భీష్మ పర్వము తృతీయాశ్వాసము273 వ రోజు
భీమార్జునులకు సాత్యకి సాయం వచ్చుట
భీమార్జునులు ఒంటరిగా పోరుతున్నారని తెలిసి సాత్యకి మొదలైన ప్రముఖ వీరులు తమ సైన్యాలతో అక్కడకు చేరారు. పాండవుల విజయోత్సాహం చూసి కోపించిన భీష్ముడు అనేక అస్త్రశస్త్రాలతో వారిని ఎదుర్కొన్నాడు. భయంకర ఈ సమరరంలో రథములు విరిగి పడుతున్నాయి, అశ్వములు, గజములు నేల కూలుతున్నాయి. సారధులు చనిపోతున్నారు. భీష్ముడు రణరంగం అంతా తానై తిరుగుతున్నాడు. పొద్దు వాలి పోవడం ఆరంభం అయింది . భీష్ముడు మనస్సులో " ఈ పది రోజుల నుండి ఎంతో మంది ఉత్తమ క్షత్రియులను హతమార్చాను. వేలకొలది సైనికులను దారుణంగా చంపి విసిగి అలసి పోయాను ఇక ఈ శరీర బంధం తెంచుకొనుట మంచిది " అని తలచి భీష్ముడు తన రథమును యుధిష్టరుని వద్దకు పోనిచ్చాడు. అతనితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ " యుధిష్టరా ! పుట్టినది ఆదిగా ఎంతో మంది రాజులను చంపాను ఇంకా చంపుతున్నాను. నాకు వయసు అయిపోయింది. ఈ రాక్షసమాయ జీవితంతో విసిగి పోయాను అసహ్యం కూడా కలుగుతుంది. మీరు నా మేలు కోరే వారైతే శిఖండిని ముందు పెట్టుకుని అందరూ నాపై యుద్ధానికి రండి ఆలస్యం చేయక నాకు ఈ దేహం నుండి విముక్తిని ప్రసాదించండి " అని రథమును మళ్ళించి యధావిధిగా శత్రు సైన్యమును నిర్మూలించడం మొదలు పెట్టాడు.
*సాయం సమయం తరువాత సమరం
భీష్ముని పలుకులు విన్న యుధిష్టరుడు పక్కనే ఉన్న ధృష్టద్యుమ్నునితో " భీష్ముని పలుకులు విన్నావు కదా ! నువ్వు, భీమసేనుడు, అర్జునుడు మన సైన్యంలోని యోధాను యోధులతో కలిసి ఒక్కుమ్మడిగా భీష్ముని చుట్టు ముట్టండి " అని ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు మత్స్య, కేకయ రాజులను తక్కిన యోధాను యోధులకు భీష్ముని వద్దకు వెళ్ళమని సైగ చేసి తాను కూడా భీమార్జునులను తీసుకుని భీష్ముని చుట్టుముట్టాడు. ఇది చూసిన సుయోధనుడు కూడా తన తమ్ములు మిగిలిన వారిని కూడగట్టుకుని భీష్మునికి అండగా నిలిచాడు. ఇరుపక్షాల మధ్య పోరు ఘోరమైంది. అభిమన్యుడు సైన్యంతో సుయోధనుని మీదకు దూకి అతడిని క్రూర నారాచబాణములు వేసి నొప్పించాడు. అశ్వత్థామ సాత్యకి శరీరం నిండా శరములు నాటాడు. భీమసేనుడు రారాజును ఎదుర్కొన్నాడు. " భీష్ముని వెంటనే చంపండి " అంటూ పాండవ సైన్యాలు " భీష్ముని రక్షించండి " అని కౌరవ సైన్యాలు వీరాపాలు పలుకుతూ పోరాటం సాగిస్తున్నారు. రెండు సింహాలు పోరుతున్న విధంగా అర్జునుడు భీష్ముడు పోరాడుతున్నాడు. వారిద్దరి మధ్యకు దుశ్శాసనుడు తన సైన్యంతో వచ్చి అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు తన పదునైన బాణాలతో దుశ్శాసనుని కొట్టి అక్కడి నుండి తరిమి కొట్టాడు. అర్జునిని ధాటికి తట్టుకోలేని దుశ్శాసనుడు భీష్ముని వెనుక దాక్కున్నాడు. అర్జునుడు భగదత్తుని ఎదుర్కొని అతడి గజమును గాయపరిచాడు. భగదత్తుడు అర్జునిని వదిలి పాంచాల భూపతి మీదకు వెళ్ళాడు. అర్జునుడు శిఖండిని చూసి " భీష్ముని గుండెలకు గురి పెట్టి బాణములు వదులు అన్నాడు. తనను ఎదుర్కొన్న కౌరవ యోధులను దూది పింజంలా ఎగురగొట్టాడు. శిఖండి భీష్ముని వక్షస్థలం, భుజముల మధ్య భాగం, మర్మస్థానాలకు గురిపెట్టి బాణం వేస్తున్నాడు. భీష్ముడు శిఖండిని చూడకనే అర్జునుని ఎదుర్కొంటున్నాడు. అది చూసి దుశ్శాసనుడు కోపంతో రగిలి పోతూ భీష్మునికి అడ్డం వచ్చి అర్జునుని ఎదుర్కొన్నాడు. సుయోధనుడు కూడా కళింగ, మాళవ, బాహ్లిక, విదేహరాజులను, శూరసేనుడు మొదలైన ప్రముఖులను చూసి చేయి ఊపుతూ అక్కడకు రమ్మని సైగ చేసాడు. వారంతా తమతమ సేనా వాహినులతో అర్జునుని ఎదుర్కొన్నారు. అర్జునుడు తొట్రు పడక వారందరిని సైన్యంతో సహా కట్టడి చేసి తరిమాడు
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి