సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత-226: ఆకాశంలో ఎగిరే పిట్ట కింద నీళ్ళు జూసి భయపడ్డట్టు
****
"ఏమో అవ్వా! గాన్ని సూత్తుంటే మస్తు బుగులైతంది.ఏం జెయ్యాల్నో కాల్జేతులు ఆడట్లే. పొల్లగాడు గట్ల యిశారిచ్చి ఇశారిచ్చి ఒంటిమీదకి ఏవన్న తెచ్చుకుంటడా ఏందని ఇంట్లె అందరం పరేషాన్ అయితున్నం."
 ఇంతకీ ఎవలు శెల్లే? ఎందుకట్ల పరేషానవుతుండ్రు.అంత బాగనే ఉండ్రు గద!నీ మన్వడు ఈ నడ్మల ఏదో పరీచ్చ రాత్తుండని,గాడికేడికో శానొద్దులు గా పరీచ్చ కోస్రం సద్వుకోనీకి బోయిండని ఇన్న. గదేమైంది శెల్లే! పరీచ్చ అయ్యిందా? ఎట్ల రాశిండు? ఐనగని గాడు శిన్నతనం సంధి మస్తు తెల్వికల్లోడు కద. అదృట్టం అంటే నీదే శెల్లే!"
"అయ్యో అవ్వా! గా ముచ్చెటి శెబ్దామనే నీ తానికి వొచ్చిన."కడ్పు సించుకుంటే కాళ్ళమీద పడ్డట్టు ఉందవ్వా" . ఏలకి ఏలు బోసి మా మన్వన్ని  ఆశటల్ల బెట్టి గా పరీచ్చ కోస్రం పట్నం బంపినం. గీడు ఆల్లు బెట్టిన పరీచ్చల్ల మంచి మారుకులు తెచ్చుకుంటుండని మెచ్చుకుంటుంటె ఇంట్లె అందరం  మస్తు ముర్శినమవ్వా!
" మరేమైంది శెల్లే పరీచ్చ మంచిగ రాయలేదా ఏంది? " గీ కాలం పొల్లగాండ్లు ఊకెనే నారాజైతుండ్రు. రాయకపోతే మానెతీ. మల్లో త్యేప రాస్కుందువని శెప్పక బోయిండ్రు. ఇంట్లె ఎవలన్న ఏమన్న అన్నరా ఏంది?"
 గాడు ఎవ్వలితో ఓ మాట అన్పిచ్చుకునే రకం కాదవ్వా! మొన్ననే పరీచ్చ అయ్యింది. బెమ్మాండంగ రాశిండంట. ఇంటికి రాంగనే మొత్తం లెక్క జూస్కుండు.'గటో గిటో ముత్తెమంత తేడైనా మంచి రియాంకు వత్తదే నానవ్వ' అన్కుంట శెప్పుకొని  ఒక్క తీర్గ సంబుర పడ్డడు. గాడు అన్కున్నది నేరవేర్తదని మేం సుత మస్తు కుశాలైనం."
 " మరింకేంది శెల్లే? గంత మంచి యిష్యం శెప్పుకుంట పరేషాన్ అయితున్నం అంటవేంది?"
 "అవునవ్వా! మావోడు రాశిన పరీచ్చ కాయితం ఏదో రాష్టంల బయటికొచ్చిందంట.గిప్పుడు రాశిన పరీచ్చ శెల్లదని మల్ల రాయాలి అంటుండ్రంట.గద్దెల్శిన సంది మా మన్వడు అన్నం తింటలేడు, నీళ్ళు తాగట్లేడు. మన్షి డీలా అయిండు.దైర్నం శెడ్డడవ్వా! " ఏం గాదులేరా అయ్యా " అంటే నీకు తెల్వదే నానవ్వా! గీ పరీచ్చ కోస్రం ఎంత కట్ట పడ్డ అన్కుంట కండ్లనీళ్ళు బెట్కుంటుంటే మన్సు కలికలి అయితున్నది.గందుకే నీ తానికి వొచ్చినవ్వా!
అయ్యో గట్లెట్ల జరిగింది శెల్లే! గీత పబుత్వాలు పశి పొల్లగాండ్ల బత్కులతో ఆడుకుంటున్నయి.నిజవేఁ ఎంత రంది అయితది.ఏం జేత్తం.అయితెవాయె తీ!
"ఆకాశంల ఎగిరే పిట్ట కింద నీళ్ళు జూసి బయపడ్తదా శెప్పు? నువ్వు జెప్తుంటే గట్లనే ఉంది గాని పరిత్తితి.గిప్పటి దనుక సద్విందంత కొట్టిన పిండేనాయె. దినాం మల్లొక్క త్యేప యాది జేసుకొమ్మని జెప్త.గాన్ని  నా తానికి రమ్మను. గాడు పిట్టస్మంటోడు . గానికి బయమెందుకు శెల్లె. గిస్మంటప్పుడే మరింత దైర్నంగ ఉండాలె. నువ్వు, కొడుకు, కోడలు సుత గాని ముందు యిశారిత్తున్నట్టు ఉండమాకుండ్రి."
 "గట్లనే అవ్వా! గిప్పుడే బొయ్యి గాన్ని తోలుకొత్త" అన్కుంట బోతున్న శెల్లొంక సూత్తూ " గీళ్ళకంటే దగ్గరున్న గన్క దైర్నం జెప్పిన. ఎంత మందిరి పొల్లగాండ్లు,గాల్ల అమ్మ నాయినలు గిదిన్నంక పెశాంతంగ ఉంటరు? గవన్ని తల్సుకుంటుంటే అవ్వకి సుత గుడ్లల్ల నీళ్ళు తిర్గినయి.
గదీ సంగతి " ఆకాశంల ఎగిరే పిట్ట కింద నీళ్ళు జూసి భయపడ్డట్టు" అంటే గిదే మరి. బాగ సద్వుకున్నోడు గిస్మంటి వాటికి బయపడొద్దని శెప్పడమే గిందులోని అస్లిషయం.

కామెంట్‌లు