సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 
సామెత -242: ఆమె పేరు కుంతలమ్మ చూడబోతే...
*****
"అవ్వా! నీకో గమ్మతి ముచ్చెటి శెప్పాలె. నాకే గీ యిష్యం తెల్శిన కానించి మస్తు నవ్వొత్తుదనుకో. ఒకేపు నవ్వు,ఇంకో ఏపు 'అబ్బో! గా తెల్వి పాడుగాను. బలే సేశిందే అన్పిచ్చింది.
గంతేలే అవ్వా! గాల్లవ్వ జేశిన పన్కి గీ పొల్ల ఏం జేత్తది తీ. అయిన గని ఎయ్యి అవద్దాలాడైన ఓ పెండ్లి జెయ్యాలె అంటరు.అగ్గో ఒకలికొకలు ఎత్తిపొడ్సుకోకుండ ఇద్దరికిద్దరు మాగనే సరిపోయిండ్రుపో!"
 "ఇంతకీ ఎవలు శెల్లె! ఎక్కడ గంత గమ్మతి ముచ్చెటి జర్గింది. నువ్వు శెప్తుంటే గదేందో యినాలని మన్సు గుంజుతుంది. జల్ది శెప్పు శెల్లె!''
 ఏండ్లే అవ్వా!మా తిరుపవ్వ మన్వడు పెండ్లి సంవందాలు ఎన్ని సూశినా వొద్దొద్దని తిప్పి కొట్టిండని శెప్పిన కదవ్వా!"
అవును శెల్లె! గా పిలగాడికి గీ నడ్మల లగ్గమేదో కుద్రిందని శెప్తివి గద!"
 "కుద్రింది అవ్వా!ఆడు అన్కున్న తరీక పిల్లే దొర్కింది.పిల్ల పేరు సుత కుంతల. బావుంది గద.గందుకే గాని సంబురం అంతింత గాదు."
"అవునా శెల్లే! ఇంకేం! గట్ల కోరిన సంవందం కుదిర్తే రొండైపుల మస్తుగుంటది.అయితే గిందుల గమ్మతి ముచ్చెటి ఏవుంది శెల్లే!"
"గట్ల అన్కున్న పదేను దినాలకే మా తిర్పతవ్వ మన్వడికి గా పొల్లతో లగ్గం అయ్యింది.లగ్గంల పతొక్కలి సూపు పిల్ల బారు జెడ మీదనే. పేరుకు దగ్గట్టే నెత్తి సుత బలే బారుగ,అందంగుంది అనుకుండ్రు."
"ఇంగ లగ్గమైనంక కార్యం జేత్తరు గదవ్వా!"
"అవును శెల్లె మంచి మూర్తం బెడితే మంచి సంతు గల్గుద్దని గది సుత ఎంతో ఏడ్కగ సేత్తరు."
 " గట్లనే తిర్పవ్వ మన్వడి జంటకి కార్యం జేశిండ్రు.గా రాతిరి బుట్టెడు మల్లెపూలు పెట్టిన గా పొల్ల జెడని సూడంగనే  గీనికి సంబురమెక్కువై సుతారంగా జెడబట్టి దగ్గరికి గుంజిండంట.ఇంకేముంది ఇగ్గు ఊడి బయట పడింది. మనోడిక  ఒకటే లబోదిబో మనడం. గింత మోసం శేత్తరా? గా నెత్తి ఎంట్రికలు బారుగున్న పిల్లని శేస్కోవాలని కలలు గన్న. గయ్యన్ని కల్లైనయని పొద్దున్నే పంచాయితి సుత పెట్టిచ్చిండంట.
 గిదేదో సామెత లెక్కనే ఉంది శెల్లె! "ఆమె పేరు కుంతలమ్మ సూడబోతే బోడితల" అన్నట్టుంది."
అవునవ్వా! గా పంచాతిల ఇంకో నవ్వొచ్చే ముచ్చెటి శెప్పనా ! గీ తిర్పమ్మవ్వ పంచాతిల త్యేప త్యేపకూ వొద్దురా పంచాతి అని సైగ శేత్తున్నా సూడకుండ ఏదేదో అంటుంటే " ఒరేయ్! నోరు ముయ్యవంటే ముయ్యవేందిరా అని మన్వడి తల్కాయ మీద శెయ్యేసిందంట. గా అవ్వ శేతికున్న మెల్కెల మురుగు సందుల గాని నెత్తి గట్టిగ ఇరుక్కుందంట. గది గట్టిగ గుంజే తల్కి గా రింగుల రింగుల జుట్టు యిగ్గు ఊడి పోయిందంట. గా బట్ట తల సూశి అందరు ఒక్క తీర్గ నవ్వుడే నవ్వుడు పో.. గీని రింగుల జుట్టు సూశి గా పొల్ల, గా పొల్ల బారు జుట్టు సూశి గీడు.. ఇద్దరూ మోసపోయిండ్రు.కాబట్టి తప్పుకు తప్పు శెల్లు.ఇంక సుబ్బరంగా కాప్రం జేస్కోండి అన్నరంట అక్కడికొచ్చిన పెద్ద మడుసులు."
బలేగుంది శెల్లే!  పేరుకి ఇద్దరు సరిపోయిండ్రు. గా పొల్ల కుంతలమ్మ, గీడు కుంతలయ్య... అసలుకొత్తె బట్ట తల్కాయలు... ఇంటుంటెనే నవ్వొత్తోంది."
 "గదండీ సంగతి." ఆమె పేరు కుంతలమ్మ సూడబోతే బోడితల "అంటే గిదే మరి


కామెంట్‌లు