శతాబ్దాలుగా భారతీయులచే పూజలందుకుంటున్న ఆంగ్లేయుడు
గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆ విదేశీయునికి విగ్రహాలు, పూజలు
ధవళేశ్వరం ఆనకట్ట ఒడ్డున ఆ మహనీయుని పేర పెద్ద మ్యూజియం, ఆయన చరిత్ర, కృషి, ఫలితాలుతో చిత్రాలు
* మ్యూజియం ఆవరణలో ఆయన గుర్రం స్వారీ చేస్తున్న నిలువెత్తు కాంస్య విగ్రహం
ఇంగ్లాండ్ లో పుట్టి పొట్ట చేతపట్టుకొని ఉద్యోగానికి వచ్చిన ఆ ఆంగ్లేయునకు భారతావని అడుగడుగునా విగ్రహాలు నెలకొల్పి నిత్యస్మరణీయునిగా కొలవడం వెనుక గల ఆయన కృషి, అకుంఠిత దీక్ష నెమరువేసుకుందాం.
ఆ ఆంగ్లేయుడు మరెవరో కాదు...సర్ ఆర్థర్ కాటన్ .ఆయన 224 వ జయంతోత్సవం సందర్భంగా ఈ వ్యాసం.
ఉద్యోగరీత్యా బ్రిటిష్ ఇండియాలో అడుగిడిన ఆర్థర్ కాటన్ తన విధి నిర్వహణ, కుటుంబం, ఆదాయం - వీటికే పరిమితం కాకుండా భిన్నంగా ఆలోచించాడు, వాస్తవాలను తెలుసుకొని మేథో మధనం చేసి శాశ్వత ప్రాతిపదికన కార్యక్రమం నిర్వహించారు.
1921లో మద్రాసు దక్షిణ ప్రాంత చెరువుల శాఖ ఇంజినీరుగా చేరిన ఆయన దృష్టి గోదావరి నది పరీవాహక ప్రాంతంపై పడింది. గోదావరి నది ప్రవాహం గ్రామాలను ముంచెత్తడానికి, చేతికందిన పంటను నాశనం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేది. ఉవ్వెత్తున ప్రవహించే గోదావమ్మ పంటనాశినిగా పేరొంది, గోదావరి నీరు తమకు ఉపయోగ పడకుండా సాగరంలో విలీనాం కావడం రైతులకు తీవ్ర మనస్థాపానికి గురిచేసేది. ఆ సమయంలో ఆర్థర్ కాటన్ రైతుల కడగండ్లు చూసి తీవ్రంగా కలత చెందాడు. రహదారి సౌకర్యం లేకపోవడంతో రాజమండ్రి నుండి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం వరకు గుర్రంపై ప్రయాణం సాగించి, సాగరంలో వృధాగా కలిసి పోతున్న గోదావరి జలాలను నిలువరించి పంట పొలాలకు తరలిస్తే ఈ ప్రాంతం నిత్య పాడిపంటలతో శోభిల్లి బంగారు పంటలు పండుతాయని, రైతుల బాధలు తొలగిపోతాయని భావించాడు. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట మరియు నావికా యోగ్యమైన పంట కాలువలు త్రవ్వించాలని ప్రణాళికలు సిద్ధం చేసి, బ్రిటిష్ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1847 - 52 సంవత్సరాలలో రాత్రింబవళ్లు ఓ యజ్ఞంలా పనిచేసి ఐదేండ్ల లో ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించి పంట పొలాలకు సాగునీరు అందివ్వడం ప్రారంభించాడు. అంతవరకు గోదావరి నదిని దుఃఖదాయినిగా భావించిన రైతులకు, ప్రజలకు వర ప్రదాయినిగా రూపుదాల్చింది.
మాగాణి భూములు మూడు పంటలుతో రైతులను , ప్రజలను, వ్యాపారులను ధనవంతులు చేసి భారతావని ధాన్యాగారం గా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీనికి కారకులైన ఆర్థర్ కాటన్ ను అపర భగీరథుడుగా, తమ పాలిట దైవంగా కొలవడం ప్రారంభించారు. గ్రామగ్రామాన ఆయన విగ్రహాలను నెలకొల్పి పూజించారు. ధవళేశ్వరం ఆనకట్ట ఒడ్డున విశాలమైన ప్రాంగణంలో ఆయన పేరుతో పెద్ద మ్యూజియం నిర్మించి , గుర్రపు స్వారీ చేస్తున్న ఆర్థర్ కాటన్ కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. హైదరాబాద్ టేంక్ బండ్ పైన కూడా ఆర్థర్ కాటన్ నిలువెత్తు విగ్రహం నెలకొల్పారు. గోదావరి జిల్లాల ప్రజలకు ఆయన నిత్య స్మరణీయుడు, ఆరాధ్యుడు.
1803 మే 15 న ఇంగ్లాండ్ ఆక్స్ ఫర్డ్ షైర్ వుడ్ కోట్ లో హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు జన్మించిన ఆర్థర్ కాటన్ పదిహేను ఏళ్ళు వయస్సులో మిలటరీ క్యాడెట్గా చేరి 1821లో భారతదేశానికి వచ్చి మద్రాసు ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ ప్రాంత చెరువుల శాఖ ఇంజినీరుగా పనిచేసారు. 1861 లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను సర్ బిరుదుతో సత్కరించింది.
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి ముందు ఆయన కొలెరూన్ నదిపై ఆనకట్ట, పంట కాలువలు నిర్మించి తంజావూరు జిల్లాను సస్యశ్యామలం చేసి ధనధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమంగా నిలిపారు. ప్రకాశం బ్యారేజి , బెంగాల్, ఒడిషా, బీహార్ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలను రూపొందించడంలో విశేషంగా కృషిచేసిన సర్ ఆర్థర్ కాటన్ 1860 లో పదవీ విరమణ చేసి స్వదేశం ఇంగ్లాండ్ వెళ్లిపోయారు.
-----------------------------
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి