16 వ శతాబ్దంలో వచ్చిన శాస్త్రీయ విప్లవం తర్వాత ప్రపంచ దృష్టి మారింది. చక్రం కనుగోనడంతో మానవ జీవితం ఎన్నో మార్పులకు లోనయింది. మైక్రో స్కోపు కనుగోన్న తర్వాత కంటికి కనబడని జీవులు చాలా జబ్బులకు కారణమని తెలిసింది. పెన్సిలిన్ మందును కనుక్కున్నాకే ఎన్నో మరణాలను ఆపగలిగారు. మానవ పరిణామం మొత్తం కూడా సైన్స్ వలనే జరిగింది. మానవుడి మదిలో ఉద్భవించిన ప్రశ్నలకు కారణాలు వెతుక్కుంటూ పరిశోధిస్తూ సాగిన ప్రయాణమే సైన్స్ కు దారి తీసింది. ఒక ప్రయోగం ఎన్నిసార్లు చేసినా ఒకే రకమైన జవాబు వచ్చినపుడు మాత్రమే ఆ ప్రయోగం సఫలమైనట్లుగా భావిస్తాం. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, నీరు, నిప్పు, అగ్ని వంటి ప్రకృతి మధ్య జరిగే పరిణామాలు, ఉత్పత్తుల గురించి తెలుసుకోవడమే సైన్స్ అనవచ్చు . సైన్స్ ద్వారా తెలుసుకున్న ప్రగతి ఫలాలను మానవుడి సుఖ జీవనానికి ఉపయోగించు కోవటం వల్ల సైన్స్ అభివృద్ధి చెందుతున్నది. ఒకనాడు అనుకున్న విషయాలు తర్వాత్తర్వాత మూఢ నమ్మకాలని తేలడంతో తెలివిగా మసలు కోవడం మొదలు పెట్టిన మనిషి ప్రగతి పథం వైపు పయనించసాగాడు.
సైన్స్ లేదా విజ్ఞానశాస్త్ర రంగంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. సాధారణంగా వీటిని సమాజశాస్త్రాలు, జీవ శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు అంటు మూడు భాగాలుగా విభజించారు. విశ్వంలోని భౌతిక, భౌగోళిక, రసాయన శాస్త్రాలను సహజ దృగ్విషయాలు అధ్యయనంగా పిలుస్తారు. వీటినే సహజ శాస్త్రాలు అని అంటారు. అదే విధంగా ఫార్మల్ సైన్సెస్, మ్యాథ్స్, వంటి మెథడాలజీకి సంబంధించిన వాటిని అధ్యయనం చేస్తారు. వీటిని ఫార్మల్ సైన్సెస్ అంటారు. సామాజిక, సాంస్కృతిక అంశాలతో కూడిన మానవ ప్రవర్తనల అధ్యయనాన్ని మానవీయ శాస్త్రాలు అంటారు . సహజ శాస్త్రాలను జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం అని రెండు విభాగాలుగా విభజిస్తారు. మనం మామూలుగా వృక్ష, రసాయన భౌతిక శాస్త్రాలు, జంతు, జీవ శాస్త్రాలను సైన్స్ గా భావిస్తాము. అదే మ్యాథమ్యాటిక్స్ కు సంబంధించిన వాటిని టెక్నాలజీగా సంభోదిస్తాం.
నేను ఎక్కువగా వృక్ష జంతు శాస్త్రాలను, వైద్య శాస్త్రంలోని పిల్లల విభాగంలోనూ ఎక్కువ రచనలు చేస్తున్నాను. రసాయన, భౌతిక శాస్త్రాలను తక్కువగా రాస్తున్నాను. ఈ పుస్తకంలో బొగ్గు, బంగారం వంటి రసాయన శాస్త్రం లోని మూలకాలు ఖనిజాలు గురించి రాశాను. కొన్ని కథలు కూడా రాశాను. అవన్ని తర్వాత పుస్తకంలో సైన్స్ కథలుగా వస్తాయి . నేను సైన్స్ అని పేరు పెట్టి రాసిన పుస్తకాలలో ఇది నాలుగవది మొదటిసారిగా సైన్స్ పాయింట్ అనే పుస్తకం రాశాను. ఇందులో శాస్త్రవేత్తల జీవిత చరిత్రల గురించి సూక్ష్మ పరిచయం చేశాను. ఈ జీవిత చరిత్రలన్నీ 'బాలతేజం’ అనే పిల్లల మాసపత్రికలో ప్రచురింపబడ్డాయి. "సైన్స్ పాయింట్ అనే శీర్షికన మూడు నాలుగేళ్ళు కాలమ్ గా రాశాను. అలా రాసిన వాటిలో కొన్నింటిని తీసుకుని పిల్లలకు శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో పుస్తకంగా తీసుకువచ్చాను. ఎన్నో కష్టాలు పడి మానవాళి ఉపయోగం కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలు పిల్లలకు తప్పని సరిగా తెలియాలి . అందుకే పత్రిక వారి శీర్షిక పేరునే నా పుస్తకానికి పెట్టుకున్నావు. ఈ పుస్తకానికి ముఖ చిత్రంగా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డా|| ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి ఫోటోను వేశాను . లోపల ఇన్నర్ కవర్ పేజీ గా నేను గిసిన అబ్దుల్ కలం రేఖా చిత్రాన్ని పెట్టాను. అలాగే ఈ పుస్తకాన్ని రాసిన పది ఏళ్ళ తర్వాత డా|| అబ్దుల్ కలాం గారి చేత ఆవిష్కరింప చేశాము . ఒక క్షిపణి శాస్త్రవేత్త. భారతదేశ రాష్ట్రపతి ఐన డా|| ఎపిజె అబ్దుల్ కలాం గారినీ కలవడం నాకు చాలా సంతషానిచ్చింది.
2015లో ' సైన్స్ వరల్డ్' అనే మరో సైన్స్ పుస్తకాన్ని తీసుకువచ్చాను. ఇందులో పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు, నీటిలో ఉంటే జంతువుల గురించిన వ్యాసాలు రాశాను. ఇవన్నీ సైన్స్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. జంతువులు వ్యాసాలతో పాటు కొన్ని వ్యాధుల గురించి కూడా రాశాను . వన్య ప్రాణుల్ని ఎలా సంరక్షించు కోవాలో, కంటికి కనిపించని జీవుల గురించి తెలిపాను. సైన్స్ డేలలోనూ, సైన్స్ ఫెయిర్ లలోనూ ఈ పుస్తకాలను విద్యార్థులకు పంచుతున్నాను. ఇంకా మా ఆసుపత్రికి వచ్చే పిల్లలకు సైతం ఇస్తున్నాము. ఇలా సైన్స్ ను ప్రచారం చేస్తున్నాం. తల్లి పాల విశిష్టత గురించి తల్లులకు ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తాం . ధైరాయిడ్ గ్రంథి పనితీరును, క్యాన్సర్ వ్యాప్తి గురించిన అపోహలు, నిజాలు గురించిన వ్యాసాలు రాశాను.
2018 లో ' సైన్స్ కార్నర్’ అనే బాలల సైన్స్ వ్యాసాలను రాశాను . వీటిని సైన్స్ పత్రికల్లో కాలమ్ గా రాశాను. ఇందులో ఎక్కువగా పక్షుల గురించి రాశాను . నేను వేరే దేశాలు చూసినప్పుడు అక్కడి ప్రముఖ మరియు అరుదైన పక్షుల గురించి వ్యాసాలు రాశాను. వీడియోలు తీశాను. మరో పత్రికలో రాసిన కోన్ని చెట్ల వ్యాసాలు కూడా పొందుపరిచాను. ఇంకా వరంగల్ ఆకాశవాణి కోసం రాసిన బాలల నాటికలను కూడా ఇందులో కూర్చాను. వృద్ధాప్యంలో మహిళల ఆరోగ్యం, ప్రకృతి ఉత్పత్తులలో ఔషధాలు అనే వైద్య సంబంధ నాటికలు పిల్లల చేత వేయించటానికి ఆకాశవాణి రచయితల చేత రాయించింది. ఈ పుస్తకంలో పక్షులు వ్యాసాలు, సైన్స్ నాటికలు, చెట్ల వ్యాసాలున్నాయి.
`డాక్టరు చెప్పిన కథలు అనే పుస్తకం ద్వారా పిల్లల్ని పెంచే క్రమంలో వచ్చే వైద్య సంబంధ ప్రతి కూలతలను ఎలా దాటాలో చెపుతూ కథలుగా మలిచాను. పిల్లలు చేసే చిన్న చిన్న పనులతో ప్రమాదాల్లో ఎలా పడతారో తల్లిదండ్రులకు అంతుబట్టదు. ఊహించను కూడా ఊహించరు. కానీ మా ఆసుపత్రికి రకరకాల సమస్యలతో వచ్చే పేషెంట్లను చూసినప్పుడు నేను అర్ధం చేసుకున్నాను. పుస్తకంగా తీసుకువస్తే ఎంత మందికో అవగాహన కల్పించవచ్చు అనే ఆలోచనతో ఈ పుస్తకాన్ని రాశాను. ఇది చాలా మంది చిన్నారుల తల్లి దండ్రులను ఆకర్షించింది.
2023 లోనే ' చెట్లతో చెలిమి' అనే సైన్స్ పుస్తకాన్ని రాశాను. ఇంగువ, కర్పూరం, కుంకుమపువ్వు, సింధూరి వంటి చెట్ల గురించి వ్యాసాలు 'విజ్ఞాన వని' సైన్స్ పత్రికలో రాశాను. ఇంకా స్విట్జర్లాండ్, నేపాల్, వంటి దేశాల జాతీయ పువ్వుల గురించి అనేక విషయాలు చెప్పాను. గురివింద గింజలు, రుద్రాక్షలు వంటి అరుదైన వృక్షాల గురించి పిల్లలకు ఎన్నో విషయాలు తెలియజేశాను. ఇదోక సైన్స్ వ్యాసాల పుస్తకం.
కరోనా సమయంలో కరోనా వైరస్ గురించి, అది చేస్తున్న నష్టం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ఎన్నో చిత్రాలు చేశాను. కరోనా నేపధ్యంతో కథలు, కవితలు, వ్యాసాలు రాస్తూ, ఇంకా పేషెంట్లకు కూడా చాలా వివరాలు తెలియజేస్తూ కరోనా సమయం గడిచింది. ఇంకా ఆ సమయంలో బయటకు వెళ్ళలేని పరిస్థితిని గమనిస్తూ ఇంట్లో ఉండి తయారు చేసుకునే బోమ్మల గురించి మూడు సంవత్సరాలు కాలమ్ రాశాను. ఇదంతా కరోనా ఖాళీలో చేయగలిగిన కళా ఖండాల గురించి రాయటం జరిగింది. వీటన్నిటికీ కరోనా విషయాలతో జాగ్రత్తలు, వైరస్ జీవిత చరిత్రలు కలపటం జరిగింది. కాబట్టి వీటిని సైన్స్ కళాకృతులు అనవచ్చు.
‘బొటానికల్ జూ' అన్నే పుస్తకాన్ని కూడా సైన్స్ కళాకృతుల పుస్తకం అనవచ్చు. ఎందుకంటే ఇందులోని వ్యాసాలలో విజ్ఞాన శాస్త్ర విషయాల గురించి చెప్పడం జరిగింది. కూరగాయలను కోసి జంతువులుగా తయారు చేశాను. ఈ ప్రక్రియను"వెజిటబుల్ కార్వింగ్' అంటారని మీకూ తెలుసు కదా! కానీ నేను ఇందులో కూరగాయల్లో ఉండే విటమిన్స్ గురించి చెపుతూ పిల్లలకు బొమ్మలతో సైన్స్ ను చెప్పాలని చూశాను. అంతే కాకుండ ఆ కూరలతో తయారయ్యే జంతువుల గురించి కూడా ఎన్నో జంతు శాస్త్ర విశేషాలు తెలియజేశాను. ఇవి చూడటానికి వెజిటబుల్ కార్వింగ్ పుస్తకమే గానీ లోపల్లోపల సైన్స్ పుస్తకం కూడా.
నెలవంక, హరివిల్లు, సీతాకోక చిలుక, ద్రాక్ష గుత్తులు, హౌస్ వైఫ్ వంటి కవితలు, గేయాల పుస్తకాలలో చాలా సైన్స్ విషయాలు తెలియజేశాను. దాదాపుగా నేను రాసిన ప్రతి పుస్తకం లోనూ ఏదో ఒక విజ్ఞాన శాస్త్ర విషయాన్ని రాయకుండా ఉండలేదు. నేను తయారు చేసిన చార్టుల్లో సైతం విజ్ఞాన శాస్త్ర విషయాల్నే పొందుపరిచాను. వైద్య శాస్త్ర విషయాలను కథలుగా, కవితలుగా మలిచి సులభంగా పిల్లల మెదళ్ళలోకి చేరేలా ప్రయత్నిస్తున్నాను.
అలాగే ఇప్పుడు రాస్తున్న సైన్స్ ప్లానెట్ లో కూడా విజ్ఞాన వని, సంచిక మ్యాగజైన్లలో ప్రచురితమైన వ్యాసాలే ఉన్నాయి. జీవ వైవిధ్యం, పర్యావరణ దినోత్సవం వంటి వ్యాసాలతో బయోడైవర్సిటీ మానవ మనుగడకు ఎంత అవసరమో తెలియజేశాను. ప్లాస్టిక్ నిషేధం ఎంతో కాలంగా అమలులో ఉన్నది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డిప్పోజబుల్స్ ను వాడవద్దని చెప్పినా పూర్తిగా అమలు కావడం లేదు. నేను ప్లాస్టిక్ వ్యర్థాలతో దాదాపు 300 పైగా కళాకృతులు చేశాును. దాని కోసమే ప్లాస్టిక్ కాలుష్యం వ్యాసాన్ని రాశాను.
వైద్య పరంగా పిల్లల్లో అనేకరకాల జబ్బులు వస్తుంటాయి. వాటిని రాకుండా నిరోధించడానికి, ఒక వేళ వస్తే వాటిని తగ్గించుకోవడానికి తిసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తల్లి పిల్లలకు తెలిసే విధంగా వ్యాసాలు రాశాను. పిల్లల్లో వచ్చే మానసిక సమస్యలపై ఎక్కవగా దృష్టి పెట్టి అలాంటి వ్యాసాలు రాశాను. అటిజం, డిప్రెషన్ వంటి అనేక మానసిక ప్రవర్తనల గురించి విపులంగా తెలియ జేశాను. క్రోమోసోముల తేడా వలన వచ్చే డాన్స్ సిండ్రోమ్ గురించి వివరాలు తెలియ జేశాను. ప్రస్తుత యుగంలో డయాబెటిస్ పెద్దల్నే కాదు పిల్లల్ని వదలటం లేదు. అలాంటి సమస్యలే ఇందులోగా ప్రస్తావించారు.
నేటి సమాజంలో సెల్ టవర్ల వల్ల చనిపోయే పిచ్చుకల గురించి రాశాను. వ్యాసాలు మాత్రమే కాదు పిచ్చుకల బొమ్మలు సైతం తయరు చేసి ఆసుపత్రిలో ఉంచాను. ఆయా రాష్ట్రాలలో ఉండే సీతాకోక చిలుకల పార్కులను చూశాను. ఈ విషయాలన్నిటితో సీతాకోక చిలుకలు వ్యాసాన్ని రాశాను. అలాగే ఎడారి మొక్కలు, ఔషధ మొక్కల గురించి వ్యాసాలు రాశాను. చార్టులూ చేశాను. ధూమపానంతో వచ్చే క్యానర్ల గురించి కూడా వ్యాసం రాయడంతో పాటు వాటి బోమ్మలు సైతం చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ కష్టమంతా ప్రజలకు ఆయా సమస్యల పట్ల అనగాహన కలగాలనే ఆశే కారణం. మరి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పెంచుకుంటారని ఆశిస్తున్నాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి