చూపుల చిత్రాలు – మౌన సందేశాలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

(ఓ చూపెయ్యండి)

చూపులు — మాటలు పలకక ముందే
మనసు పలికే మధుర భాషలు,
కన్నుల కిటికీ తెరచి
హృదయ గర్భాన్ని చూపించే వెలుగులు

కంటి చూపులు —
కలల దారులు; భావాల దీపాలు,
కొంటె చూపులు —
నవ్వుల పండుగలు; చిలిపి గాలులు.

దూరపు చూపులు —
దూరాన్ని దగ్గర చేసే వంతెనలు,
దొంగ చూపులు —
చూడనట్టే చూసే చూపులు.

కాల్చే చూపులు —
కోపాగ్ని రగిలించే క్షణాలు,
కట్టేసే చూపులు —
అనురాగపు బంధాలు.

పక్క చూపులు —
చక్కని దారి మళ్లింపులు,
వక్ర చూపులు —
ఈర్ష్య మబ్బులు.

చుట్టపు చూపులు —
అనురాగ బంధాలు,
చివరి చూపులు —
జ్ఞాపకాలలో నిలిచే నిశ్శబ్దాలు.

చూపులు చిన్నవైనా —
మనసుల ప్రపంచం మార్చే మహాశక్తులు,
మాటలు మరిచినా —
చూపులు జీవితాంతం మిగిలే గుర్తులు.

కామెంట్‌లు