గాంధీ మందిరం లో ఘనంగా రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి

 శ్రీకాకుళం శాంతినగర్ లో గల గాంధీ మందిరం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘ సంస్కర్తల తేజోమూర్తుల స్మృతి వనంలో గురువారం రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. విగ్రహం దాతలు శాలిహుండం రవికుమార్, శ్రీదేవి దంపతులు ముందుగా ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మందిరం సభ్యులు, ఠాగూర్ స్కూల్ విద్యార్థులు పుష్పాలంకరణ చేసారు. విశ్వకవిగా, నోబెల్ బహుమతి గ్రహీతగా, బహుగ్రంధ రచయితగా, జనగణమన గీతాన్ని జాతికి అందించిన మహనీయునిగా, చిత్రకారునిగా, స్వాతంత్ర్య సమరయోధులుగా విభిన్న రంగాల్లో విశిష్ట సేవలనందజేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు చౌధరి రాధాకృష్ణ, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి, భోగెల ఉమామహేశ్వరరావు, శాలిహుండం రవికుమార్ కొనియాడారు. అనంతరం గాంధీ మందిరం లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రఘుపతి రాఘవ గీతాన్ని ఆలపించారు. విగ్రహదాతలు శాలిహుండం రవికుమార్, శ్రీదేవి దంపతులను సంస్థ తరపున చౌధరి రాధాకృష్ణ, నక్క శంకర రావు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో  గుత్తు చిన్నారావు, శాస్త్రి, గేదెల ఇందిరా ప్రసాద్, పాపయ్య ,జయలక్ష్మి, సత్తిబాబు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు