అబద్ధలహరి....!!- యెనుముల వేణుగోపాలరావు- అమలాపురం.
 నిజం చేదుగా వుంటుంది,
అబద్ధం తియ్యగా ఉంటుంది!
నిజం నిష్టూరంగా వుంటుంది ,
అబద్ధం హాయిగా ఉంటుంది!
నిజం మాట్లాడాలంటే _
ధైర్యం ఉండాలి,
అబద్ధం ఆడాలంటే నోరూ, 
నోట్లో నాలుక ఉంటే చాలు ,
అవలీలగా అబద్ధాలు ఆడేస్తాం!
పెళ్లిలో ఆడే అబద్ధాలు కోకొల్లలు ,
వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ,
ఒక పెళ్లి చెయ్యమన్నారని సమర్థన ,
పెళ్లే అబద్ధమయితే ఎంత బాగుండును 
అని సగటు భర్త ఆవేదన !
ఇక దైనందిన అబద్ధాలుఅంటారా..
ఎవరైనా మనకు ఎదురుపడి 
ఎక్కడకి ?అని అడిగితే, 
ఇక్కడికే !అంటాము -
అది మొదటి అబద్దం !
ముష్టి వాళ్ళు ధర్మం అడిగితే 
చిల్లర లేదు అంటాము - 
అదో రకం అబద్దం !
ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లి 
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం అనడం - 
మరో అబద్దం !
పెళ్ళాం కూర ఎలావుంది? అంటే, 
చాలా బాగుంది అంటాం - 
ఇది భయం తో కూడిన అబద్దం !
ఈ రోజు నువ్వు చాలా 
అందంగా ఉన్నావు అంటాము - 
ఇది అవసరం తో కూడిన అబద్ధం!
అబద్ధం ....
అయస్కాంతం లాంటిది  అది 
అందర్నీ ఆకర్షిస్తుంది !
నిజం నిప్పు లాంటిది - 
దాన్ని దాచి ఉంచడం 
కష్టాతి కష్టం సుమా...!!
                ***

కామెంట్‌లు