కుంటికోతి - మంచికోతి: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక కుంటి కోతి, ఒక మంచికోతి వున్నాయి. ఇవి రెండూ కలసి ఒకరోజు అడవిలో పోతా వుంటే దారిలో ఒక పెద్ద మామిడిచెట్టు కనబడింది. చెట్టు నిండా పండ్లే పండ్లు. మంచికోతి గబగబా చెట్టెక్కి బాగా మాగిన కమ్మని మామిడి పండ్లు ఒకొక్కటీ తెంచుకోని సంబరంగా తినసాగింది. కుంటి కోతికి కాలు సరిగ్గా లేదు కదా.... అందుకే అది చెట్టెక్కలేక కిందే నిలబడిపోయింది.
కుంటి కోతికి ఆ మామిడిపండ్లను చూస్తా వుంటే నోరూరసాగింది. కిందే నిలబడి ఆశగా చూస్తా "మంచికోతీ... మంచికోతీ... నాకో పండియ్యవా" అనడిగింది. మంచికోతి చానా దొంగది. అన్ని పండ్లున్నాయి గదా... ఒకటిస్తే దాని సొమ్మేం పోతాది. ఐనా ఇయ్యకుండా ఆ దొంగసచ్చినేది "అబ్బా ఆశ, ఇవి నాకే సరిపోవు. నీకేంది ఇచ్చేది. ఫో... ఫో..." అని కసురుకోనింది.
కుంటి కోతి పట్టు విడవకుండా "పండివ్వకపోతే పోతివిగానీ... కనీసం తొక్కన్నా ఇయ్యవా... నాక్కుంటా" అని బతిమలాడింది. మంచికోతి తొక్కగూడా ఇయ్యకుండా “ఇవి నా పెండ్లానికియ్యాల, నేనివ్వను ఫో ఫో " అనింది. పాపం కుంటి కోతి చానా బాధపడింది.
బాగా మాగిన మామిడిపండ్లు కండ్ల ముందు కనబడతా వుంటే తినాలనే కోరిక మరింత ఎక్కువయింది. అది
దీనంగా చూస్తా "మంచికోతీ... మంచికోతీ... తొక్కియ్యకపోతే పోతివి గానీ.... కనీసం టెంకన్నా ఇయ్యవా... చీక్కుంటా" అని బతిమలాడింది.
పండియ్యకపాయ, తొక్కియ్యకపాయ, కనీసం టెంకైనా ఇయ్యొచ్చు గదా... దాని మీద బండపడ...
అది టెంక గూడా ఇయ్యకుండా “ఇవి నా పిల్లలకియ్యాల, నేనియ్యను ఫో" అనింది. పాపమా కుంటి కోతి ఎంత సేపు నిలబడినా... ఎంత అడుక్కున్నా మంచికోతి ఏమీ ఇయ్యలేదు.
కుంటి కోతి ఇక అక్కడ ఉండలేక ఒక్కతే అడవిలో విచారంగా ఇంటికి పోతా వుంటే దారిలో ఒకచోట ఒక చిన్నరాయి కనబడింది. దాన్నెత్తితే దానికి ఒక చిన్న బంగారు బిళ్ళ దొరికింది. మళ్ళా పోతా వుంటే ఒక పెద్ద రాయి కనబడింది. అదెత్తితే పెద్ద బంగారు బిళ్ళ దొరికింది. కుంటి కోతి దాండ్లను తీసుకోని సంబరంగా పోతా వుంటే దారిలో ఒక పెద్దపుట్ట కనబడింది. పుట్టలో చేయి పెట్టింది. అంతే పుట్టెడు బంగారం దొరికింది. పక్కనే వున్న కొండెక్కింది. కాడెద్దులు దొరికినాయి. సూర్యునికెళ్ళి చూసింది. సూర్యుడు చర్నాకోలా ఇచ్చినాడు.
కుంటి కోతి బండికి ఎద్దులు కట్టి, దాన్నిండా బంగారం వేసుకోని, హుషారుగా వస్తా వుంటే దారిలో మంచికోతి కనబడింది. "ఈ కుంటి కోతికి ఇంత బంగారం ఎట్లా వచ్చిందబ్బా" అని అచ్చర్యపోయి దాన్నే అడిగింది. "కుంతికోతీ... కుంటికోతీ... ఇంత బంగారం ఎక్కడిది నీకు" అని. 
కుంటికోతి చానా మంచిది గదా... జరిగిందంతా చెప్పింది. దాంతో మంచికోతి తాను గూడా బంగారం సంపాదించుకోని రావాలని అడవిలో కొంత దూరం పోయి చిన్నరాయి ఎత్తింది. దానికి చిన్న తేలుపిల్ల కుట్టింది. అబ్బా అని రుద్దుకుంటా ఈసారి పెద్దరాయి ఎత్తింది. అంతే... పెద్దతేలు కుట్టింది. దెబ్బకు కిందబడి గిలగిలలాడింది.
అయినా ఆశ చావక బంగారం కోసం పుట్టలో చేయి పెట్టింది. వెంటనే ఒక పూడుపాము కరిచింది. అలాగే కష్టపడి కొండెక్కసాగింది. సగం మధ్యలో జారిపడి కాళ్ళు రెండూ విరిగినాయి. సూర్యుని వంక చూసింది. వెంటనే రెండు కండ్లూ పోయి గుడ్డిదయిపోయింది.
**********
కామెంట్‌లు