సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -180: ఆలి పంచాయతీ రామాయణం - పాలి పంచాయతీ భారతం
***
"గిదిన్నవా అవ్వా! సూరెకాంతక్క కోడలి ముచ్చెటి.ఇంకా ఇంకా కొండీటి శాంతాడంత సాగదీత్తనే ఉన్నరు.పొల్లను కాపురానికి తీస్కొని రారు. పోరన్ని ఏరు కాపురం బెట్టనియ్యరు."
 "అవును శెల్లె! ఆడికి పెళ్ళమంటే ఇట్టమే గని అమ్మ కూచి. అమ్మ మాట కోసం ఎదురు సూత్తుండు బిడ్డడు.  ఆడ పొల్ల పుట్టిల్లయినా లంకలున్నట్టుంది. వొదినెల ముందు తలొంచుకుని. ఎప్పుడెప్పుడొచ్చి తోల్కపోతడాని ఎయ్యి కండ్లతో ఎదురు సూత్తున్నది.
"ఎప్పుడు తేల్తదో అవ్వా!గీ పొల్ల పంచాయితీ. రామాయిణంల మందర లెక్క  గా కొండవ్వ కొండేలు జెప్పి ముషలకం బుట్టిచ్చింది .గా మాటలు నమ్మిన సూరె కాంతక్క ఎన్క ముందు ఇశారిచ్చకుండ కోడల్ని పుట్టింటికి ఎల్లగొట్టింది.
 అవును శెల్లె!నిజం తెల్సినా తీస్కరాడానికి గీళ్ళకి మనసెందుకు ఒప్పట్లేదో. గీ ఆలి పంచాతీ అర్థం లేని పంచాతనీ అందర్కీ తెల్సు. గా మాటే సూరె కాంతక్కతో నేనంటే నన్ను మిర్రి మిర్రి సూశింది.
 "అయినా అవ్వా !గిక్కడ గీమెదేమన్న బావుందా!  శేని కాడ శెల్క కాడ పొత్తుల బాయిల నీళ్ళు బెట్కునే కాడ నిత్తెం లొల్లినే.గా కాంతక్క గయ్యాళి నోరేస్కుని బత్కుడే గని ఏమన్నుందా ? కోడలు  ఇంట్లే తిరుగుతుంటే సూశేటోళ్ళకి సుత ఎంత మంచి గుండేది.కొడుకెంత ఉషారుగుండేటోడు. గాడిప్పుడు ఏమన్న పట్టించుకుంటుండా? గా సోయి లేనేలేదు అక్కకి.
 నువ్వన్నది నిజం శెల్లే! గా అక్కింట్ల గిప్పుడు రామాయిణం,బారతం రొండు నడుత్తున్నయి."
 ఏందవ్వా? భలే గమ్మతిగ శెప్పినవ్? రామాయిణం, బారతం నడ్సుడేంది. గదేదో యిడమర్శి శెప్పవ్వా!"
 "ఒకేపు పాలి పంచాతీ పొద్దున లేత్తె పొత్తుల ఆకిలి కానించి పొలాలు గెట్ల దనుక నడుత్తనే ఉందా? మరో ఏపు గాన్ని ఆలిని ఏలుకో నియ్యకుండ సేత్తుందా! ఇంగ మరి గా ఇంట్ల  రొండు నడుత్తున్నయా లేదా? నువ్వే శెప్పు శెల్లె!"
 " అవ్వోవ్! నువ్వన్నట్టు గా రామాయిణ,బారతాల్లెక్కనే ఉన్నయి. గందుకనేనా నువ్వు తేపకో పాలి ఆలి పంచాయితీ రామాయణం- పాలి పంచాతీ భారతం అంటున్నావు.
గదండీ సంగతి "ఆలి పంచాయితీ అంటే సీత లెక్క గీడ వీళ్ళ కోడలి పంచాయతీ. పాలి పంచాయితీ అంటే కౌరవ పాండవుల నడుమ ఆస్తులు,అక్కుల పంచతీ.  "గిందండీ"ఆలి పంచాయితీ - పాలి పంచాయితీ" అంటే. పొద్దున్న లేత్తే గిట్ల రామాయిణం, బారతం గురించిన మాటలు మన ఇండ్లల్ల ఇంటనే ఉంటం. గస్మంటోళ్ళు ఉంటేనే ఉంటరు గదా!"

కామెంట్‌లు