"ఇడ్లీ ఇజాకియా!": - - యామిజాల జగదీశ్
 వయస్సేమో 95 ఏళ్లు. కానీ దృఢమైన శరీరం. ఆయన పేరు ఇజాకియా పిళ్ళై. 
ఆయన తమిళనాడులోని నెల్లై జిల్లా, వీరవనల్లూరు నార్త్ అయ్యనూర్ వీధిలో నివసిస్తున్నారు.
ఆయన వృత్తి :  మెయిన్ బజారులో ఒక బ్రేక్‌ ఫాస్ట్ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఆయన దుకాణంలో ఇడ్లీ చాలా ప్రసిద్ధి చెందింది. ఇడ్లీ, కొబ్బరి చట్నీ, వడలు మాత్రమే చేస్తుంటారు. అవి తినడానికి వేచి ఉండాల్సిందే.
ఆయన 13 ఏళ్ల వయసులో ఈ వ్యాపారంలోకి వచ్చారు. నేటికీ ఆయన కఠోర శ్రమను, ఆహార స్వచ్ఛతను మాత్రమే నమ్ముతారు.
ఉదయం 5 గంటలకు స్నానం చేసి, దేవుడిని పూజించిన తర్వాత, ఆయన ఇంటి నుంచి నడుచుకుంటూ దుకాణానికి వస్తారు. ఇంటి నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఈ ఇడ్లీ దుకాణం ఉంది. ఈ తొంభై అయిదేళ్ళ వయస్సులోనూ ఆయన ఈ కిలోన్నర మీటర్ దూరమూ నడుస్తారు. ఎవర్నీ లిఫ్ట్ అడిగారు.
నేటి యువతకు ఆయన కఠోర శ్రమ ఒక ఆదర్శం. 
శ్రమించాలనే మనస్సు ఉండాలి తప్ప  వయసు అందుకు అడ్డంకి కాదంటారు ఇజాకియా పిళ్ళై. 
ఈ యువ వృద్ధుడైన ఇజాకియా పిళ్ళైకి నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

కామెంట్‌లు