చిన్నరాయే కదాని చిన్నచూపేల..?: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి
ఓ మిత్రమా..!
రాళ్లే కదాని
చిన్నచూపు చూడకు …

కాలం చెక్కితే రేపు
అవే కళాఖండాలౌతాయి
గర్భగుడిలో మనం మొక్కే
సుందర దేవతా శిల్పాలౌతాయి..!

ఓ మిత్రమా..!
రాళ్లే కదాని
చిన్న చూపు చూడకు...!

ఈ రత్నాల వజ్రాల గీతాలు
ఈ మణిమాణిక్యాల మెరుపులు
నిద్రించేది భూగర్భంలోనే కదా..!

ఓ మిత్రమా..!
చిన్నరాయే కదాని
చిలిపిగా విసరకు... అది
నిశ్చల జలంలో పడినా
అందమైన అద్దంపై పడినా
నీ ప్రతిబింబమే చిధ్రమై
నిన్ను నీవే కోల్పోతావు…!

ఓ మిత్రమా..!
చిన్నరాయే కదాని
ఆకాశం వైపు విసరకు
అది తిరిగి పడేది నీపైనే
పగిలేది‌ నీ తలనే కదా..!

ఓ మిత్రమా..!
అద్దాల మేడలో నివసిస్తూ
రాళ్లు విసరడం మానుకో…
అవి శత్రువులకు తగలక
ముందే పగిలి ముక్కలయ్యేది
నీ అందమైన అద్దాల మేడే కదా..!

అందుకే మిత్రమా…!
రాతిగుండెల రాక్షసుడివై ఎన్ని
రంగురాళ్లు ధరించి లాభమేమి..?

వెన్నలా కరిగే కరుణతో
పూలలా పరిమళించే ప్రేమతో
మనసున్న మనిషిగా జీవించు...
మంచితనం మానవత్వమే మనిషికి
ఆభరణమని కలనైనా మరువకు...!

కామెంట్‌లు