శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 107
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
86. కణ్ఠాథకటిపర్యన్తమధ్య కూట స్వరూపిణీ 
(షోడశాక్షరీ)
87. శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ 
(షోడశాక్షరీ)
ఎనభై ఏడవ నామ మంత్రము - 
  ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః
పన్చదశాక్షరీ మహామంత్రం లోని మొదటి ఐదు అక్షరముల, "క, ఏ, ఈ, ల, హ్రీం" కూటమి, "వాగ్భవకూటమి" అని; ఆరక్షరముల రెండవ కూటమి, "హ, స, క, హ, ల, హ్రీం" ను "కామరాజకూటమి"   అనీ,  ఈ రెండు కూటములు పరమేశ్వరి యొక్క "ముఖ పద్మము" మరియు "హృదయ స్థానమును" ప్రతిఫలింపచేస్తాయి అని ముందు నామములలో తెలుసుకున్నాము. పన్చదశాక్షరీ మహామంత్రం లోని చివరి నాలుగు అక్షరములైన, "స, క, ల, హ్రీం" యొక్క కూటమిని "శక్తి కూటమి" అంటారు. ఈ శక్తి కూటమి తో ప్రకాశిస్తున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ" అని కీర్తించారు. ఈ విధంగా శక్తి కూటమి లో ప్రకాశిస్తున్న, అమ్మలగన్నయమ్మకు నమస్కారము.
పన్చదశాక్షరీ మహామంత్రం లోని చిట్ట చివరి  నాలుగు అక్షరముల సమూహము "స, క, ల, హ్రీం" సాధకునిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసి, ఆ సాధకుని ఎదుగుదలకు సహకరిస్తుంది, పరమేశ్వరి యొక్క"సూక్ష్మ శరీరం" లోని ఈ "శక్తి కూటమి". భాస్కరరాయల వారు,  అమ్మ సూక్ష్మ శరీరం లోని శక్తి కూటమి గురించి, ఇలా చెప్పారు - "కామస్తే హృదివసతీతి కామరాజం" - "అమ్మా! నీ హృదయంలో ఉండి, కాముడు గా పిలువబడే ఈశానుడు, కామరాజు ను సృష్టి చేయడం వల్ల అది నీ శక్తి పీఠం లేదా కూటమి అయ్యింది."
"సకల హ్రీం" అంటే, అన్ని విషయాలను గురించిన పరిజ్ఞానం. అంటే, ఏ సాధకుడు పన్చదశీమహామంత్రంలోని "శక్తి కూటమి" గా పిలువబడే ఈ ఆఖరి నాలుగు అక్షరాలను తదేక దీక్షతో సాధన చేసి, ప్రసన్నం చేసుకుంటారో, ఆ సాధకునికి జగత్తు లోని అన్ని విషయాలను గురించిన పరిజ్ఞానం, అమ్మ అనుగ్రహిస్తుంది. స, క అనే మొదటి రెండు అక్షరాలు మణిపూరము, స్వాధిష్ఠాన చక్రముల మధ్యలో, మూడవ బీజాక్షరామైన "ల" మూలాధార చక్రము లోనూ, నాల్గవ "హ్రీం" బీజాక్షరాము స్వాధిష్ఠాన చక్రములోనూ ఉన్నవి, అని ఊహించుకుని సాధన చేయాలి.
ఈ విధంగా సాధన చేసిన తన సాధకునికి, ముల్లోకాలలోని అన్ని విషయముల మీద, ఉత్తమమైన, ఉదాత్తమైన పరిజ్ఞానం కలిగించడానికి సంసిద్ధయై ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు