సాహితీ సుగంధం: - — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
అక్షరాల మీద మోజు కలిగింది—
ఆత్మను ఆవహించే అమృత బిందువులై,
మనసు మట్టిలో మొలకెత్తి
మధుర భావాల తోటగా విరబూసింది॥

పుస్తకాల మీద ప్రేమ పుట్టుకొచ్చింది—
పుటలు తిరగేస్తుంటే పరిమళాలు వెదజల్లింది,
ప్రతి గ్రంథం ఓ గురువై
జీవిత సత్యాలు నేర్పింది॥

కవితల మీద మనసు పడింది—
పదాల పల్లకిలో ఊరేగే భావాలు
హృదయ తంతులను తాకి,
నిశ్శబ్దానికే స్వరాల హారతి ఇచ్చింది॥

కవుల మీద ఇష్టం ఏర్పడింది—
వారి కలం నుంచి జారిన అక్షరాలు
అమృత ధారల్లా అనిపించి,
ఊహల ఆకాశంలో మనసు విహరించింది॥

ఫఠనంపై ఆసక్తి పెరిగింది—
చదువుతుంటే చైతన్యం చెలరేగింది,
ప్రతి వాక్యం కొత్త వెలుగై
అజ్ఞాన చీకట్లను పారద్రోలింది॥

సాహిత్యంపై అభిలాష ప్రబలమయ్యింది—
అది కేవలం అభిరుచి కాదు,
ఆత్మకు ఆహారమై, అనుభూతులకు ఆలంబనమై
జీవితానికి జ్యోతిగా నిలిచింది॥

ఇలా—
అక్షరం అక్షరంగా ఆరాధన పెరిగింది,
పుస్తకం పుస్తకంగా ప్రేమ విస్తరించింది,
కవిత కవితగా హృదయం పరవశించింది,
సాహిత్య సౌరభంతో జీవితం సుగంధమైంది॥


కామెంట్‌లు