తిరుమలరావుకు కళింగాంధ్ర సంపుటి బహూకరణ

 జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత కుదమ తిరుమలరావుకు గూనభద్రలో మన కళింగాంధ్ర వ్యాస సంపుటిని బహూకరించారు. పిఎంపాలెం సి.ఐ. గేదెల బాలకృష్ణ, గూనభద్ర శ్రీశ్రీశ్రీ రాధాకాంత స్వామి 90 వ డోలో మహాత్సవాల నిర్వాహక ప్రతినిధి జి.వి.భాస్కరరావు, కొత్తూరు రచయితల వేదిక కార్యవర్గ సభ్యులు అంపిలి ప్రశాంత్ కుమార్ ల చేతులమీదుగా ఆయన ఈ పుస్తకాన్ని స్వీకరించారు. ముంజూరు సంకలనంతో ఉత్తరాంధ్ర రచయితల భావసౌందర్యాన్ని చాటిచెప్పిన దుప్పల రవికుమార్, తాను స్వయంగా రచించిన మన కళింగాంధ్ర సంపుటిని ఈ ప్రముఖుల చేతులమీదుగా తిరుమలరావుకు బహూకరించారు. పుస్తక గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ప్రొఫెసర్ కెఎస్ చలం, చల్లపల్లి స్వరూపరాణి, డా.సంగిశెట్టి శ్రీనివాస్, జి.వెంకటకృష్ణల ఆప్తవాక్యాలతో దుప్పల రవికుమార్ రచించిన కళింగాంధ్ర విశ్లేషణలు మిక్కిలి ఆవశ్యకతతో కూడిన అంశాలని అన్నారు. కళింగాంధ్రలో వెనుకబాటు ప్రజల పాపమా, తిత్లీ తుపాను, మందస తిరుగుబాటు, సోంపేట నేర్పిన గుణపాఠాలు, జన చైతన్యంతోనే జన ఉద్యమాలు, తీరపరిరక్షణతోనే తుపాను ముప్పు తప్పుతుందంటూ రవికుమార్ పెక్కు అంశాలను విపులీకరించారు. నాగావళి తీరాన వెలసిన స్వతంత్ర పూర్వ సాహిత్యం, కళింగాంధ్ర బహుజన సాహిత్యాల గూర్చి విశ్లేషించారు. బురద నుంచి బువ్వ, ఉత్తరాంధ్ర కన్నీళ్లు, కళింగాంధ్ర ముందు పెను సవాళ్లను వివరిస్తూ రవికుమార్ రూపొందించిన వ్యాసాలు ఎంతగానో ఆలోచింపజేస్తాయని తిరుమలరావు అన్నారు. నరసన్నపేట లెక్చరర్ ఐన దుప్పల రవికుమార్ కు, ప్రచురించిన సిక్కోలు బుక్ ట్రస్ట్ కు తిరుమలరావు మిక్కిలి కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు