నేను… విడమఱచి చెబుతున్నా...: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నేను… గుండ్లను కాను —
గుండ్లు విసిరేయను, గాయపరచను, 
గుండెల్లో గుబాళించే గుసగుసల్ని 
గీతలుగా గుమికూడించే గానామృత ప్రవాహాన్ని॥

నేను… పల్లిని కాను —
పల్లెల పరిమళాల్ని 
ప్రభాత సమయాన్నే 
పదాలు పూయించే పచ్చని ప్రకృతి పలుకరింపుని॥

నేను… గుండ్లపల్లిని కాను —
గుండెల నిండా 
గులాబీలు గుబాళించే 
మమతలు నాటే మాటల మల్లెతోటని॥

నేను… రాజును కాను —
అధికారం కోసం అలమటించను, 
రాజసింహాసనాలపై రారాజుగా కూర్చోను,
రసహృదయాలపై రాజ్యమేలే రాగాల రత్నాకరాన్ని॥

నేను… ఇంద్రుడిని కాను —
అమరావతిలో ఆడంబరాల అలంకారమై వెలగను,
అక్షర మేఘాల నుంచి 
ఆనంద వర్షాలు కురిపించే ఆత్మస్వరాన్ని॥

నేను… రాజేంద్రుని కాను —
అమరేంద్రుని ఆసనాన్ని ఆశించను,
రాజ్యాలకే పరిమితమైన పేరుకాను,
రంజింపజేసే రాగభావాల రమ్య సంచారాన్ని॥

నేను… ప్రసాదుని కాను —
గుడి గర్భగుడిలో పంచే నైవేద్యముకాను,
దేవదేవుని వరప్రసాదాన్ని కాను,
గుండెల గర్భంలో జారే గురుతరమైన ప్రేమామృతాన్ని॥

నేను… రాజేంద్రప్రసాదుని కాను —
ఒక పేరులో బంధింపబడే మనిషినికాను,
అక్షరాల ఆత్మను ఆవిష్కరించే
ఆనంద కవినై నిలిచే అనంత స్పందనని॥

నేను… పదాల పరిమళాన్ని,
భావాల భాస్వరాన్ని,
తెలుగు తేనెల తీయదనాన్ని,
మనసుల మధ్య మమతల వారధిని॥

నేను… కాలం చెరపలేని కలాన్ని,
కలకాలం నిలిచే కాగితాల్ని,
కన్నీరు తుడిచే కరుణను,
మనిషిని మనిషితో కలిపే మానవతా మధుర గీతాన్ని॥

నేను…
పేరును కాదు —
పరిమళమై పరచుకునే
ప్రపంచ సాహితీ పయనాన్ని॥

.

కామెంట్‌లు