సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం
 

సామెత -172:ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు

*****
ఛీ!గీడి సంగతి ముందే తెల్వకపాయె.గీడి వల్ల అందరి ముందు నవ్వుల పాలైనం.అసలు గీన్ని  తీసుకుంటే బావుంటదని శెప్పిన గా నారిగాన్ని అనాలె.తమాటలు కోడిగుడ్లు యిసిరే దనుక వత్తే సూరిగాడు అడ్డుకోబట్టి గని లేకుంటెనా గీ రాత్రంత పచ్చిగుడ్ల నీసువాసనతో సచ్చేవాళ్ళం పో!"
 "ఏందిరా అయ్యా వొచ్చిన కానుంచి సూత్తున్న. ఏం జరిగింది. గా నాటకాలు ఏశాలు మనకు పడవురా అయ్యా! అంటే యినవైతివి. ఇంతకీ ఏమైందిరా పెట్టిన కర్సుకు నాయం జరిగిందా?"
 అవ్వా! మద్దెల నీ నస ఏందే?అసలే అందరి ముందు పర్వు బోయిందని నేనేడుత్తుంటే.."
 గదేదో నాకు సుత జెప్తే నీ బాద గింతన్న తగ్గుద్ది గదరా? గిట్ల నిన్ను సూత్తుంటే నా పానం ఆగుద్దా?
 "అది కాదే అవ్వా! నిన్నెందుకు బాద పెట్టాలని గంతే. మా నాటకాల ట్రూపుల శివుని ఏశగాడికి జొరమొచ్చింది. నారి గాడు పేట నుంచి ఒకన్ని పట్కోనొచ్చిండు.గాడికి ఆళ్ళీళ్ళు నాటక సంఘాలిచ్చిన బిర్దులు పత్రాలు కట్టకు కట్ట పట్కొచ్చి సూపెట్టిండు. గాడు మామూలోడు గాడని గాడు అడ్గినంత ఇత్తమని పోతే దొర్కడని ముందే గింత డబ్బులిచ్చినం అవ్వా.
 పాక్టీసుకు రావా అంటే గదంత నాకు కొట్టిన పిండి అన్నడు. ఇంగ జూస్కో అవ్వా! ఇయ్యాల భక్త రామదాసు కళా మందిరం నడ్పే పెద్దల కాళ్ళా ఏల్లా పడి అనుమతి తీసుకున్నం.మస్తు ప్రాపగండ జేసినం.గిది బాగ నడ్శినంక వొచ్చే త్యాపకు టికెట్లు సుత పెట్టాలనుకున్నం.
అయితే! మీరు పట్కొచ్చిన కొత్తోడు సరిగా ఆడ లేదార అయ్యా!"
 గాడు సరిగ్గా ఆడితే గిట్లెట్ల అయ్యేదవ్వా! శివ తాండవాన్ని బ్రేక్ డాన్స్ లెక్క జేసిండు. ఆర్మోనియం పెట్టెకు, వాయిత్తున్న దరువులకు దగ్గట్టు జెయ్యకుండా తత్తర బిత్తర జేసుడు జూసి సూత్తున్నోళ్ళు ఈలలు కేకలు ఏత్తూ గోల మొదలైంది.అప్పటికైన  ఆగొచ్చుగా గాడింక ఆగక పొయ్యే తల్కి తమాటలు గుడ్లు యిసరడాన్కి తయారయ్యిన జనాల్ని సూరి గాడు దండం బెట్టి బతిలాడి ఆపబట్టి ఆగిండ్రుగని లేకుంటెనా..అవ్వో తల్సుకుంటే ఇంకా దడ తగ్గట్లేదు..
గాళ్ళంత ఎల్లినంక ఆన్ని దమ్మడ దిమ్మడ బాద్దామని నా దోత్తులు సూశిండ్రు.నేనే అడ్డువొయ్యి గట్లెందుకు సేశినవ్ అంటే మీ వోల్లే సరిగ్గా ఆయించలే,దరువెయ్యలే దన్నడవ్వా! పాతికేళ్ళ సంది గవి వాయిత్తున్న గాళ్ళకే సరిగ రాలేదంటె అందరికీ మస్తూ కోపమొచ్చింది.గాడికి ఏం రాదు.వాడిదగ్గర ఉన్నయన్ని నకిలీయని తెల్సిందవ్వా! గిస్మంటి యేమన్న దాస్కునేటియా జెప్పు. "గాడికెప్పుడో గని తన్నులు,గుద్దులు,తపాల శెక్కలు" పురాగనే వుంటయి.
 గందుకే అంటర్రా అయ్యా! "ఆడలేక మద్దెల ఓడు" అని. ఎన్కటికెవడో మద్దెల దరువుకు దగ్గట్టు ఆడక మొత్తంగ దరువులే సరింగ లేవు అన్నట్లుంది గీని యవ్వారం."
 "మా బాగ శెప్పినవు అవ్వా! నిజ్జంగనే గీడు సుత గట్లనే అన్నడు."
 "ఇంగ గాని సంగతి వొదిలెయ్ రా అయ్యా! గింత ఎంగిలి పడ్తువ్ రా!" అన్కుంట వంటర్రలకి ఎల్లింది అవ్వ.
గదండీ సంగతి!  "ఆడలేక మద్దెల ఓడు" అంటే గిదే మరి. కొంత మందిరి ఏదైనా తప్పు జర్గితే ఆళ్ళ తప్పులు బయిట బడకుండా ఎదుటోళ్ళ వల్లనే గట్ల జరిగింది" అని దబాయిత్తుంటరు.గస్మంటోళ్ళ కోసమే గీ సామెత.
కామెంట్‌లు