చమత్కార శ్లోకాలు : -- యామిజాల జగదీశ్

 మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం. ఇక సంస్కృతం దాకా ఎందుకు. ఎవరేమోకానీ నా విషయానికి వస్తాను. మా నాన్నగారు పండితులే. అటు సంస్కృతంలోనూ. ఇటు తెలుగులోనూ. ఉభయ భాషా ప్రవీణులే. కానీ నేను పండిత పుత్రుడినే. అంటే వేరేగా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. ఆ ప్రభావమో ఏమో కానీ తమిళం మీదున్న ప్రేమను మాతృ భాష మీద అంతగా చూపెట్టలేక పోయాను. మా నాన్నగారు కూర్చో పెట్టి తెలుగులో పద్యాలు రాయిస్తా నని, సంస్కృతం నేర్పిస్తానని చెప్పినా ఆసక్తి చూపలేకపోయాను. కానీ అప్పుడేమోగానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను ఎంత కోల్పో యానో అని. ఉద్యోగరీత్యా కావచ్చు లేదా మరో కారణం కావచ్చు, ఇప్పుడుంటున్నది హైదరాబాదులోనే. నాకు పాత పుస్తకాలు కొనడం ఎంతో ఇష్టం. అలాగే పాతపుస్తకాలు తిరగేయ డం సరదా. అలాగే చాలా కాలం తర్వాత ఓ ఆదివారం అబిడ్స్ వెళ్ళాను. పాతపుస్తకాలు చూద్దా మని. అయితే ఓ రెండు మూడు పుస్తకాలు తీసుకున్నాను. వాటిలో ఒకటి సంస్కృతంలోని చమత్కార శ్లోకాలకు తెలుగులో తాత్పర్యం చెప్పిన పుస్తకమొకటి. అది తిరగే స్తుంటే నేను సంస్కృతం నేర్చుకోక పోవడంలోని తప్పును తెలుసు కుని బాధపడుతున్నాను. అంతర్జా తీయ భాష ఇంగ్లీషు తెలుసు కోవడం, మాట్లాడడం అవసరమే. అలాగని మన మాతృభాషను మరిస్తే ఎలా... ఈ మధ్య ఒకరికి ఓ లేఖ రాస్తే గోడకు కొట్టిన బంతిలా వారి నుంచి ప్రశ్నల వర్షం...ప్రశంస, కొనియాడడం ఇత్యాది కొన్ని పదాలు రాస్తూ వాటి అర్థాలు చెప్ప మని. ఏం చెప్పను....వారికి ఓ నమస్కారం పెట్టి ఊరుకున్నాను. సరే అది పక్కనపెట్టి ప్రస్తుతం చదువుతున్న సంస్కృత శ్లోకాల పుస్తక విషయానికి వస్తాను.
అందులో ఒకటి రెండు ఇక్కడ ప్రస్తావిస్తాను..
మొదటి శ్లోకంలో వినాయకుడి చిలిపితనం.
యుగపత్ స్వగండ చుంబన లోలౌ పితరౌ నిరీక్ష్య హేరంబ
తన్ముఖ మేళన కుతుకీ స్వా నన పపనీయ పరిహాసన్ పాయాత్...
ఓసారి పార్వతీపరమేశ్వరులు తమ ముద్దుల బిడ్డడు వినాయకు డికి ఏకకాలంలో అతని చెక్కిళ్ళపై ముద్దు ఇవ్వాలని అనుకుంటారు. ఈ విషయం వినాయకుడు గ్రహిస్తాడు. అయితే అమ్మానాన్న లు ముద్దుపెట్టుకునేలా చేయాలని అనుకుంటాడు వినాయకుడు. తన తల్లిదండ్రులు తనకు ముద్దు పెట్ట డానికి దగ్గరకు వస్తుంటే వినాయకు డు అదే తగిన సమయమనుకుని తన ముఖాన్ని వెనక్కు తీసుకుం టాడు. అప్పుడు శివపార్వతుల ముఖాలు దగ్గరై పెదవులు కలిసి ముద్దుపెట్టుకోవడం జరుగుతుంది. ఆ దృశ్యం చూసి వినాయకుడు ఓ చిలిపినవ్వు నవ్వుతాడు. అటువం టి వినాయకుడు మిమ్మల్నందరినీ రక్షించాలని ఆ కవి తన చమత్కార శ్లోకంలో చెప్తాడు.
 ఎంత అందమైన ఊహో కదండీ.
మరొక శ్లోకంలో పార్వతీపర మేశ్వరుల మధ్య సాగిన సరస సంభాషణను చూద్దాం...
త్వ తిష్టతస్తే పితరౌ మమే వే
త్వపర్ణ యోక్తే పరిహాస పూర్వమ్
క్వ వా మమేవ శ్వశురౌ తనే తి
తా మీరయన్ సస్మిత మీశ్వరో వ్యాత్
ఓసారి పార్వతి శివుడిని సరదాగా పరిహసించాలని అనుకుంటుంది.
స్వామీ, నాకు తల్లిదండ్రులున్నారు. వాళ్ళు నాకన్నిటికీ అండగా ఉంటున్నారు...కానీ మీకు తల్లిదం డ్రులు లేరు...మీరు ఎవరూ లేని అనాధవు కదా అని పార్వతి అంటుంది.
శివుడు పరమాత్మ. కనుక జననం లేదు. తల్లిదండ్రులు లేరు. పార్వతి మాటలు విని శివుడు ఓసీ పిచ్చిదానా, నాకు అత్తమామలు న్నారే, వాళ్ళే అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తున్నారుగా, నాకు అండగా ఉంటున్నారు కూడా, అంతెందుకు నా బంధువు ల బలగం కూడా చాలా పెద్దది. పైగా నీకు అత్తమామలేరీ అంటా డు. ఇంట ఏదైనా కష్టం జరిగితే నీకు పెద్ద దిక్కంటూ చెప్పుకోవడా నికి వరూ లేరు కనుక నువ్వే అనాథవు అని శివుడు చెప్పాడు.
దాంతో శివుడి ప్రతి పరిహాసానికి ఏం చెప్పాలో తెలియక పార్వతి మరో మాట మాట్లాడక ఊరు కుంది.
ఇక కృష్ణ పద మాధుర్యాన్ని చూద్దాం...
మృద్వీకా రసితా పిసా సమసితా స్ఫీకం నిపీతం పయ:
స్వర్లో కేపి సుధా ప్యధాయి కతిథా రంభాధర: ఖండిత:
సత్యం బ్రూహి మదీయ చిత్త భవతా భూయ: పరిభ్రామ్యతా
కృష్ణే త్యక్షరయో రయం మధురిమోద్గార: క్వచి ల్లక్షిత:
ఓ కవి ఈ విధంగా తన మనసుని ప్రశ్నించుకున్నాడని ఈ శ్లోకం చెప్తోంది.
ఓ మనసా, నువ్వు తృప్తిగా పాలు తాగావు, బాగానే ఉంది. పొట్ట నిండా ద్రాక్ష తిన్నావు. మధురంగా ఉందని చక్కెర తిన్నావు. స్వర్గంలోని అమృతాన్ని కూడా రుచి చూశావు. ఎన్నోసార్లు దేవ వేశ్య అయిన రంభ మధురమైన అధరాన్ని ఆస్వాదించావు. ఇంకా ఎక్కడెక్కడో ఎన్నెన్నో విషయాల్లో సంచరిస్తుంటావు. అపారమైన అనుభవాన్ని సంపాదించావు. తద్వారా జ్ఞానాన్ని సంపాదించావు. ఇదంతా బాగానే ఉంది కానీ నీ లోక భ్రమణ యాత్రలో కృష్ణ నామస్మరణ మాధుర్యాన్ని ఎప్పు డైనా చవిచూశావా....ఆ అనుభవ మెక్కడైనా నీకు కలిగిందా.... రాలేదు కదూ....భగవన్నామ స్మరణ మధురమైనది. ఆ ఆనందం ఊహకందనిది కదా అని అను కుంటాడు. నిజమేగా ఎక్కడెక్కడ సంచరించి ఎంతెంత తెలుసుకుం టేనేం...కృష్ణుడనే మాట ఉచ్చా రణలో పొందే ఆనందానికి సాటేది....
  

కామెంట్‌లు