వేసవి సెలవులు వచ్చేసాయి. పాఠశాలలున్న రోజుల్లోనే పిల్లలు ఫోన్లు వదలడం లేదు. ఇక శలవుల్లో మన మాట వింటారా? ఆ ఫోన్లకే అతుక్కుపోతారు అంటూ తల్లిదండ్రులు బాధపడవద్దు. మీరు కూడా కొద్ది ఖాళీ సమయం చూసుకుని పిల్లలతో ఈ పాత ఆటలు ఆడించండి. మీరు చిన్నతనంలో ఆడుకునే ఉంటారు. ఈ పాత ఆటల రుచిని పిల్లలకు చూపించండి. వారూ వాటిని వదిలి పెట్టరు. ఇంకెందుకాలస్యం. వెంటనే మొదలుపెట్టండి.
గడులాట
క్లాసురూమ్ లో ఖాళీ పీరియడ్ వచ్చిందంటే చాలు నోట్ పుస్తకాలు తీసుకొని దానిలో గడులాట ఆడేవారు. ఒకరు ఒక గీత గీయాలి. వేరొకరు దానికి ఆనించి మరో గీత గీయాలి. ఇలా నాలుగు గీతలు గీస్తే ఒక గడిలా తయారవుతుంది. చివరి గీత ఎవరు గీస్తే గడిలా తయారవుతుందో వారిదే ఆ గడి అన్నమాట. ఆ గడిలో వారి పేరు మొదటి అక్షరం రాసుకుంటారు. అలా పేజీ అంతా అయ్యాక లెక్కిస్తే ఎవరికి ఎక్కువ గడులొస్తే వారు గెలిచినట్టు.
తాడాట
ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆట ఇది. ఒక తాడును తీసుకొని ఎగరేస్తూ రెండు కాళ్ళ కింద నుంచి తీసుకెళ్తారు. ఎగురుతూ ఆడే ఈ ఆట వ్యాయామానికీ ఉపయోగ పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, పెద్ద వాళ్ళయ్యాక కూడా అంతే సరదాగా ఆడుకోవచ్చు. ఒంటి కాలితో, రెండు కాళ్ళతో ఆడే స్కిప్పింగ్ ఎక్కడా తడబడకుండా వంద వరకూ ఆడేవాళ్ళం అలుపు లేకుండా. ఈ రోజుల్లో ఇవేవీ లేవు.
పేరు-ఊరు
ఇప్పటి పిల్లలు అంత్యాక్షరి ఆడుకున్నట్లుగా మా కాలంలో ఈ ఆట ఆడేవారు. ఆటలో పాల్గొనే వాళ్ళంతా తలా ఒక పుస్తకం, పెన్ను తీసుకొని ఒక పేజీలో పేరు, ఊరు అని పైన రాస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక్కరు ఒక అక్షరం పేరు చెబుతారు. ఆ అక్షరంతో వచ్చే పేరు, ఊరు పేరు రాయాలి. ఎదుటి వాళ్ళకు రాని విధంగా ఉండేలా కష్టమైన అక్షరాలను ఇస్తారు. దానికి వాళ్ళు పేరు, ఊరు పేరు రాయాలి. ఇప్పటిలా దీవీలు లేవు కాబట్టి. ఊర్ల పేర్లు చాలామందికి తెలియవు. అట్లాస్లో చూడటమే తప్ప విడిగా తెలియదు. అప్పట్లో మేము ఎవ్వరికీ తెలియని వికారాబాద్ పేరును తెగ రాసేవాళ్ళం. ఇలా ఎవరికీ తెలియనివి రాసినపుడు పక్క ఫ్రెండ్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇంకా కొంత మంది ఊరు, పేరుతో పాటు ఆట, పండు, తినే వస్తువు అని ఇలా నచ్చినట్టుగా పెట్టుకునే వాళ్ళు. ఎన్ని గంటలైనా ఆడుకునే వాళ్ళం.
చిట్ల పొట్లకాయ ఆట
ఇది దాదాపు దాగుడుమూతల్లానే ఉంటుంది. ఒక మూలవైపుగా ఒకమ్మాయిని కూర్చోమంటారు. మిగిలిన వాళ్ళలో ఒకరు వెళ్ళి కూర్చున్న అమ్మాయి కళ్ళు మూస్తారు. అప్పుడు ఎవరు కళ్ళు మూశారో చెప్పాలి. కళ్ళు మూసిన అమ్మాయి పేరు కనుక్కుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరల ఆడతారు. పేరు కనుక్కోలేకపోతే మొదట అమ్మాయికే కళ్ళు మూయాలి.
"చిట్ల పొట్లకాయ - సీమనెల్లి కాయ
గోడ పుచ్చకాయ - గొట్టి నెల్లి కాయ
అత్తకు పెడితే అల్లం - అల్లుడు తింటే బెల్లం
కొత్త కుండల్లోని కోడళ్ళారా - పాలపిడతలోని పాపల్లారా!"...
అంటూ ఈ ఆట ఆడుతూ పాట పాడతారు...
ఎంతెంత దూరం
పిల్లలందరూ ఒకరి వెనక ఒకరు వరసగా నిలబడి ఒకరి భుజాలు మరొకరు పట్టుకుంటారు. అలా నడుస్తూ నడుస్తూ వెళతారు. వెళ్తూ "ఎంతెంత దూరం" అని ఒకళ్ళుఅడగటం "బాయి బాయి దూరం" అంటూ సమాధానం ఇవ్వటం జరుగుతుంది. ఇలా ప్రశ్నలు అడుగుతూ, సమాధానం చెప్పుకుంటూ నడుస్తూ సరదాగా వెళుతుంటారు.
ఉట్టి ఆట
కృష్ణాష్టమి పండుగకు ఉట్లు గొట్టే ఆట కాదిది. పిల్లలు కాగితాలతో ఉట్లు తయారుచేయటం. దీనిని ఆట అనవచ్చో లేదో కూడా నాకు తెలియదు. కాకపోతే మేము స్కూల్లో చాలా ఉట్లు తయారుచేసుకునే వాళ్ళం. పుస్తకాల్లోని కాగితాలు చింపి. వాటితో కాగితపు ఉట్లు తయారు చేసేవాళ్ళం. అప్పట్లో కత్తెరలు కూడా ఉండేవి. కావు. అందువల్ల చేతితోనే చక్కగా గుండ్రంగా ఎక్కడా తెగి పోకుండా చివరి దాకా చింపాలి. అలా చింపాక మొత్తానికి ఒకటే లింకు ఉంటుంది. చివర రెండు గుండ్రాలు ఉంటాయి. ఆ రెండు చివర్లు పట్టుకుంటే ఉట్టి పొడుగ్గా వేలాడుతుంది. మధ్యలో కుండలాగా ఒక రాయిని పెట్టేవాళ్ళం. ఆ బరువుకు ఉట్టి పొడుగ్గా నిలబడుతుంది. ఎవరిది పొడుగ్గా ఉంది? ఎవరిది తెగిపోకుండా వచ్చింది? అని చూసి అన్నీ బాగున్న వాటికి ఎక్కువ మార్కులొచ్చేవి. ఇది ఆటలాగానే కాదు, ఇందులో సృజనాత్మకత, కళాత్మకత దాగి ఉంటుంది. ఈ ఆటలు ఎక్కువగా ఆడపిల్లలు ఆడేవాళ్ళు.
బొమ్మలపెండ్లి
ఈ ఆట ఆడని ఆడపిల్ల తెలుగురాష్ట్రాలలో ఉండి ఉండదేమో. మగ పెండ్లి వారు, ఆడ పెండ్లి వారు అంటూ ఉన్న పిల్లలందరూ రెండు జట్లుగా విడిపోతారు. ప్రతి ఇంట్లో లక్కపిడతల సెట్ ఉంటుంది. అందులో అన్నం గిన్నెలు, కూర గిన్నెలు, కవ్వం, పప్పుగుత్తి, పన్నీరు బుడ్డి వంటి ఎన్నో రకాల వంటింటి సామాన్లుంటాయి. మా చిన్నప్పుడు చక్కని చెక్కతో రంగులు వేసి వుండేవి. ఒక రకంలో మాత్రం రోజ్ వుడ్ కలర్ తో ఉండేది. నా దగ్గర రెండో సెట్ మాత్రం లేత గోధుమ రంగు, గులాబి రంగులు సగం సగంగా వేసి ఉంటాయి. ఈ లక్కపిడతలన్నీ ఒక్క దగ్గర పెట్టుకొని పెండ్లి ఆట మొదలెడతారు. ఈ ఆటలో పెండ్లి కూతురి కోసం వెతుకుతూ "గుజగుజరేకుల పిల్లుందా? గుజ్జారేకుల పిల్లుందా?" అంటూ పాటలు పాడతారు.
ఈ ఆటలో ప్రధానంగా పెండ్లి కూతురిని, పెండ్లి కొడుకుని అందంగా అలంకరించటమే. తాటాకు బొమ్మలు, కొయ్య బొమ్మలకు ఈ అలంకారాలు చేసి పెండ్లి చేసి మురిసిపోతారు. పెండ్లి అయ్యాక భోజనాల తంతు. ఇంట్లో నుంచి శనగపప్పు, బెల్లం ముక్కలు తెచ్చి అవే పప్పన్నాలు అంటూ తినడం, కాసిని నీళ్ళు పోసుకుని చిన్న కప్పులు, సాసర్లలో కాఫీ తాగినట్టు చేయడం చాలా గమ్మతుగా ఉంటుంది. మగ పెండ్లివారి జట్టు మాకు కాఫీలు ఇవ్వలేదు, టిఫిన్లు పెట్టలేదు అంటూ నిజమైన పెండ్లిలో జరిగినట్టుగా అలిగినట్లు నటించడం, ఆడ పెండ్లివారి జట్టమో వారిని బతిమాలి తినిపించినట్లుగా చేయడం- ఇవన్నీ చాలా బాగుంటాయి. పెండ్లిలో వంటలు వండుతున్నట్టు, భోజనాల బంతిలో వడ్డిస్తున్నట్టు నటించటం ఎంతో సరదాగా ఉండడమేగాక సంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి