సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము: 255 వ రోజు
యుధిష్టరుడు ధృష్టద్యుమ్నుడికి సాయం పంపుట-
ఇది చూసిన యుధిష్టరుడు కేకయరాజులు, ఉపపాండవులను, ధృష్టకేతులను చూసి " మీరంతా అభిమన్యునితో కలసి భీమ, ధృష్టద్యుమ్నులకు సాయం వెళ్ళండి " అని ఆదేశించారు. వారి సాయంతో భీముడు పాదచారియై ఊచకోత కోస్తున్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. అతడు మరొక విల్లు తీసుకోగానే దానిని కూడా విరిచాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు అభిమన్యుని రథం ఎక్కాడు. అది చూసిన పాండవ సేనలు వెనుకక తగ్గాయి. సుయోధనుడు భీముని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుని సారథి మరొక రథం తీసుకు వచ్చి అందులో అతడిని ఎక్కించుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు తిరిగి ద్రోణుని ఎదుర్కొన్నాడు. విశోకుడు రథం తీసుకు వచ్చి భీముని ఎక్కించుకున్నాడు. భీముడు సుయోధనుని పై బాణములు గుప్పించాడు సంధించాడు. సుయోధనుడు భీముని శరములతో కప్పాడు. నీ కుమారులు ఎలాగైనా భీమును పట్టాలని ముందుకు కదిలారు. అభిమన్యుడు, ధృష్టకేతు, ఉపపాండవులు వారిని ఎదుర్కొన్నారు. భీముడు కూడా వారిని తరిమి కొట్టాడు. " ఈరోజుకు నా చేతిలో చచ్చారు " అంటూ వారిని తరుముతున్న భీముని సుయోధనుడు భీముని ఎదుర్కొమ్మని సైన్యాలను పురికొల్పాడు. భీమసుయోధనుల మధ్య పోరు సంకులమైంది. వికర్ణుడు, చిత్రసేనునితో కలిసి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ఇరవై బాణములు ప్రయోగించి వికర్ణుని రథాశ్వములను కొట్టాడు. వికర్ణుడు చిత్రసేనుని రథం ఎక్కి పారిపోయాడు. ఉపపాండవులు భీమునికి అండగా వచ్చి సుయోధనుని ఎదుర్కొని సుయోధనుని శరీరాన్ని రక్తసిక్తం చేసారు. అయిదు బాణాలతో సుయోధనుని నొప్పించారు. గంగేయుడు పాండవ సేనను ధ్వంసం చేస్తుంటే అర్జునుడు గాంగేయుని ఎదుర్కొన్నాడు. రక్తం ఏరులై ప్రకాశిస్తున్నా యోధు లిరివురు ప్రారాక్రమాన్ని విడువక పోరు సాగిస్తున్నారు. వాయు నందనుడైన భీముడు సుయోధనుని ఎలాగైనా సంహరించాలన్న తలపుతో అతడికి ఎదురుగా నిలిచి " సుయోధనా ! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. కుంతీ దేవి దుఃఖం , ఆమె కోడలు ద్రౌపది పగ తీర్చుకునే సమయం వచ్చింది. నాడు శ్రీకృష్ణుని మాటలు లక్ష్య పెట్టనందుకు ఉలూకుని చేత పరుషమైన మాటలు పలికించినందుకు నా పరాక్రమంతో సమాధానం చెప్తాను " అని పలుకుతూ సుయోధనుని రథాశ్వాలను చంపి, కేతనమును విరుగకొట్టి, రథసారథిని చంపి, అతని విల్లు విరుగ కొట్టాడు. సుయోధనుడు మరొక విల్లు అందుకునే లోపల అతనిపై పది బాణములు విడిచాడు. సుయోధనుని శరీరం నుండి రక్తం పెల్లుబుకి మూర్చ వచ్చినంత పనైంది. ఇంతలో జయద్రధుడు తన సైన్యంతో వచ్చాడు. కృపాచార్యుడు తన రథంలో ఎక్కించుకుని సుయోధనుని తీసుకు వెళ్ళాడు. అభిమన్యుడు, ఉపపాండవులతో కలిసి భీమునితో జధ్రధ సైన్యాలను ఎదుర్కొన్నారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, చారుత్రుడు, సులోచనుడు, నందుడు, ఉపనందుడు రౌద్రంతో అభిమన్యునితో పోరాడుతున్నారు. అభిమన్యుడు వారిని ఎదుర్కొని ఒక్కొక్కరిని అయిదు బాణములతో కొట్టి వారి శరీరాన్ని రక్తసిక్తం చేసాడు. వికర్ణుడు మరొక రథం ఎక్కి సోదరులకు సాయం వచ్చాడు. అభిమన్యుడు వికర్ణుని విల్లుతుంచి, సారథిని చంపి, రథాశ్వములను చంపి, కేతనమును విరిచాడు. ఇది చూసిన కురు కుమారులు ఒక్క సారిగా అభిమన్యునిపై పడ్డారు. ఉపపాండవులు అభిమనునికి అడ్డుగా నిలిచి కురుకుమారులను ఎదుర్కొని వారి కేతనములు విరిచి వారిపై బాణవర్షం కురిపించాడు. నీ కుమారులు వారి ధాటికి ఆగలేక పోయారు. నకులుని కుమారుడైన శతానీకుడు తన సైన్యముతో కేకయ పాంచాల రాజులకు సాయం వచ్చి వారితో కలిసి కౌరవ సేనుని తనుమాడసాగారు. సూర్యుడు అస్తమించచగానే భీష్ముడి సూచన మేరకు ఆరవరోజు యుద్ధం చాలించారు
*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు