ఆటల్లో ఆనందం: - వరుకోలు లక్ష్మయ్య -జిపఉపా:బక్రిచెప్యాల-జిల్లా:సిద్దిపేట -చరవాణి:9704865816.


చిన్నపిల్లలంత కలిసి 
కోలలన్ని పట్టుకొని 
తీయనైన పాటలతో 
తిరిగి తిరిగి ఆడుతారు 

చెలియలంత కలుసుకొని 
కాలు కాలు కదుపుతారు
చప్పట్లు చరుచుకుంటూ 
ముందు వెనుకకురుకుతారు

చెమ్మచెక్కలాడుకుంటూ 
చెంగుచెంగునెగురుతారు
బాలకృష్ణుని పైన
పాటలెన్నోపాడుతారు

చెట్టు పుట్ట తిరుగుకుంటు 
పూలనన్ని తెస్తారు 
బతుకమ్మ పేర్చుతారు
ఊరి మధ్యన నిలుపుతారు 

కట్టెపుల్లలు పట్టుకుని 
డబ్బలన్ని గీసుకుంటూ 
చారుపత్త ఆటలను 
శ్రద్ధగాను ఆడుతారు

చిన్నరాళ్ళు ఏరుకొచ్చి
కుప్పలుగా పోస్తారు
కచ్చకాయలాటలవి
కనుమరుగై పోయెను

దాగుడుమూతలాటలు 
కళ్ళు మూసి ఆడుతారు 
దాక్కున్నవారిని 
దొంగ దొరకబట్టాలి

ముక్కుగిచ్చుడాటలు
మురిపెముతో ఆడుతారు
గిచ్చినోళ్ళు ఎవ్వరో 
తెలుసుకొమ్మంటారు.

ఆటలండి ఆటలు 
చిన్నపిల్లల ఆటలు 
చిత్రమైనా ఆటలు 
చిరునవ్వుల పూదోటలు

పోటీపడి ఆడుతారు 
గెలవాలని చూస్తారు 
ఓడిపోవుచున్న కొలది 
గెలుపుకు పోరాడుతారు.

నాటి మంచి ఆటలు
నేడు కరువాయెను
మళ్లెప్పుడు ఆ ఆటలు
మనముందుకు వచ్చునో!!

కామెంట్‌లు