శివుడే దేవాది దేవుడని చాటిన యోగి మన వేమన !: - గుర్రాల లక్ష్మారెడ్డి.-సెల్.9491387977. కల్వకుర్తి
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందు జన్మించిన కవి వేమన మహా సిద్ధ పురుషుడు. ఎంతటి మహా యోగేశ్వరుడో, అంత గొప్ప కవిశ్వరుడు, సత్యవాది. సత్యాన్ని సూటిగా, స్పష్టంగా భయపడకుండా కుండ బద్దలు కొట్టినట్లు నవలేశమైన భయం లేకుండా, సత్యాన్ని లోకానికి వ్యక్తం చేసిన గొప్ప సిద్ధ పురుషుడు వేమన.
వేమన కేవలం శాస్త్ర జ్ఞానం కలిగిన మహా పండితుడు మాత్రమే కాదు. ఆత్మసాక్షాత్కారమును సదా అనుభూతిగా పొందే సిద్ధారుఢుడు. మనస్సును సమూలంగా నాశనం చేసిన మహా సిద్దేశ్వరుడు. మాయా మొహాలను జయించిన మహాయోగిశ్వరుడు. ధ్యానములో ఎన్నో తత్వ రహస్యాలను, మరెన్నో సాధన రహస్యాలను, ఎన్నో సృష్టి రహస్యాలను గ్రహించిన యతీశ్వరుడు మన వేమన యోగి.
ధ్యానములో వేమన ఏ సత్యాలను, ఏ రహస్యాలను గ్రహించాడో ఆ నగ్న సత్యాలను, ఆ పరమ రహస్యాలను తను రచించిన పద్యాలలో నిక్షిప్తం చేసి లోకానికి బహిర్గతం చేశాడు. శివుని ప్రధాన గ్రంథాలలో, శివుని తత్వ వాగ్మయంలో ఏ సత్యం, ఏ తత్వం ప్రతిపాదించబడిందో ఆ పరమ సత్యానికి, ఆ నిగూడ తత్వానికి ప్రమాణంగా, సాక్షంగా నిలిచాడు మన వేమన యోగి.
     బ్రహ్మ విష్ణువులు దేవేశులు. అయితే, శివుడు దేవదేవేశుడని వేమన లోకానికి చాటాడు. శివుడే మూల దైవమని, ఆ శివుడే ఆది దైవమని వేమన లోకానికి తెలియజేశారు. శివుని సాక్షాత్కారం కలిగితే గాని మోక్షం లభించదని, శివుడిని ఆరాధించని జన్మ విత్తమని, శివారాధనయే సాటిలేని శ్రేష్ట ఆరాధన అని, ఉత్తమోత్తమ ఆరాధన అని వేమన యోగి లోకానికి చాటి చెప్పాడు.
       వేమన యోగి తన పద్య వాంగ్మయములో శివుడే దేవాది దేవుడని, ఆదిదేవుడని, పరమ పురుషుడని, పరాత్పర దైవమని, సర్వోత్తముడని, దేవతా సార్వభౌముడని, మోక్ష కారకుడని, జ్ఞాన ప్రధాతయని, ఈ లోకానికి ఎలుగెత్తి చాటాడు.
శివుడే గురువు. మోక్షమునకై శివ జపతపములు చేయవలెను. శివుని పై మనసును నిలిపినచో అజ్ఞానము నశించును. హృదయమందు శివుడిని నిశ్చలంగా ధ్యానించుము. శివుడిని అనన్య భక్తితో ఆరాదిస్తే సిద్ధత్వం కలుగును. బైటి స్తుతి వలన మేలు కలుగదు. శివుడిని ధ్యానిస్తేనే, ఎలాంటి ప్రయాస లేక ఆ భగవంతుని సాక్షాత్కారము కలుగును. శివ పంచాక్షరి జపము వలన సకల కర్మలు నశించి, బ్రహ్మజ్ఞానము కలుగును. అజ్ఞానము, మిథ్యా జ్ఞానము నశించును.
మానవులు మాయావశులై బ్రహ్మ విష్ణు రుద్రుల యందే భక్తి చూపుదురు. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి పుత్రులో, వారి జనన హేతువగు శివతత్వ స్వరూపం ఎట్టిదో తెలుసుకోవడానికి ప్రయత్నించరు.
ఆ శివుని పూజించినచో సమస్త సంపదలు, అష్టైశ్వర్యములు కలుగును. శివుని ఐదు ముఖముల నుండి పంచాక్షరి జనించెను. ఆ పంచాక్షరి లోని ఐదక్షరముల నుండియే ప్రపంచము పుట్టెను. శివుడినే మీరందరు స్తుతించి ఆరాధించండి. సామాన్య మానవులు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారని చర్చించబోయి, తెలియక నరకమున పడుచుందురు. అంతేకానీ త్రిమూర్తులను మించిన ఆదిమూర్తి అగు పరమశివుని తెలుసుకోవడానికి ప్రయత్నించరు. బ్రహ్మ సృష్టి చేయునని, విష్ణువు పోషించునని, రుద్రుడు నశింపజేయునని అందురు. ఈ ముగ్గురికిని మూలమైన శివుడు ఒక్కడే అని ఈ తత్వమును తెలుసుకొనుము.
ఈ విధంగా యోగివేమన శివుడే దేవాది దేవుడని లోకానికి ఎలుగెత్తి చాటాడు. ఆదిదేవుడు, పరమ పురుషుడైన శివుడిని ఆరాధించమని లోకానికి సందేశము ఇచ్చెను. కాబట్టి శివుడిని చక్కగా ఆరాధించు. తరించు. ఆనందంగా తన్మయుడవై జీవించు.

కామెంట్‌లు