శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - - 118
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....

97. సమయాన్తస్థా (పంచాక్షరీ)
98. సమయాచార తత్పరా (అష్టాక్షరీ)

తొంభై ఎనిమిదవ నామ మంత్రము - 
  ఓం సమయాచార తత్పరాయై నమః

శ్రీవిద్యోపాకులు అయిన మహా గురువుల ద్వారా "మహావేధ" అనే సంస్కారమును పొంది, "మహావేధ" సంస్కారములో చెప్పబడిన "సమయపాలన" ను పాటిస్తూ, తన కొరకు సాధన చేస్తున్న సాధకుల "సమయపాలనను" ఇష్టపడి, మురిసిపోతూ ఉన్న పరమేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "సమయాచార తత్పరా" అని కీర్తించారు. సమయాచారానికి ముగ్ధురాలైన జగన్మాత కు నమస్కారము.

ఈ "మహావేధ" సాధించడంలో రెండు సాధనలు ఉన్నాయి . 1 - ‌షడ్విదైక్యము, 2 - చతుర్వదైక్యము.

షడ్విదైక్యము - శ్రీచక్రము, అ కారము నుండి క్ష కారము వరకు ఉన్న వర్ణ మాతృక, పన్చదశీ విద్య, లలితాదేవత, బ్రహ్మాండము, పిండాండము అని ఆరు రకాలుగా చెప్పబడింది. అలాగే, చతురవైద్యము - పరదేవతా శ్రీచక్రములకు ఏకత్వము, శ్రీచక్ర బ్రహ్మాండములకు ఏకత్వము, బ్రహ్మాండ పిండాండములకు ఏకత్వము, వర్ణమాతృకా దేవతల ఏకత్వము. ఈ షడ్విదైక్యము, చతుర్విదైక్యము అనే సాధనా పద్ధతులు ఎంతో శక్తివంతమైనవి, నిగూఢమైనవి. అందువల్ల, శ్రీవిద్యోపాసన నిత్యమూ చేస్తూ, సాధకులైన గురుపుంగవుల ద్వారా మాత్రమే ఉపదేశం పొంది, ఆచరించవలసిన సాధనా మార్గాలు అని తెలుసుకుని, గుర్తు ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఆ విధంగా శ్రీవిద్యోపాసకులైన గురువు వద్ద శిక్షణ పొంది, షడ్విదైక్యము, చతుర్విదైక్యము పద్ధతులను సమయము తప్పకుండా సాధన చేసిన సాధకులు, "మహావేధ"అనే సంస్కారాన్ని పొందుతారు. ఈ "మహావేధ" సుస్కారము ఒక మహర్నవమి నాడు, సాధకునికి కలుగుతుంది.

ఈ విధంగా "మహావేధ" సంస్కారమును పొందిన సాధకుడు, సమయపాలనను పాటిస్తాడు. తనను చేరుకోవాలి అని సాధన చేసే సాధకుడు సమయపాలన సరిగా ఆచరిచేటట్టు చూడాలి అనే ఆతృతగా ఉన్న పరమేశ్వరి "సమయాచార తత్పరా" అయ్యింది.

సమయాచారములను పాటిస్తూ, షడ్విదైక్యము, చతుర్విదైక్యము పద్ధతులను పాటిస్తూ అమ్మ కోసం సాధన చేసే సాధకులు, షోడశోపచారాలతో కుండలినీ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరిని మణిపూర చక్రము నుండి సహస్రారములో, బిందు మధ్యలో కొలువై ఉన్న పరమేశ్వరుని వరకు తీసుకు వెళ్ళి, అక్కడ ఉన్న సహస్ర దళ పద్మములో ప్రవేశింప జేసి, పరమాత్మ లో ఐక్యము చేసిన తరువాత , శివశక్తుల ఐక్యము నకు తెరచాటు కల్పించి, మరల శ్రీమాత సహస్రార చక్రము నుండి మణిపూర చక్రము వరకు తిరుగు ప్రయాణం మొదలు పెట్టే వరకూ, వేరే గదిలో ఉండి నిరిక్షిస్తూ చేసే సమయపాలనకు పరాత్పరి ఆకర్షితురాలై ఆనందిస్తుంది. ఈ వేచి ఉండడాన్ని "సమయాచారము" అంటారు.

అంతర్ముఖంగా సమయపాలన చేస్తూ, తామస లక్షణాలతో కాకుండా, తాపసి లక్షణాలతో తనను చేరుకోవాలి అని సాధన చేసే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం సమయాచార తత్పరాయై నమః అని జపించాలి.

శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....

...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు