శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 99
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా 
(షోడశాక్షరీ)
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ 
(షోడశాక్షరీ)
డెబ్బై తొమ్మిదవ నామ మంత్రము - 
  ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః
భండాసురుడు, అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి సంపాదించిన అస్త్రములను, దేవతలు అందరూ తనకు ఇచ్చిన శక్తితో కూడిన శస్త్రాలను, మంత్ర పూర్వకముగా ప్రయోగించి, భండాసురుని ఊపిరి ఆడకుండా చేస్తూ...విజయం వైపు నడుస్తున్న పరదేవతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను, జగద్ధాత్రిని "భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ" అని పిలిచారు. ఆవిధంగా విజయపు దారిలో ప్రయాణిస్తున్న పరమేశ్వరికి నమస్కారము
భండాసురుని సోదరుడు విశుక్రుడు శక్తి సేనల మధ్య స్థాపించిన అష్టకోణములలో అష్ట రాక్షస శక్తులు ఉన్న "జయవిఘ్న యంత్రాన్ని" , పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు చూచిన వెంటనే ఆవిర్భవించిన గణపతి సర్వనాశనం చేసాడు. జయవిఘ్న యంత్ర ప్రభావం తొలగిపోవడం వల్ల, శక్తి సేనలు మంత్రి సహితంగా ప్రయోగించిన శస్త్రాల ధాటికి నిలబడలేక, భండాసురుని సేనలు, యుద్ధ భూమి నుండి పలాయనం చిత్తగాస్తాయి.
అప్పుడు, అమ్మను నిలువరించడానికి వేరే దారిలేక, భండాసురుడే యుద్ధం లోకి వచ్చాడు. తన శారీరక శక్తిని నమ్ముకుని, తనవద్ద ఉన్న అస్త్ర శాస్త్రాలను, అమ్మ యొక్క శక్తి సేనల మీద ప్రయోగిస్తాడు. జగన్మాత, భండాసురుని, వాని మిగిలిన కొద్దిమంది సేనలను సంహరించడానికి, దేవతలందరూ మంత్ర సహితంగా తనుకు ఇచ్చిన అన్ని ఆయుధాలనూ, సమంత్రకంగా తన బాణమునుండీ ప్రయోగించింది. భండాసురుడు విసిరిన అస్త్రాలు నిరుపయోగం అయ్యాయి.
ఐహిక బలంతో సంపాదించినవి "అస్త్రాలు". మంత్ర బలంతో, దైవశక్తి కలయికతో ప్రయోగించేవి, శస్త్రాలు. భండాసురుడు, రాక్షస ప్రవృత్తి తో, అజ్నానము అనే చీకటిలో కొట్టుకు పోతున్నవాడు. తన వద్ద ఉన్న మంత్ర సహితమైన శస్త్రములతో, జ్ఞానాన్ని ప్రసాదించి, మనలో భండాసురుని రూపంలో ఉన్న మద, మత్సరాలను పోగొట్టడానికి వచ్చింది, అమ్మ మనమీద అపారమైన దయతో.
ఈ విధంగా, తన సృష్టి లోనే పుట్టుకువచ్చిన, ఆసురీ శక్తులు గా పిలువబడే లోభము, మోహము, క్రోధమూ, మదము, మత్సరాలను నశింపజేసి, మనలోనే ఉన్న తన ఉనికిని మనకు తెలియజేయడానికి, మనలను పవితృలను చేసి, తనవైపు తిప్పుకోడానికీ వచ్చిన శ్రీమాత ను పూజించేటప్పుడు 
ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు