భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 268 వ రోజు
సాయం కాలానంతర యుద్ధం
భీష్ముడు ప్రచంఢునిలా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్ళి పన్నెండు నారాచ బాణములను ధర్మరాజు పైన అర్జున, భీమ, నకులసహదేవులపై ఒక్కొకరిపై మూడేసి ప్రయోగించాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నులపై వాడి శరములు వేసి నొప్పించాడు. వెంటనే మగధ, విరాట, కురు దేశాధీసులు, సోమకుడు తమ సైన్యాలతో భీష్ముని చుట్టు ముట్టారు. ద్రోణాచార్యుడు తన వాడి అయిన బాణములతో సాత్యకిని, పాండు సుతులను ఎదుర్కొని అంతటా తానై వీరవిహారం చేస్తున్నాడు. భీష్ముడు తనను ఎదిరించిన వారిని శరపరంపరతో అస్త్రశ్త్రములతో వేధిస్తూ రధమును చిత్ర, విచిత్ర రీతుల నడుపుతూ పాండవ సైన్యాలను చెండాడుతున్నాడు. తన శరములతో హయములను, గజములను తనుమాడుతున్నాడు. రణభూమి అంతా చనిపోయిన హయ, గజములతో నిడి పోయింది. పాండవ సైన్యమంతా భీష్ముని ధాటి చూసి భయకంపితమైనది. భీష్ముని ఆపగలిగిన వారు లేక పోయారు. కనిపించిన వారిని కనిపించినట్లు చంపుతున్నాడు. హయముల, విరిగిన రధముల, సైన్యముల హాహాకారములతో, గజముల ఘీంకారధ్వనులతో రణ రంగం మార్మోగి పోయింది.
శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించుట
భీష్ముని విజృంభణ చూసిన శ్రీకృష్ణుడు " ఈ రోజు భీష్ముడు అత్యంత శౌర్యంతో మన సేనలను తనుమాడు తున్నాడు. నీవేమో చోద్యం చూస్తున్నావా " అని ఎత్తి పొడిచాడు. అర్జునుడు డోలాయ మనస్కుడై మిన్నకున్నాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా ! నా మాట విన లేదా! నిన్ను నమ్మి యుద్ధమునకు వచ్చిన రథికులు నిన్ను చూసి నవ్వరా ! నాడు విరాటుని కొలువులో సంజయునితో నీవాడిన మాటలు మరిచావా " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! సకల బంధుజనాన్ని చంపి ఏమి ఘనకార్యం చేసానని ఈ రాజ్యాన్ని ఏలుకోను. యుద్ధం చేయ మనస్కరించుట లేదు కాని క్షత్రియ ధర్మం విడవలేను కదా " అని నిర్వేదంగా భీష్ముని ఎదుర్కొన్నాడు. పారి పోతున్న సైన్యాలను " ఆగండి అందరమూ కలిసి భీష్ముని ఎదుర్కొంటాము " అన్నాడు. అర్జునుడు సింహనాదం చేసి గాండీవం సంధించి మహాస్త్రములను భీష్మునిపై సంధించాడు. భీష్ముడు అర్జునిని బాణములు త్రుంచి తిరిగి బాణములు వేసి అర్జునిని శరీరం రక్తసిక్తం చేసాడు. అవమాన భారంతో క్రుంగిన అర్జునుడు పదునైన బాణమును వేసి భీష్ముని విల్లు విరిచాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకోగా అర్జునుడు దానిని కూడా విరిచాడు. మనుమడి నైపుణ్యానికి మురిసిపోతూనే పాండవ సైన్యంపై శరవర్షం కురిపిస్తూ అర్జునిని శరీరాన్ని తూట్లు పడేలా కొట్టాడు. అర్జునుడు అలసి పోయాడు. శరీరమంతా బాణపు దెబ్బలకు బాధపడుతూ ఉంది. వివశుడైన అర్జునిని మరింతా తన శరములతో బాధించ సాగాడు భీష్ముడు. మిగిలిన వారు భీష్మునికి ఎదురు నిలువ లేక పారి పోయారు.
శ్రీకృష్ణుడు భీష్ముని ఎదుర్కొనబూను
పరిస్థితి విషమించడం చూసిన శ్రీకృష్ణుడు ఆగ్రహోదగ్రుడై పగ్గములను నొగల మీద ఉంచి ఒక్క ఉదుటున ధరణీ చక్రం కదిలిందా లేక దిక్కులన్నీ కంపించాయా అన్నట్లు భీష్మునిపై లంఘించాడు. పీతాంబరం జారిపోతున్నా లెక్క చేయక కారు మేఘములు కదిలి వచ్చాయా అన్నట్లున్న శ్రీకృష్ణుని చూసి కౌరవ సేనలు " ఈ రోజుతో భీష్మునకు అంతిమ ఘడియలు సమీపించాయి " అనుకుంటూ నిశ్చేష్టులై చూడ సాగారు. ఇది చూసిన భీష్ముడు " రావయ్యా కృష్ణా ! వచ్చి వేగమే నన్ను సంహరించి నాకు విముక్తి కలిగించు " అని చేతులు ఎత్తి నమస్కరిస్తూ శ్రీకృష్ణుని ముందు మోకరిల్లి ప్రార్ధించాడు. ఇది చూసిన అర్జునకు మతి పోయినంత పనై కృష్ణుని వెనుక నుండి లాగుతూ కృష్ణుడు విదిలించుకుని పరుగెడుతున్నాడు. మరలా వెనుక పరుగెత్తి కృష్ణుని పట్టి " బావా కృష్ణా ! యుద్ధము చేయనని నాకు ఇచ్చిన మాట మరువకయ్యా. నీవు ఇచ్చిమాట నీవే తప్పితే లోకం ఏమంటుంది. నాకు అపవాదు తీసుకు రాకు. నా అలసట తీరింది భీష్మునితో పోరాడుతాను " అనగానే శాంతించి శ్రీకృష్ణుడు తిరిగి రథం అధిరోహించి పగ్గములు చేత పట్టాడు. ప్రళయకాల రుద్రునివలె ఘర్జించి అర్జునుడు గాండీవం సంధించి కౌరవ సేనను రూపు మాపసాగాడు. మహదవకాశం జారి పోయిన భీష్ముడు తిరిగి విల్లు ఎక్కు పెట్టి కృష్ణార్జునుల మీద శరములు నాటాడు. పాంచాల సేనలను భీష్ముడు భారీ కాయుడు చీమలను నలిపినట్లు నలుపుతుంటే కృష్ణునితో సహా పాండవులు నిశ్చేష్టులై చూడ సాగారు. ఈ ఘోరదృశ్యం చేడలేనట్లు సూర్యుడు అస్తమించగానే ఆ నాటి యుద్ధం పాండవులలో భీతిని కలిగితూ ముగిసింది. అందరూ వారి వారి నెలవులకు చేరారు
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి