట్ల వొదిలిచ్చుకోవాల్నో తెల్వక! ఏదేదో అర్తం పర్తం లేకుండా వాగుతడు. వొద్దురా బై అంటే ఇనే ముచ్చటే లేదు.గిన్నాళ్ళు కాలేజీల సార్ల దెగ్గర కాత్త మంచి పేరుండే.గది కాత్త గంగల కల్సె. గిప్పుడేంజేయాల్నో తెల్వక జుట్టు పీక్కుంటున్న"
"గందుకేఁ  "అల్పుణ్ణి దగ్గర్కు తీత్తే అతి వాగుడు - కుక్కని దగ్గర్కి తీస్తే మూతి నాకుడు " అని ఊకెనే అండ్లే మన పెద్దోళ్ళు. గట్లుంది నువ్వూ, నీ దోత్తు యవ్వారం. గిప్పటికైన మించిపోలె. "వొందిచ్చి మంచోళ్ళ దోత్తానా జెయ్యాలె - వెయ్యిచ్చి శెడ్డోన్ని వొదిలిచ్చుకోవాలె" ఇంగేం జేత్తవో నీ ఇట్టంరా మన్వడా!"
"అవ్వోవ్! నీ బుర్రే బుర్రనే. మంచి అయిడియా ఇచ్చినవ్! ఇంగ గా పన్లనే వుంటా ఆణ్ణి ఎట్టాగైన వొదిలి పెడ్తా! అంటున్న మన్వనొంక శెంద్ర వొంకోలె నవ్వుతూ సూశింది."
గదండీ సంగతి. అల్పున్ని దగ్గర్కి తీస్తే అతికంగా అర్తం పర్తం లేకుండా వాగుతునే వుంటడు. కుక్కని దగ్గర్కి తీస్తే అది కూడా ఊకోదు నాకుతుంటది.గదీ మరి!"

కామెంట్‌లు