ప్రకృతియే మన మనుగడ !: - గుర్రాల లక్ష్మారెడ్డి -\సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
పచ్చా పచ్చని చెట్లను కోరి పెంచుదాం
పర్యావరణమును పరిరక్షించుదాం
ఆ పచ్చని ప్రకృతియే మనకు మనుగడ
మన వెచ్చని బ్రతుకుల్లో ఉండదు ఏ గడబిడ !

జానడంత గోతి తీసి బీజాన్ని పాతిపెట్టు
జాగ్రత్తగా మరువకుండా రోజు నీళ్లు పట్టు
పుడమి పొరల తన్నుకొని మొక్క పైకి వస్తుంది
కాశి పూసి ప్రకృతికి కొత్త వన్నె తాను తెస్తుంది !

మనం చేపట్టిన ఈ హరిత విప్లవం నిజంగా
భవిష్యత్తు తరాలకు మారుతుంది వరంగా
ఔషధ గుణాలున్న మొక్కలను నాటుదాం
ఆరోగ్య రక్షణే ప్రధానమని అంతా చాటుదాం !

ఒక్కొక్కరు నాటాలి నాలుగేసి మొక్కలు
బక్క చిక్కిన బతుకుల్లో తొలిగేను చిక్కులు
అవి ఎదిగి ఎదిగి ఔతాయి ఎత్తైన చెట్లు
మన మదిలోన తొలగిపోవు కమ్మిన చీకట్లు !

భగభగ మండే భూతాపాన్ని తగ్గిస్తాయి చెట్లు
బుడబుడ పొంగే నీటి ఊటల్ని పుట్టిస్తాయి చెట్లు
మన మనుగడ సాఫీగా సాగాలంటే పెంచాలి చెట్లు
కాలుష్యం పోవాలంటే ఎదగాలి అవి కోటానుకోట్లు

మన శ్రమ జీవన అవసరాలను తీర్చును ఈ చెట్లు
సమ భావన వసారాలకు ఆకృతిని నిచ్చే ప్రగతి మెట్లు
జనజీవన స్రవంతి కవనానికి దీపం వెలిగించును చెట్లు
జన జాతర భవంతి భవనానికి మనం ఎక్కి దిగే మెట్లు !

ఆవరించిన కాలుష్యాన్ని తొలగిద్దాం
ప్రగతి ప్రమద వనానికి ఇక వెలిగిద్దాం
పచ్చదనం మూలధనం అన్న జ్ఞానం కలిగిద్దాం
కల్మషాల కాలుష్యాన్ని ఇక వెలివేద్దాం !


కామెంట్‌లు