సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 261 వ రోజు
ఇరావంతుని పరాక్రమం*
అర్జున ఉలూచిల కుమారుడు ఇరావంతుడు తన అశ్విక దళంతో కౌరవ సైన్యమును చుట్టుముట్టాడు. అది చూసిన శకుని తమ్ములు శుకుడు, శర్మవంతుడు, వృషకుడు, ఆర్జవుడు, గజుడు, గవాక్షుడు అను ఆరుగురు తమ అశ్వ సైన్యంతో ఇరావంతుని ఎదుర్కొని ఘోరంగా పోరుతున్నాడు. శకుని తమ్ములు ఇరావంతుని అశ్వమును చంపారు. ఇరావంతుడు తన అశ్వమును దిగి కరవాలంతో యుద్ధం చేస్తున్నాడు. శకుని తమ్ములు కూడా కిందకు దిగి ఇరావంతుని ఎదుర్కొన్నారు. ఇరావంతుడు రకరకముల విన్యాసములు చేస్తూ శకుని తమ్ములతో యుద్ధం చేస్తూ అదను చూసి వారిని పన్నెండు ముక్కలుగా నరికాడు. అది చూసిన సుయోధనుడు అలంబసుని పిలిచి " అలంబసా ! వీడు ఈ రోజే మనసైన్యాలను నాశనం చాసేలా ఉన్నాడు. వెంటనే నీవు అతడిని ఎదుర్కొని హతమార్చు " అని చెప్పాడు. అలంబసుడు ఇరావంతునికి సమాంతరంగా మరొక అశ్వబలమును సృష్టించాడు. రెండు దళాలు ఒకదానితో ఒకటి పోటీ పడి నశించాయి. ఇరావంతుడు ఒంటరిగా పోరాడుతూ అలంబసుని ఖడ్గం, విల్లు విరిచాడు. అలంబసుడు ఆకాశానికి ఎగిరాడు. ఇరావంతుడు ఆకాశానికి ఎగిరి అలంబసునితో మాయా యుద్ధం చేస్తున్నాడు. ఇరావంతుడు అలంబసుని తల నరికాడు. అయినా అతడు చావ లేదు. ఇరావంతుడు తన తల్లిని, తాతాగారిని తలచుకుని విషనాగులను సృష్టించాడు. అలంబసుడు డేగరూపం ధరించి ఆ నాగులను చంపి వెంటనే ఇరావంతుని తల నరికాడు. ఇరావంతుడు మరణించాడు.
ఘటోత్కచుని పోరు
ఇరావంతుని మరణం చూసి ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో కౌరవ సన్యంతో తలపడ్డాడు. తన శూలాయుధంతో గజ, అశ్వ, పదాతి దళాలను గుచ్చి పైకెత్తి నేలకేసి బాది చంపుతున్నాడు. అందరిని మూకుమ్మడిగా చంపుతున్నాడు. ఇది చూసి సుయోధనుడు, వంగదేశాధిపతి తమ గజ సైన్యంతో ఘటోత్కచుని ఎదుర్కొన్నారు. ఆ గజబలమును చూసిన ఘటోత్కచుడు పొంగి పోయి భుజములు చరిచి కరవాలంతో గజముల తొండములను, దంతములను, శిరములను ఖండించసాగాడు. ఇది చూసిన సుయోధనుడు తానే ఘటోత్కచుని ఎదుర్కొని అతని ప్రధాన అనుచరులైన వేదవంతుడు, విద్యుత్జిహ్వుడు, బహ్వాసి మొదలగు వారిని చంపి ఘటోత్కచుని శరీరాన్ని శరములతో కప్పాడు. ఘటోత్కచుడు కూడా విల్లు అందుకుని సుయోధనునిపై శరవర్షం కురిపించి సుయోధనునితో " సుయోధనా ! నాడు నిండు సభలో ధర్మం మరిచి నా తాల్లి పాండవుల సతి అయిన ద్రౌపదీ మాతను అవమానపరిచావు. అందుకు ప్రతి ఫలం అనుభవించు " అని నల్ల త్రాచుల వంటి బాణములను సుయోధనుని పై ప్రయోగించాడు. సుయోధనుడు వాటిని మధ్యలో త్రుంచి ఇరవై ఉగ్రమైన శరములను ఘటోత్కచునిపై వేసాడు. ఘటోత్కచుడు శక్తి ఆయుధమును సుయోధనునిపై ప్రయోగించాడు. వంగ దేశాధిపతి శక్తి ఆయుధాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఆయుధము వంగరాజు గజమును చీల్చి వేసింది. వంగరాజు పారిపోయి ప్రాణములు దక్కించుకున్నాడు. ఇది చూసి అతడి సైన్యం హాహా కారాలు చేస్తూ పారి పోయారు. సుయోధనుడు ధైర్యంగా ఘతోత్కచుని ఎదుర్కొని తాను నేర్చిన అన్ని అస్త్రములు ప్రయోగించి ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. వాటిన్నంటిని ఆకాశంలో పొడి చేసి ఘటోత్కచుడు సింహనాదం చేసాడు. అది విన్న భీష్ముడు " ఘతోత్కచుడు దేవతలకు కూడా అజేయుడు సుయోధనుని అతడి బారి నుండి రక్షించండి " అని అరిచాడు. అది విని ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, చిత్రసేనుడు, బృహద్బలుడు, బాహ్లికుడు, అవంతి నాధుడు, భూరిశ్రవుడు, సైంధవుడు, సోమదత్తుడు, వివిశంతి, వికర్ణుడు ఒక్కుమ్మడిగా రథములు నడుపుతూ నీ సుయోధనుడు రక్షణగా నిలిచి ఘటోత్కచునితో పోరాడుతున్నారు. వారిని చూచి ఘటోత్కచుడు రెట్టించిన ఉత్సాహంతో వారందరి మీద తన నిశిత శరములు కురిపించాడు. వారి రథ సారధులను చంపి, విల్లులు విరిచి, రథములను విరిచి వారిని చికాకు పరిచాడు. ద్రోణాచార్యుడు మొదలైనా పన్నెండు మంది ఘటోత్కచునిపై మహాస్త్రాలు ప్రయోగించాడు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి మాయా యుద్ధం చేయసాగాడు
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు