సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము- 218వ రోజు
నీ మనసు లో పాండవులపై పగనుంచి మరలటం లేదు. ఏమి చేస్తాం. ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా?అని విదురుడు ధృతరాష్ట్రుడిని ప్రశ్నించాడు.
ఇదంతా విని ధృతరాష్ట్రుడు, " నీ నీతివాక్యాలతో నా మనస్సు కుదుటపడదు. ఇంకా చెప్పు" అన్నాడు. అప్పుడు విదురుడు ఇంకా ఇలా అన్నాడు. "భూలోకంలో ధర్మం కలిగిన పురుషుడికి అనుభవించదగిన ఫలాలన్నీ చేరతాయి. కీర్తి కూడా కలుగుతుంది. పొగడ్త ఎంతకాలం ఉంటుందో అంతకాలమూ పుణ్యలోకాలు కలుగుతాయి. పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షపాతం వదిలి ఇరువురికి సంధి చెయ్యి. అందు వలన వారూ వీరూ కూడా సుఖపడతారు. చేయదగినవి అని పాపాలు చేస్తే అవే ఇష్టంగా మారతాయి. ధర్మకార్యాలు చేయరానివి అని తలిస్తే అలాగే అవుతాయి.
పెద్దలు లేని సభ, సభ కాదు, న్యాయం మాట్లాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు. ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మధ్యమము, భారంగా బ్రతుకు ఈడుస్తూ బతకడం అధమం. నీతిమాలినవారిని ఉత్తములు మెచ్చుకోరు.
నీ పుత్రులు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటారు. కర్ణుడు మొదలైనవారైతే అంతకుముందే కొవ్వెక్కినవారు.నీవేమో నీతి మార్గం అనుసరించవు.
పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. నీ తమ్ముడు పాండురాజు వలెనే అతని కొడుకులు పాండవులు కూడా నిన్ను భక్తితో కొలుస్తారు.  వారిని నిర్మలమైన మనసుతో ఆదరించడం మంచిది. 
పాండవులు దిక్కులేనివారు అని అనుకోకు. ఏ కారణం లేకుండానే ఉపకారబుద్ధితో ఇతరుల పనులగురించి బాధపడేవారే ఆ పాండవులకు దిక్కు.
ఒకడు ఒక మహానుభావుడి పోషణలో అతని ఔన్నత్యం ఆసరాతో మంచి సంపదతో ఏ లోటు లోకుండా ఉండి, చివరకు అటువంటి మహానుభావుడికే హాని చేస్తే ఆ కృతఘ్నుడి శవాన్ని కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి. కాబట్టి చేసిన మేలు మరిచిపోవడం తప్పు. పాండురాజు నీకు మంచి భక్తుడు. పాండవులు కూడా నీకు తేజస్సు, లాభం సంపాదించి పెట్టారు. వారిని ఆదరించు.
ఒకప్పుడు మంచి బ్రతుకు బ్రతకవచ్చు, ఒకప్పుడు ఆపదలకు గురికావచ్చు. ఒకప్పుడు ప్రశంసలు పొందవచ్చు, ఒకప్పుడు నిందపడవచ్చు. త్యాగము లేదా అడుగుకొనే స్థితి కలుగవచ్చు. జీవితంలో ఇటువంటి సుఖదుఃఖాలు కలుగుతూ ఉంటాయి. వాటికోసం చింతించడం ఎందుకు.
ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది. మిక్కిలిగా దుఃఖిస్తే  శత్రువుకు అది సంతోషాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! నేను ఉత్తముడైన ధర్మరాజును  నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తథ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు.
విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను ఆక్రమించడం, బ్రాహ్మణులను అగౌరవ పరచడం ఎవరైతే నివారిస్తారో వారు గొప్పవారు.దాయాదులు కలిసి ఉంటే ఒకరికొకరు రక్షగా, ఆశ్రయంగా ఉండి తామరలతో ప్రకాశించే సరస్సులా ఉంటారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు