శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల సంఘ సంస్కర్తల తేజోమూర్తుల స్మృతి వనంలో ఆదివారం ఆయన విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ వ్యాసం...
శ్రీకాకుళం గాంధీ మందిరంలో కొలువు తీరిన మహనీయులు సంఖ్య అర్థ శతకం వరకు చేరగా ప్రముఖ అవధాన పండితులు పైడి హరనాధ రావు మరియు కుటుంబ సభ్యులు నెలకొల్పిన స్వాతంత్ర్య సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహావిష్కరణ ఆదివారం ఉదయం 9-30 గంటలకు పండుగ వాతావరణంలో జరుగనుంది.
భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న లక్షలాది మంది దేశభక్తులు, జాతీయవాదులు దేశమాతను దాస్య విముక్తి గావించుటకు విభన్న మార్గాలను ఎన్నుకున్నారు. గాంధీజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అహింసా మార్గంలో పోరాటం చేయగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ బృందం విప్లవ పంథాలో పయనించింది. చంద్రశేఖర్ ఆజాద్ కూడా భగత్ సింగ్ బృందంలోని సభ్యుడే...
బ్రిటిష్ వారి చేతిలో మరణించకూడదని, స్వాతంత్ర్య పోరాటంలో వీరమరణం పొందడానికి వెనుకాడని దేశం గర్వించదగ్గ ఉద్యమకారుడు, యువకుడు, తుది పోరాటంలో తుపాకీ లోని చివరి తూటా తన ఆత్మార్పణ కు వాడి భారత్ మాతా కీ జై అంటూ అశువులు బాసి వీరమరణం పొందిన 24 ఏండ్ల యువ కిశోరం చంద్రశేఖర్ సీతారాం తివారీ ఉరఫ్ చంద్రశేఖర్ ఆజాద్.
ఉత్తర ప్రదేశ్ లోని బదర్కలో సీతారామ తివారీ, జగరాణీ దేవి దంపతులకు 1906 జులై 23న జన్మించారు. చదువుపై దృష్టిపెట్టక పరారై ముంబై చేరాడు. అయితే పొట్ట పోషణకు చేసిన పనులతో పోల్చితే చదువుకోవడం మంచిదని భావించి వారణాశి లో సంస్కృత పాఠశాలలో తిరిగి చేరాడు.
వారణాసి సంస్కృత పాఠశాలలో చదువుతున్న చంద్రశేఖర్ ఆజాద్ 15 ఏండ్ల ప్రాయంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రేరేపితుడై తన పాఠశాల ముందు ధర్నాకు దిగడంతో పోలీసులు న్యాయమూర్తి వద్ద హాజరు పరిచారు. తనపేరు ఆజాద్ (స్వతంత్రుడు), తండ్రి పేరు స్వతంత్ర, నివాసం జైలు అంటూ న్యాయమూర్తి ప్రశ్నలకు మొండిగా బదులివ్వడంతో ముందు 15 రోజుల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి దానిని 15 కొరడా దెబ్బల శిక్షకు మార్చారు. ఆరోజు తన పేరు ఆజాద్ గా పేర్కొనడంతో ఆరోజు నుండి ఆయన పేరు చంద్రశేఖర్ ఆజాద్ గా మారింది. కానీ, కొరడా దెబ్బలు ఆజాద్ స్వాతంత్ర్యేఛ్ఛను మరింతగా పెంచడమే గాక విప్లవ పంథాలో సాగడానికి పునాదులు పడ్డాయి.
నౌజవాన్ భారత్, కీర్తి కిసాన్ పార్టీ, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ వంటి విప్లవ పోరాట సంస్థలతో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫఖుల్లాఖాన్ వంటి సహచర్యం లో చంద్రశేఖర్ ఆజాద్ విప్లవ పంథాలో స్వాతంత్ర్య సమరాన్ని సాగించాడు. రోషన్ సింగ్ బిస్మిల్ వంటి సహచరులతో ఆయన ప్రభుత్వ ధనంతో వెళుతున్న రైలును 1925 ఆగష్టు 9 న కొల్లగొట్టాడు. ఈ సంఘటనలో అందరూ పోలీసులకు చిక్కగా ఆజాద్ తప్పించుకొని ఉత్తర ప్రదేశ్ లోని ఓర్చా అరణ్యం లో సతార్ నది ఒడ్డున ఆంజనేయస్వామి దేవాలయంలో మరి శంకర్ బ్రహ్మచారి మారుపేరుతో తన విప్లవ కార్యకలాపాలు కొనసాగించాడు. భగత్ సింగ్, సుఖ దేవ్ తదితరులతో కలిసి హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ పునర్వ్యవస్థీకరణ చేసారు.
జలియన్ వాలా బాగ్ మారణహోమానికి నిరసన తెలుపుతున్న లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారి స్కాట్ ను హతమార్చాలని తలచిన ఈ బృందం పొరపాటున సాండర్స్ ను కాల్చడంతో వీరిని పట్టుకొనేందుకు పోలీసులు వెంబడించారు. తప్పించుకున్న ఆజాద్ భగత్ సింగ్, రాజ్ గురు లను తప్పించడానికి వీరిని ముట్టడించిన చనన్సింగ్ అనే పోలీసును కాల్చి చంపాడు.
అయితే, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ సంయుక్తంగా పార్లమెంటుపై జరిపిన దాడి కేసులో ఉరిశిక్ష విధించారు. వీరిని ఎలాగైనా తప్పించాలని ఆజాద్ చేయని ప్రయత్నం లేదు. చివరిగా కొందరు జాతీయ నాయకులను కలిసి సహాయం కోరినా ఫలితం లేకపోయింది.
1931 ఫిబ్రవరి 27 న కొందరు సహచరులతో అలహాబాద్ ఆల్ఫెడ్ పార్కులో సమాలోచనలు చేస్తుండగా ఆ సమూహంలో రహస్యంగా చొరబడిన ముగ్గురు పోలీసులను ఆజాద్ కాల్చి చంపాడు. దీనిని గమనించిన పోలీసు బృందాలు ఆజాద్ ను పట్టుకోవాలని ప్రయత్నించడంతో పోలీసులపై తూటాల వర్షం కురిపిస్తూ ముందుకు సాగాడు. అయితే తన తుపాకీలో చవరి తూటా మిగిలిందని గమనించిన ఆజాద్ ఆ తూటా అయిపోతే తాను పోలీసులకు చిక్కి బ్రిటిష్ వారి చేతిలో మరణించడం తథ్యమని భావించి, ఆ తూటాను తన తలకి గురిపెట్టి ఆత్మార్పణ చేసుకున్న భారతమాత ముద్దు బిడ్డ చంద్రశేఖర అజాద్. భారత స్వాతంత్ర్య పోరాటానికి స్పూర్తిగా, భారతీయ యువతకు స్పూర్తిదాయకంగా నిలచిన చంద్రశేఖర్ ఆజాద్ చిరస్మరణీయుడు.
==================================
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి