భీష్మ పర్వము తృతీయాశ్వాసము259 వ రోజు
సాయంకాలాంతర పోరు
త్రిగర్తాధీశుడు తన చక్రరక్షకులైన ముప్పై రెండు మందిని అర్జునినిపై పంపాడు. అర్జునుడు అరవై నాలుగు బాణము ప్రయోగించి వారిని చంపాడు. త్రిగర్తాధీశుడు స్వయంగా అర్జునితో తలపడ్డాడు. ఇంతలో శిఖండి మధ్యలో అడ్డుకుని సుశర్మను ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా దుర్యోధనుడు ఉన్నా అతడిని దాటి భీష్ముని ఎదుర్కొన్నాడు అర్జునుడు. తన మీదకు వస్తున్న శల్యుని విడిచి భీమ, నకులసహదేవులతో కూడి అర్జునినికి సాయంగా వెళ్ళాడు ధర్మరాజు. పాడవులతో భీష్ముడు పోరు సాగిస్తున్నాడు. ఇంతలో నీ కుమారుడు సుయోధనుడు సైంధవునితో చేరి పాండవులను ఎదుర్కొన్నాడు. శలుడు, శల్యుడు, చిత్రసేనులు కృపాచార్యునితో చేరి పాడవులను ఎదుర్కోడానికి చేరారు. ఇంతలో శిఖండి భీష్ముని ఎదుర్కొన్నాడు. భీష్ముడు శిఖండితో యుద్ధం చేయక అతడి విల్లును త్రుంచి పక్కకు పోయాడు. ఇది చూసిన యుధిష్టరుడు " శిఖండీ భీష్ముని చంపుతానని శపధం చేసావుగా మరిచావా!" అని అరిచాడు. ఆ మాటలు విని శిఖండి భీష్మునిపై శరవర్షం కురిపించాడు. అది చూసిన శల్యుడు శిఖండిపై అగ్నేయాస్త్రాన్ని వేసాడు. శిఖండి బెదరక శల్యునిపై వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. భీష్ముడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనమును విరిచాడు. అది చూసిన భీముడు తన రథం దిగి సుయోధనుని మీదకు వెళ్ళాడు. సైంధవుడు అయిదు వందల వాడి బాణములను భీమునిపై ప్రయోగించాడు. భీముడు నిర్లక్ష్యంతో వాటిని తన గదతో త్రుంచి సైంధవుని రథాశ్వాలను చంపి, రథం విరిచాడు. సైంధవుడు వేరొక రథం ఎక్కి పారిపోయాడు. అతనితో కౌరవ సైన్యం పారి పోయింది. ఇది చూసిన సుయోధనుడు పారిపోవద్దని తన సైన్యాలను వారిస్తూ భీమునితో తలపడ్డాడు. ఇంతలో చిత్రసేనుడు భీముని అడ్డుకుని శక్తి ఆయుధాన్ని భీమునిపై ప్రయోగించాడు. భీముడు తనగదను శక్తి ఆయుధంపై విసిరాడు. అది గిరగిరా తిరుగుట చూసిన కౌరవులుది ఎవరి మీద పడుతుందో తెలియక భీతి చెంది రారాజు మాట వినక పారిపోసాగారు. ఆ గద తన మీదకు రావడం చూసి చిత్రసేనుడు రథం దిగి పారిపోయాడు. ఆ గద చిత్రసేనుని రథాన్ని అశ్వములతో సహా నుగ్గు చేసింది. వికర్ణుడు చిత్రసేనుని తన రథంపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీష్ముడు ధర్మతనయుని రథాశ్వాలను చంపి అతడి శరీరాన్ని శరపరంపరతో గాయపరిచాడు. ధర్మనందనుడు కోపించి శక్తి ఆయుధాన్ని భీష్మునిపై ప్రయోగించాడు. భీష్ముడు శక్తి ఆయుధాన్ని త్రుంచాడు. ధర్మనందనుడు నకులసహదేవుల రథాన్ని అధిరోహించాడు. భీష్ముడు నకులసహదేవుల మీద శరసంధానం చేసి వారిని నొప్పించాడు. ధర్మనందనుని ఆదేశంపై పాండవ సేనలోని రాజులంతా తమ సైన్యాలతో భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు జంకక పాండవ సేనలోని వారి తలలను ఖండిస్తూ స్వైర విహారం చేయడం పాండవ సేనను ఆశ్చర్యచకితులని చేసింది. ఇంతలో శిఖండి భీష్మునిపై నిశితశరములను వేసాడు. భీష్ముడు వాటిని, లక్ష్యపెట్టక పాండవ సైన్యాలను చెండాడుతున్నాడు. కురు సేనలను తనుమాడుతున్న సాత్యకి, ధృష్టద్యుమ్నులను విందాను విందులు ఎదుర్కొని ధృష్టద్యుమ్నుని రథాశ్వాలను చంపారు. విరధుడైన ధృష్టద్యుమ్నుడు సాత్యకి రథం ఎక్కాడు. ఇది చూసిన ధర్మరాజు వారికి సాయంగా వచ్చాడు. రారాజు తన సైన్యములకు ధర్మరాజును ఎదుర్కొనమని సైగ చేసి తాను కూడా భీష్మ, ద్రోణులతో చేరి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మజునికి సాయంగా వచ్చిన అర్జునినిపై ద్రోణుడు క్రూర బాణప్రయోగం చేసాడు. ఇది గమనించిన కౌరవసేనలు ఇనుమడించిన ఉత్సాహంతో పాండవ సైన్యాలను ఎదుర్కొన సాగారు. ధర్మరాజు తన సేనలకు ధైర్యం కలిగిస్తూ యుద్ధానికి పురికొల్పాడు. ఇరు సైన్యాలు ఘోరమైన పోరు సాగిస్తుండగా సూర్యుడు అస్తమించసాగాడు. త్రిగర్తాధీశుడు సుశర్మ, సైంధవుడు మొదలైన ప్రముఖులను ఓడించి ధర్మరాజుకు ఆనందం కలిగించాడు. అన్నగారికి బాసటగా నిలిచి భీమసేనుడు కురుసేనలను తనుమాడాడు. ఆ రోజుకు యుద్ధం చాలించి అందరూ శిబిరాలను చేరారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి