“వినరో భాగ్యము విష్ణు కథలు” ( 75) :- ఎం బిందుమాధవి

 “భూతావాసో వాసుదేవ: సర్వాసు నిలయో ఽ నల:
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో ఽ ధాపరాజిత:”

“బామ్మా..ఈ రోజు శ్లోకానికి నేను అర్థం చెప్పనా” అని అడిగాడు పవన్ ఉత్సాహంగా.
“సరే చెప్పు” అని బామ్మ అనగానే..”అన్ని జీవులు సృష్టికి ముందు ఆయన గర్భంలోనే బీజ రూపంగా ఉంటాయి. శ్రీమన్నారాయణుడు సృష్టి చెయ్యాలి అని అనుకోగానే తన నాభి కమలం నించి ముందు బ్రహ్మ గారిని సృష్టిస్తాడు. తిరిగి ఆ బ్రహ్మ గారు ప్రజాపతుల ద్వారా సృష్టిని విస్తరిస్తాడు. జీవ రాశుల సృష్టి జరిగాక, ఆ అన్ని జీవుల్లో ప్రాణ శక్తి రూపంగా మళ్లీ ఆ శ్రీమహావిష్ణువే నిండి ఉంటాడు. అంటే..ఇటు నించి అటు, అటు నించి ఇటు..రెండు వైపుల చూసినా.. ఉండేది ఆయన చైతన్య రూపమే కాబట్టి ‘భూతావాసో వాసుదేవ:’ అంటారు” అన్నాడు పవన్.
“బాగా చెప్పావురా” అని బామ్మ మెచ్చుకోగానే..”అలా అన్ని జీవుల చైతన్యానికి ఆధారమైనవాడు, అన్నిటినీ తనలో కలిపేసుకునేవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడి వ్యాపక శక్తికి అవధి, పరిమితి అనేది లేదు అని ఇంతకు ముందు నువ్వు చెప్పావు కదా..అందుకే ఆయనని ‘సర్వాసు నిలయో ఽ నల:’ అంటారు కదా బామ్మా అన్నది మానస.
“అవును. అంతేకాదు.. అధర్మ మార్గంలో నడుస్తూ..ఇతరులని పీడించే దుష్టుల దర్పాన్ని, అహాన్ని ఆయన తొలగిస్తాడు. ధర్మ మార్గంలో ఉంటూ కూడా..అదంతా తమ గొప్పే అని విర్రవీగే వారి గర్వాన్ని, అహంకారాన్ని కూడా తొలగిస్తాడు. శ్రీమహావిష్ణువు..తన పరమానంద రూపము, తన చేతలు అనే అమృతాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటాడు కాబట్టి తృప్తుడుగా ఉంటాడు. అందుకే ‘దృప్త:’ అంటారు.”
“ఇక్కడ మనం ఒక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ఆనందము, తృప్తి అనేవి మానసిక స్పందనలు అయినప్పుడు..ఆయనకి ఒక రూపమే లేనప్పుడు తన చర్యల గురించి తానే ఆనందించడం, తృప్తి చెందడం అని ఎందుకు చెప్పారు అంటే..జీవుల లోని అహంకారాన్ని తొలగించటం, వారు ధర్మ మార్గంలో నించి తప్పిపోకుండా నిరంతరం గమనించుకోవడం అనే ‘దర్పహా దర్పదో దృప్తో’ అనే నామం చెప్పటంలో భావం..తన ఈ చర్య ద్వారా జీవుల మనసులలో తృప్తి పొందేది కూడా ఆయన ఆనంద స్వరూపమే కదా అని!”
“ఆయన అన్ని చోట్లా వ్యాపించి ఉండేవాడు అయినప్పటికీ ఆయనకి దేనితోనూ సంగం అనేది ఉండదు. దేనినీ ఆయన అంటి పెట్టుకుని ఉండడు. ఎంతో శ్రమ చేసి, దుఃఖంతో వేడుకున్నప్పటికీ ఆయనని ధరించే శక్తి, నిలుపుకునే అదృష్టం ఎవరికీ ఉండదు. అలాంటప్పుడు ఒకరి హృదయంలో బందీగా ఉండటం..మరొక చోట కదలకుండా ఉండటం అనేవి ఆయనకి ఉండవు. అయినప్పటికీ పురాకృత పుణ్యమో, పూర్వ జన్మల పుణ్యకర్మల ఫలితంగానో.. ఎంతో శ్రమతో, తమ పట్టుదల-దీక్షలతో, తపశ్శక్తితో నిరంతర ధ్యానంతో జీవించే యోగుల హృదయాలలో అతి కష్టం మీద కొంత సేపు మాత్రమే నిలుస్తాడు. అలా నిలిచినా కూడా ఆయన అనంతుడు కాబట్టి, మరొక చోట ఆయన ఉండడు అనే మాటే ఉండదు. అదే ‘దుర్ధరోధా’ అంటే!”
“జీవులలో..ముఖ్యంగా మనుషులలో ఉండే అంతర్గత శత్రువులు అయిన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు కానీ..అత్యంత బలవంతులు, శక్తివంతులు అయిన బహిరంగ శత్రువులైన దుష్టులు, దుర్మార్గులు, అసురులు కానీ ఆయన్ని జయించలేరు. బహిరంగ శత్రువులు అంతర్గత శత్రువుల ద్వారానే తయారవుతారని మనకి హిరణ్యకశిప-హిరణ్యాక్షుడు, రావణుడు, కుంభకర్ణుడు, కంసుడు..ఇత్యాది రాక్షసుల జీవన విధానం, ఆలోచనా విధానం వల్ల మనకి ఇంతకు ముందే తెలిసింది కదా! అలా అంతశ్శత్రువులు, బాహ్య శత్రువులు కూడా ఆయనని జయించలేదు కాబట్టి ఆయన ‘అపరాజిత:’ అన్నమాట. తెలిసిందా” అని అడిగి..ఆరోజు పాఠం ముగించి పిల్లలని పంపించింది.


కామెంట్‌లు