మత్తుతో చిత్తు: - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట -చరవాణి: 9490904976
 మనిషిని  మృగంగా మార్చేవి సారా, బ్రాందీ, విస్కీ, గుట్కా, పాన్, బీడీ, చుట్ట, సిగరెట్, గంజాయి, భంగు వంటి మత్తు పదార్థాలు.
మనిషిని తన వశం చేసుకొని మత్తులో ఊగిస్తాయి. వాటికి బానిసైతే ఇల్లు, పిల్లలు, కుటుంబం ఇవేవీ కానరావు. త్రాగేవాడికి త్రాగుడే ఒక లోకం. ఇంటివారిని పట్టించుకోక కుటుంబం చిన్నాభిన్నామైపోతుంది. త్రాగి, ఊగి, పడిపోయి పదిమందిలో పరువుపోయి ఇంటి పేరును మంట గలిపేస్తాడు. వ్యసనానికి బందీ అయిపోయి అన్నీ తాకట్టు పెట్టి, సర్వం కోల్పోయి అప్పులపాలై తిప్పలు పడుతూ బికారిలా తిరుగుతూ ఇంటిని బజారుకీడుస్తాడు. అందరికీ అడుగుతూ అభాసుపాలవుతాడు.
చెడు వ్యసనం వాడికి ఆసనమై నాశనమై పోతాడు.
బంధాలు, అనుబంధాలను మరచి, విడిచి, విచ్చలవిడిగా తిరుగుతూ విగతజీవిగా మారుతున్నాడు. చేజేతులా తన జీవితాన్ని తానే అంధకారంలో నెట్టుకుంటున్నాడు.
ఇంట్లోని వస్తువులు అమ్మేయడం, 
డబ్బులు లేకపోతే దొంగతనాలు చేయడం, దొరికిపోయి శిక్షకు గురికావడం, మైకంతో వావివరసలు మరచి కామాంధుడై అత్యాచారాలు చేసి కటకటాలు పాలవుతున్నారు ఎందరో.. సమాజంలో నేరస్తులుగా మిగిలిపోతున్నారు వ్యసనపరులు.
నేడు పిల్లలు మొదలు పెద్దలు పార్టీల పేరుతో వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, పబ్బులు, బార్లకు పోయి దుర్వ్యసనాలు నేర్చుకుంటున్నారు. 
నేటి ప్రపంచంలో ప్రజలు పొగ త్రాగనివాడు దున్నపోతు అన్నట్లు మందు ముట్టనివాడిని మనిషేకాడన్నట్లు లోకం వింతగా చులకనగా చూస్తున్నారు.
మత్తులో పడి చిత్తు అవుతున్నారు. ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకొని సంఘంలో గౌరవం కోల్పోయి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. భవితవ్యం కోసం ఆలోచించక బలాదూర్ తిరుగుతున్నారు. తమ జీవితాలను తామే సర్వనాశనం చేసుకుంటున్నారు.
పరువు పోయి, ఇంటివారికి బరువై,
క్షయ, కాలేయ సంబంధిత, క్యాన్సర్ వంటి రోగాలకు చేరువై,
కన్నవారికి, కట్టుకున్న వారికి దూరమై అందరికీ కరువై, కనుమరుగు అవుతున్నారు, అయినవారికి అనాథలు చేస్తున్నారు..
డబ్బులు వెచ్చించి, కోరి
జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు..
మత్తు గమ్మత్తు కాదు, మత్తుతో
పోతుంది నీ సొత్తు, యావత్తు..
"మత్తు నిన్ను చేస్తుంది చిత్తు"
అందుకే దుర్వ్యసనాలకు దూరంగా ఉంటేనే అందరికీ దగ్గరవుతావు, దర్జాగా దొరలా ఉంటావు..

కామెంట్‌లు