అది 1970వ దశకం. 20 ఏళ్ల వయసులో ఉన్న ఆ చురుకైన యువతి తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఒక సాధారణ భారతీయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె, డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ వైద్య ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేక, జంతుశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత, ఆమె విదేశాల్లోని వైద్య కళాశాలలకు మళ్ళీ దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు కానీ స్కాలర్‌షిప్ లభించకపోవడంతో, ఆస్ట్రేలియాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఫెర్మెంటేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాలని అనుకున్నారు.
ఆ కోర్సు ఆమె జీవితంలో ఒక మలుపైంది. ఎందుకంటే అది సూక్ష్మజీవ శాస్త్రాల పట్ల ఆమె దృక్పథాన్ని మార్చడమే కాకుండా, బ్రూయింగ్, ఫెర్మెంటేషన్ రంగంలో ఆమెలో ఎంతో అభిరుచిని పెంపొందించింది. దాని ఫలితంగా ఆమె ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో బంగారు పతకంతో ప్రథమ స్థానం పొందారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే, ఆమె వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించారు.
కానీ ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆమె కలలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి.
ప్రతి కంపెనీ, ఆమె అర్హతలను, నైపుణ్యాలను గుర్తించినప్పటికీ, తిరస్కరించింది. ఎందుకంటే, ఆ రోజుల్లో భారతదేశంలో, ఫెర్మెంటేషన్ ఉద్యోగాలు ఎక్కువగా పురుషాధిక్య పరిశ్రమలైన "హార్డ్-డ్రింక్" కంపెనీలకే పరిమితమై ఉండేవి.
ఆమె అర్హతలకు సరిపోయే ఏకైక పదవి "మాస్టర్ బ్రూవర్" మాత్రమే. ఇది సాధారణంగా ఏ బ్రూవరీలోనైనా అత్యున్నతమైన ఉద్యోగం. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలను మహిళలకు ఇవ్వడం వల్ల, ఆమె కింద పని చేసే పురుషుల అహం దెబ్బతింటుందని, అలాగే మొత్తం కార్మికుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కంపెనీలు భావించాయి.
ఇలాంటి వరుస ఉద్యోగ తిరస్కరణల కారణంగా, ఆ యువతి తీవ్ర నిస్సహాయతకు, నిరాశకు లోనైంది.
ఎంతో ఆత్మపరిశీలన తర్వాత, ఒక మంచి రోజున, ఆమె తనలో తాను ఇలా అనుకుంది - "బ్రూయింగ్ కంపెనీలు నన్ను ఉద్యోగంలోకి తీసుకోకపోతే ఏమైంది? నేను నా సొంత కంపెనీని ప్రారంభిస్తాను. అది కేవలం బ్రూయింగ్ పరిశ్రమతో పోటీ పడటమే కాకుండా, నా మైక్రోబియల్ సైన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చవకైన మందులను కూడా అభివృద్ధి చేయాలని.
ఆ విధంగా ఆమె 1970వ దశకంలో (ఖచ్చితంగా చెప్పాలంటే 1978లో) తాను అద్దెకు ఉంటున్న ఇంటి గ్యారేజీలో, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిన ఒక బ్రూయింగ్ & మైక్రోబియల్ కంపెనీని ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 5 బయోటెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది!
ఇంతకూ ఆమె మరెవరో కాదు, బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్ షా.
ఈ రోజుకీ ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
షెరిల్ రెగిస్ పాడిన ‘కమ్ ఇన్ అవుట్ ఆఫ్ ది రెయిన్’ అనే అందమైన పాట ఆమెను దృష్టిలో పెట్టుకొని రాశారేమో అని అనిపించింది. షెరిల్ పాడిన ఆ అందమైన మాటలు ఆమెకే అంకితం.
“నీ కలను అనుసరించు
నీలో ఉన్న ధైర్యం
నిన్ను ఎంతో బలంగా నిలబెడుతుంది.
అందుకే నువ్వు కింద పడిన ప్రతిసారీ లేవగలవు.
నీ కాళ్ళ మీద నువ్వే నిలబడగలవు.
ఈసారి నువ్వు తప్పు చేయవు
నీ సంకల్పాన్ని నిలబెట్టుకోవడానికి
నీ శాయశక్తులా ప్రయత్నించు.
పట్టుదలతో, నువ్వు ఏమవ్వాలనుకున్నావో ఆ వ్యక్తిగా మారు”
ఆమె బెంగళూరులో ఉన్న బయోటెక్నాలజీ కంపెనీ అయిన బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ గా, వ్యవస్థాపకురాలిగా ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మాజీ చైర్‌పర్సన్. 2014లో, సైన్స్, కెమిస్ట్రీ పురోగతికి ఆమె చేసిన విశేష కృషికి గాను ఓత్మెర్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆమె ఫైనాన్షియల్ టైమ్స్ 2011 టాప్ 50 ఉమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో ఉన్నారు. 2019లో, ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలో 68వ అత్యంత శక్తివంతమైన మహిళగా పేర్కొంది. ఆమె వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2020గా ఎంపికయ్యారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి