మన పుణ్య క్షేత్రాలు-67: -డా:సి.హెచ్.ప్రతాప్
 కెట్కావలే బాలాజీ ఆలయం
నమో యజ్ఞవరాహాయ నరసింహాయ తే నమః |
నమో వామన రూపాయ వేంకటేశాయ తే నమః ||
భావం: యజ్ఞవరాహ రూపానికి, నరసింహ రూపానికి నమస్కారం. వామన రూపానికి మరియు వేంకటేశ్వర రూపానికి నా నమస్కారాలు.
మహారాష్ట్రలోని పుణె నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై వెలసిన కెట్కావలే బాలాజీ ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఇది అచ్చమైన ప్రతిరూపం. దక్షిణ భారత దేశానికి వెళ్లలేని భక్తుల కోసం పశ్చిమ భారత దేశంలో తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే దీనిని 'ప్రతి బాలాజీ ఆలయం' అని భక్తులు ఎంతో భక్తితో పిలుచుకుంటారు.
ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే, దీనిని 'వేంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో నిర్మించారు. వి.హెచ్. గ్రూప్ వారు సుమారు 27 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 1996 నుండి 2003 వరకు ఏడు సంవత్సరాల పాటు అత్యంత నిష్ఠతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను, వైభవాన్ని ఇక్కడ కూడా పునఃసృష్టి చేయాలనే సంకల్పంతో ప్రతి అంగుళాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దారు. తిరుమలలోని గర్భాలయం, కాష్ఠ శిల్పకళ (వూద్ వొర్క్), పూజా విధానాలు మరియు అర్చకులు కూడా తిరుమల సంప్రదాయాలనే ఇక్కడ అనుసరిస్తారు.
ఆలయ నిర్మాణ శైలి మరియు వాస్తు విశిష్టత భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది సంప్రదాయ దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ప్రధాన గోపురం, గర్భాలయం మరియు ఆలయ ప్రాకారం తిరుమల క్షేత్రాన్ని తలపిస్తాయి. ఇక్కడి ప్రధాన విగ్రహం సుమారు 9 అడుగుల ఎత్తు కలిగి, నల్లటి గ్రానైట్ శిలతో అత్యంత సుందరంగా చెక్కబడింది. ఆలయ రాజగోపురం సుమారు 30 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. ప్రధాన దైవంతో పాటు ఇతర దేవతామూర్తుల కోసం ప్రత్యేక సన్నిధులు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి.
ఆలయ లేఅవుట్ భక్తుల సౌకర్యార్థం ఎంతో ప్రణాళికాబద్ధంగా రూపొందించబడింది. భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు, విశాలమైన ప్రాంగణాలు మరియు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి భక్తులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. తిరుమల వెళ్లలేని వారు ఈ క్షేత్రాన్ని దర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
కెట్కావలే బాలాజీ ఆలయం కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, ఇది ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు తిరుమల భక్తులకు ఇది ఒక సొంత ఇల్లులా అనిపిస్తుంది. ఇక్కడి క్రమశిక్షణ, శుభ్రత మరియు భక్తి భావం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

కామెంట్‌లు