శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 113
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
92. కులాంగనా (చతురక్షరీ)
93. కులాంతస్థా (చతురక్షరీ)
తొంభై మూడవ నామ మంత్రము - 
  ఓం కులాంతస్థాయై నమః
కులమునకు మధ్యలో ఉన్నది. కులమునకు కేంద్రబిందువు గా నిలిచి ఉన్నది. పంచభూతాలు అయిన ఆకాశము, నీరు, నేల, నిప్పు, గాలి, దట్టమైన కారడవి, నడి సముద్రము, జనసంచారము గల నగరములు, కులము గా వుండి, ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరాత్పరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు "కులాంతస్థా" అని పిలిచి కొలిచారు. అన్నింటా తానై, అన్నీ తానే అయిన జగన్మాత కు నమస్కారము.
"కుల అంతః స్థా" అనగా "కులము యొక్క మధ్యలో ఉన్నది" అన్నమాట. మూలాధారము యొక్క ఆరు చక్రములలో కూడా ఆయా చక్రాధి దేవత రూపంలో ఉన్నది, శ్రీమాతయే. మొదటిది అయిన మూలాధార చక్రము లో "గణపతి" గానూ, స్వాధిష్ఠాన చక్రములో " బ్రహ్మ గానూ, మణిపూరక చక్రము లో "విష్ణువు" గానూ, అనాహత చక్రములో "రుద్రుడు " గానూ, విశుద్ధ చక్రము లో "జీవుడు " గానూ, ఆజ్ఞా చక్రము లో "ఈశ్వరుడు " గానూ, సహస్రారము లో ప్రమేశ్వరుని తో అర్ధనారీశ్వర తత్వం గానూ , అమ్మ అలరారుతోంది. ఈ విధంగా షట్చక్రముల మధ్యలో వున్న కాత్యాయని "కులాంతస్థా" అని పిలువబడుతోంది.
జగత్తుకు మూలాధారమైన భూతత్వాన్ని, మణిపూరకం లోని జలతత్వాన్ని, స్వాధిష్ఠానములో అగ్ని తత్వాన్ని, అనాహత చక్రములో వాయు తత్వాన్ని, విశుద్ధ చక్రము లో ఆకాశ తత్వాన్ని, ఆజ్ఞా చక్రము లో మనస్ తత్వాన్ని దాటి సుషుమ్నా మార్గములో పరమేశ్వరుని చేరి పరమానందభరితురాలవై, కుల శాస్త్ర రహస్యాలు కాపాడుతూ ఉన్న నీవు, "కులాంతస్థా"గా కీర్తించబడుతున్నావు.
కులము - ఒకే విధమైన ఆచారాలు, వ్యవహారాలు సంప్రదాయాలు పాటించే ఒక సముదాయము. షట్చక్రాలూ, సుషుమ్న నాడి కలిపి, కులముగానే చెప్పబడతాయి. గురువంశ పరంపరను, శిష్యులు పాటించడాన్ని కూడా కులముగానే పరిగణిస్తారు.
ఈ ప్రకారముగా, శ్రీ సూక్తం, శ్రీవిద్య, శ్రీచక్రం, శ్రీలలితా సహస్రనామాలు, ఇవి కూడా ఒకే పరమేశ్వరిని కీర్తించే విధానాలుగా వుండి, ఒకే కులముగా నిలుస్తాయి. వీటన్నిటికీ మధ్యలో వున్న కేంద్ర బిందువు లలితా పరాభట్టారికయే. అలా కేంద్ర బిందువు గావున్న శ్రీమహారాజ్నాని *ఓం కులాంతస్థాయై నమః అని ధ్యానం చేసుకోవాలి.*
తన సృష్టి యొక్క జీవనస్రవంతికి మధ్యలో ఉండి, తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం కులాంతస్థాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు