టూరు : - వరికుప్పల లక్ష్మి-6( E/M)వ తరగతి -Zphs బాలురు బాదేపల్లి -మహబూబ్ నగర్ జిల్లా -9490143067
 

అనగనగా బూరుగుపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి. ఆమె పేరు లత. వాళ్ళ తమ్ముడి పేరు రవి. వాళ్ళ నాన్న పేరు రాజయ్య. రాజయ్య పొలం పని చేసేవాడు. వాళ్ళ అమ్మ పేరు గౌరీ. గౌరీ ఇంటి పనులతో పాటు రాజయ్యకి పొలం పనుల్లో కూడా సహాయం చేసేది. లత బాలికల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది. రవి ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు రవి వాళ్ళ పాఠశాలలో నాగార్జునసాగర్ కు టూరు వెళ్దాం, అందుకు ఒక 500 రూపాయలు తెచ్చుకోవాలన్నారు. అందరూ ఎంతో సంతోషంగా గంతులు వేసి సరే అన్నారు. సాయంత్రం రవి ఇంటికి వచ్చి, వాళ్ళమ్మ దగ్గర టూర్ గురించి చెప్పి, డబ్బులు అడిగాడు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అన్నది, “బాబు ఇప్పుడు ఇంట్లో డబ్బులు లేవు. మేము నీకు అంత డబ్బు ఇవ్వలేము” అని. ఆ మాటలు విన్న రవి మొహం మాడ్చుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గౌరీ, రాజయ్య కూడా రవికి డబ్బులు ఇవ్వాలని వాళ్ళని వీళ్ళని అడిగిచూశారు. కానీ ఎవ్వరు ఇవ్వలేదు. రవి మాత్రం అప్పటి నుండి అమ్మ నాయినల మీద కోపంగా ఉండసాగాడు. 
ఒకరోజు రవి బడి నుండి గబగబా ఉరుక్కుంటూ వచ్చి వాళ్ళమ్మను ఇలా అడిగాడు, “అమ్మ! రేపు అక్క వాళ్ళ పాఠశాలలో టూరు వెళ్తారంట! మమ్ములను తీసుకుపోతామన్న చోటకే తీసుకుపోతారంట! నువ్వు అక్కని పంపిస్తావా?” అని. అప్పుడు వాళ్ళ అమ్మ "అవునా! నాకు అక్క చెప్పలేదే!" అని లతని పిలిచింది. “నువ్వు నాకు ఎందుకు టూర్ గురించి చెప్పలేదు?" అని లతని అడిగింది. అప్పుడు లతా ఇలా అన్నది, "అమ్మా! నిన్ను నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు" అని అన్నది. ఆశ్చర్యపోయిన గౌరీ ఇలా అన్నది, "అవునా! నువ్వు మా బాధని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం" అని. అక్క మాటలు విన్న రవికి బుద్ధి వచ్చింది. అప్పటి నుంచి అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టడం మానేసి బాగా చదువసాగాడు. క్రమశిక్షణగా ఉండడం నేర్చుకున్నాడు. 
లత వైద్యురాలు కావాలనే పట్టుదలతో కష్టపడి చదివి ఎం.బి.బి.ఎస్. పాస్ అయ్యింది. రవి పోలీస్ కావాలని పట్టుదలతో చదివి చివరికి ఎస్.ఐ అయ్యాడు. తర్వాత అక్క తమ్ముడు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మనాన్నల్ని విమానం ఎక్కించి దేశం మొత్తం చూపించారు. వాళ్ళమ్మ నాన్న తమ పిల్లల్ని చూసి ఎంతో గర్వపడ్డారు. రవికి లతకి విద్య నేర్పిన ఉపాధ్యాయులు కూడా వాళ్ళని చూసి సంతోషించారు.
కామెంట్‌లు