భావ సౌరభాలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మధురభావాలు
మదిలో మొలకెత్తి,
మల్లెల పరిమళాలు
వెదజల్లుతున్నాయి॥

ఉన్నతభావాలు
హృదయంలో ఉప్పొంగి,
గోదారి గలగలలు
వినిపిస్తున్నాయి॥

చక్కనిభావాలు
చిన్నగా చిగురించి,
చామంతుల నవ్వులను
విరజిమ్ముతున్నాయి॥

మనోభావాలు
మధువుగా మారి,
మనసుల మధ్య 
వంతెనలు కడుతున్నాయి॥

విచిత్రభావాలు
విహంగాలుగా ఎగిరి,
విశ్వ విహారాలకు
తీసుకెళ్తున్నాయి॥

హావభావాలు
హృదయ భాషలై,
హర్షానందాలను
పలికిస్తున్నాయి॥

సాత్వికభావాలు
సవ్వడులు చేస్తూ,
శాంతిసౌఖ్యాలను
సమకూరుస్తున్నాయి॥

సాహితీభావాలు
సరస్వతీ వరాలై,
సృజనకు సరికొత్త రెక్కలు
తొడుగుతున్నాయి॥

భావసంపదలు 
కవుల పాలిట కల్పవృక్షాలై, 
కమ్మని కవితలను 
కూర్పిస్తున్నాయి॥

భావసౌందర్యాలు
పాఠకుల పాలిట పంచామృతాలై,
ఆనంద రాగాలను
ఆలపింపజేస్తున్నాయి॥


కామెంట్‌లు