బాలకాండము శ్రీమద్రామాయణము : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సగరుడు తన ఆరువైమంది పుత్రులను పిలిచి 
ఆ అశ్వం గూర్చి వెతకమని ఆజ్ఞాపించాడు 
తండ్రి మాటలు విన్న ఆ పుత్రులు 
భూమండలమంతా తిరిగినారు 

ఎక్కడ కూడా ఆ గుర్రం జాడ తెలియలేదు 
వారు కోపగించి భూమిని లోతుగా తవ్వారు 
భూమిలో నుండి నాగుల, రాక్షసుల ధ్వనులు 
వారికి చెవులారా వినబడుచుండెను 

ఆ రాకుమారులు పర్వతాలతో నిండియున్న 
జంబుద్వీపమును వదలకుండా
లోతుగా తవ్వి సంచరించుచున్నారు 
దేవతలు గంధర్వులు భీతి చెందినారు 

నాగులు దేవతలు భయముతో 
బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు 
పాతాళ లోకమున ఎందరో హతులవుతున్నారు
ఓ పితామహ మమ్మల్ని ఆదుకోవయ్యా

సగర కుమారుల కంటపడిన వారిని
అశ్వము దొంగలించారని హతమారుస్తున్నారు 
ఎందరో అమాయకులు బలి అవుతున్నారు 
మీ శక్తితో కాపాడుమని మొరపెట్టుకున్నారు 


కామెంట్‌లు