శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ -భాగం - 108
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
87. శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధరిణీ 
(షోడశాక్షరీ)
88. మూలమంత్రాత్మికా 
(అష్టాక్షరీ)
ఎనభై ఎనిమిదవ నామ మంత్రము - 
  ఓం మూలమంత్రాత్మికాయై నమః
ధర్మబద్ధమైన అన్ని కోరికలను తీర్చేది, అన్ని మంత్రాలకూ మూలమంత్ర రూపములో దర్శనమిచ్చిన పరమేశ్వరిని చూచిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "మూలమంత్రాత్మికా" అని కీర్తించారు. తన సాధకుల ధర్మబద్ధమైన కోరికలను అనుగ్రహించే లోకమాతకు నమస్కారము. 
"మంత్రం = మననాత్ త్రాయతే ఇతి మంత్రః" దేనిని అయితే నిరంతరమూ, అనునిత్యమూ మననము చేయడం వలన మానవులు తరిస్తారో, దానిని "మంత్రం" అని చెప్పారు దైవజ్ఞులు, ఋషులు, మునులు, తాపసులు మొదలైన వారు.
ధర్మ, అర్ధ, కామ్య, మోక్ష అనే నాలుగు పురుషార్ధాలను, ప్రతీ మానవుడూ తన జీవీత కాలంలో సాధించుకోవాలి. మోక్ష మార్గములో ప్రయాణం చేయాలి. ఈ నాలుగు పురుషార్ధాలనూ సాధించుకోవడానికి మానవుడు మననము చేయవలసిన మంత్రమే, మూలమంత్రము. గత మూడు నామాలలో మనం చెప్పుకున్న "పన్చదశాక్షరీ మహామంత్ర" మే, అమ్మ యొక్క, మూలమంత్రము. అందుకనే, జగన్మాతను "మూలమంత్రాత్మికా" అని కీర్తించారు.
అమ్మ, "సర్వమంత్రాత్మిక". అంటే, ఏడుకోట్ల మంత్రములకూ అమ్మ పన్చదశాక్షరీ మహామంత్రంమే, మూలము. ఈ పన్చదశాక్షరీ మహామంత్రమే అమ్మ యొక్క మూల స్వరూపము. ఆత్మస్వరూపము. ఈ పన్చదశాక్షరీ మహామంత్రం సాధన చేయడం వలన, సాధకుడు "ఆత్మ సాక్షాత్కారము" ను పొందగలుగుతారు. ఈ పన్చదశాక్షరీ మహామంత్రం లో ఉన్న అమ్మ రూపమును సాధన చేసి మనసులో నిలుపుకోవడం ద్వారా, మానవుడు చతుర్విధ పురుషార్ధాలు సాధించుకోగలుగుతాడు.
చతుర్విధములైన పురుషార్ధాలనూ సాధించుకోవాలి అని, అనునిత్యము తననే మనోఫలకముపైన ఉంచుకుని సాధన చేసే తన సాధకులకు, వారి కామ్యాలను తీర్చటానికి సంసిద్ధయై ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం మూలమంత్రాత్మికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు