"మహిలో మహిళల పాత్ర మహోన్నతం": - -ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ) - సారవకోట -చరవాణి: 9490904976
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా
=================================
మానవజాతి మనుగడకు ప్రాణం పోసేది మహిళ..
మహిళ ఓ శక్తి స్వరూపిణి.
మహి(భూదేవి)కి ఉన్నంత ఓర్పు మహిళకు.

ఆడది..
ఆడునది కాదు, ఆడించేది కాదు,
అమ్మలా అక్కున చేర్చుకునేది.
సోదరిలా దారి చూపేది.
నానమ్మలా నాణ్యమైన విషయాల్ని చెప్పేది. 
మేనత్తలా మేలు చేసేది.
అమ్మమ్మలా ఆదరించేది.
ఆప్త మిత్రురాలిగా ఆదుకునేది.

మాతృమూర్తిగా మొదలై  మట్టిలో కలిసేవరకు..
మొక్కలా అన్నీ ఇస్తూ, బరువు, బాధ్యతలను మోస్తూ..
మర్యాద, మన్ననలను చేస్తూ
మొక్కవోని ధైర్యంతో.. ముందడుగు వేస్తూ..
మగనికి తోడూ నీడగా; బిడ్డల్ని కంటికి రెప్పలా కాస్తూ,
మనువలు, మనువరాళ్ళతో ముచ్చటిస్తూ..
ముసలివాళ్ళకు ఆలనా-పాలనా చూస్తూ,
ముందరగా మేల్కొని నిద్రాహారాలను లెక్కచేయకుండా మూడు పూటలా వంటావార్పూలు చేస్తూ, అందరికీ ముందు ఆహారం పెట్టి, వడ్డించి మిగిలింది ముట్టే మనసున్న మనిషి, కాదు కాదు దేవత..
ఇంతే కాదు ఇంతి, ఇంటిలో పిల్లలకు చదివిస్తూ, ఇంటిచాకిరి చేస్తూ..
బయట ఉద్యోగ బాధ్యతలు నిర్వరిస్తూ..
భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ
బంధు బలగాలకు ఆపద్బంధువై  ఆదుకుంటున్నారు అతివలు.
అవని నుండి అంతరిక్షం వరకు
అన్ని రంగాల్లో అడుగుపెట్టి అగ్రభాగాన నిలుస్తున్నారు నేటి మహిళలు..
విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో మగవారికి ధీటుగా రాణిస్తున్నారు.
ప్రపంచమంతటా అన్ని దేశాల్లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, స్పీకర్ లాంటి మరెన్నో ఉన్నత పదవులను చేపట్టి ప్రగతిపథంలో నడుస్తున్నారు..
రక్షణా, భద్రతా విభాగాలు, త్రివిధ దళాల్లో (సైనిక దళం, నౌకా దళం, వాయుసేన) చేరి ధైర్యంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతూ సేవలు అందిస్తున్నారు.

ఆడవాళ్ళు అబలలు కారు, సబలలు.



కామెంట్‌లు