సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -231 :- ఆత్మ రాయే బాయిల పడ్దామంటే ఐతారం దినాన అందరం పడ్దాం అన్నదట

***
"అవ్వా! నీ మాటల్ల శత్తి శానా ఉందే!ఎవలికేం జెప్పాల్నో గాల్ల మన్సుకు తాకెటట్టు శెప్తవ్? అసలు గిస్మంటి తెల్వి ఏన్నించి వొచ్చిందే? పతొక్కలు నిన్నో సోపతి గాళ్ళ లెక్క సూస్కుంటుంటే మా యవ్వ బయటికే పోదు గాల్లేంది వొచ్చి మరీ కట్ట సుకాలు శెప్పుకుంటరు అన్కుంట గా రగస్యం ఏందో నాకు సుత శెప్పరాదె?"
 "ఏందిరా అయ్యా! గియ్యాల నీ మాటల్తో మున్గ శెట్టు ఎక్కియ్య బడ్తివి. నేనేం జేసిన కొడుకా! బల్లె సద్వుకంటె బత్కు సద్వు శాన సద్విన. గా సద్వునే నల్గురి అక్కెరకి సాయ పడ్తుంది. గంతేరా అయ్యా! ఎన్నల్లేంది గియ్యాల నా ముచ్చెటి యిశారిచ్చబడ్తివి ఏందిరా? ఉత్తుత్తగ నవ్వుతాలుకి,పరాశ్కానికి అంటున్నవా? నిజ్జంగ అంటున్నవా? తెలుత్తలే.
 "అవ్వా! నువ్వు నేర్పిన సద్వు సందె గట్ల అవ్వతో పరాశికమాడనిత్తదా! నా శిన్నతనం సంధి సూత్తనే ఉన్నా! ఎప్పుడేదో పని బెట్టుకుంటవు. ఇంటికొచ్చి మంచి శెబర అడిగేటోళ్ళని నీ మంచితనంగ పెంచుకున్నవ్. నువ్వు శానా శానా గిరేటు అవ్వా! గిప్పటి మా వొయిసోల్లు నీ తాన నేర్సుకునేటియి శాన్నే ఉన్నయి."
 "మొన్న మొన్న మా దోత్తుగాడు సద్విన సద్వుకు కొలువు రాలేదని సత్త బతుకత అన్నోన్ని నీ తానికి తెత్తే ఏం మంతరం ఏశినవో ఏమో...గాడే యియ్యాల నల్గురు పనోళ్ళని బెట్కొని ఆయిగ బత్కుతుండు.
" గా శెంద్రమ్మత్త బిడ్డ కాప్రం తెగేదాకొత్తె.. సక్కదిద్ది సంబురంగ సంసారం జేస్కునేల జేషినవ్?"  గియ్యన్ని తల్సుకుంటే... మస్తు గొప్పగనిపిస్తదవ్వా!
" ఏందిరా అయ్యా! పొద్దుగాల లేశిన కానించి సూత్తున్న. నా ఎనికెనిక తిరుక్కుంట ఏంటేంటో అంటున్నవ్. గీ అవ్వ మీద గింత ఆపాచ్ఛన ఎట్లొచ్చిందిరా ''
 "మొన్నోపాలి మనింటికొచ్చిన అత్త నువ్వు ఎన్కటి ముచ్చెట్లు పెట్టుకుంటుంటె కొస కొస యిన్న.నువ్వు సత్తనని అన్కున్నవని, గట్ల సత్తె గియ్యాల నీ పిల్లలు గిట్ల ఉండేటోల్లా అనింకేదో అంటుంటే యిన్నవ్వా! అందర్కి దైర్నం జెప్పే నువ్వెట్ల దైర్నం శెడి గట్లెట్ల  సావాలనుకున్నవో,మల్లెవలు నిన్ను బతికిచ్చిండ్రో తెల్సుకోవాలనిపిత్తోంది."
"గదెందుకురా అయ్యా  యాజ్జేత్తవ్? నా దోత్తు మాటల్ల యిన్నవ్ గా ఎన్ని కట్టాలు పడ్డనో..ఇంగ నావొల్ల గాక ఏ బాయిల్నో శెరువుల్నో పడ్డామని అనుకున్న.మిమ్మల్ని ఇంటికాడ ఉంచి శేని కాడ బాయి తానకి బోయిన. ఇంగ గూసున్న కట్టాలన్ని యాజ్జేసుకున్న.సత్తెనే తీర్తయి అన్కున్న... మన్సు బాగులేనప్పుడు,ఎవల్నన్న తిట్టాలన్కున్నప్పుడు ఒకటి కానించి వొంద అంకులు లెక్క బెట్టమని మా తాత శిన్నప్పుడు శెప్పినయి యాదికొచ్చినయి.గయ్యి లెక్క బెట్టుకుంటనే "ఆత్మ రాయే బాయిల పడ్దామన్న.ఐతారం దినాన అందరం పడ్దాం తీ" అని నన్ను గక్కడ కూసున్న కానించి లెవ్వనియ్యకుండ సత్తేం సాదిత్తవ్.ఏదన్న బత్కి సాదిచ్చాలె గని.నువ్వు సత్తె నీ పసిపొల్లగాండ్లు అమ్మ నాయినలు, దోత్తులు ఏమైతరు? గిట్ల నా లోపలున్న ఆత్మ సావాలన్న నా బుద్దిని తిట్టి ఆపింది.గట్ల ఆగిన గన్కనే గిట్లున్న యిప్పుడు."
 " అవ్వా!గట్ల అందర్కి ఆత్మ వుంటుందా!గిట్లనే శెప్తదా? ఐతారం పడ్దమనడం ఏంది? గయ్యాల ఏమన్న మంచి మూర్తమా ఏంది? 
 " మూర్తము కాదురా అయ్యా! తొందర పడకుండ మన్షిని,మన్సుని ఆపడం అన్నమాట" మన మెస్మంటోళ్ళమో మనకి తెలుత్తది గద. మనం జేశే మంచి శెబర ఆత్మ సూత్తనే ఉంటది.తప్పయితే నిలదీత్తది.ఒప్పైతే మెచ్చుకుంటది.దేనికి తొందర పడొద్దని సుత శెప్తది రా అయ్యా!"
 " అవునే అవ్వా! గయ్యాల నీ ఆత్మ శెప్పి మన్సు మార్సక పోతే... వామ్మో..తల్సుకుంటేనే పెయ్యంత శెమటలొత్తున్నయి."
"పతోళ్ళకి శిన్నదో పెద్దదో కట్టం వొత్తనే ఉంటదిరా అయ్యా! మన ఆత్మ శెప్పినట్టు యింటే శేయ బొయ్యే తప్పు ఆయిదా పడ్తది మల్లోపాలి శెయ్యకుండ ఆపి మంచి దినాల్ని ముందటికి దెస్తది. గందుకే ఎన్కటోళ్ళు "గ గీ సామెత శెప్పి తొందర పడొద్దని అంటరు."
 గదండీ సంగతీ! "ఆత్మ రాయే బాయిల పడ్దాం అంటే ఐతారం దినాన అందరం పడ్దాం " అన్నదట.. గిందులో ఎంత లోతుందో తెల్సింది గదా? ఐతారమైతే అందరింట్ల ఉంటరు. గాళ్ళని జూసైన మన్సు  మార్తుందని శెప్పడం కోస్ర మే గా సామెత.
కామెంట్‌లు