సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 
294 వ రోజు- సుయోధనాదులు అభిమన్యుడిని ఎదుర్కొనుట
ఆ మాటలు విన్న సుయోధనుడు అతి దీనవదనంతో ముఖము మీద చిరునవ్వు తెచ్చుకుని కర్ణుడు, భూరిశ్రవసుడు మొదలగు వారితో ఇలా అన్నాడు " విన్నారా ! మన గురువుగారు ద్రోణార్యుని మాటలు విన్నారా! విల్లు పట్టి నేర్చుకున్న ప్రతి వాడికీ ద్రోణాచార్యులే గురువు. అలాంటి వాడు ఒక పసి బాలుడిని మహా వీరుడని పొగుడుతూ చంపడానికి ప్రయత్నించ లేదు. ఎంతైనా పార్ధుని కుమారుని పార్ధునికి అనుకూలుడైన ద్రోణుడు చంపుతాడా! అయినా ద్రోణుడు ఉపేక్షించబట్టి అభిమన్యుడు చెలరేగిపోతున్నాడు. మనమంతా కలిసి అభిమన్యుని ఎదుర్కొంటాము అన్నాడు. ఇది విన్న దుశ్శాసనుడు ముందుకు వచ్చి " అన్నయ్యా ! ఈ మాత్రం దానికి యోధాను యోధులు కావాలా! అవక్ర పరాక్రమంతో అభిమన్యుని చంపుతాను. అభిమన్యుడు మరణించాడు అన్న వార్త విన్న అర్జునుడు, శ్రీకృష్ణుడు మరణిస్తారు మన పగ చల్లారుతుంది " అన్నాడు. దుశ్శాసనుడు విల్లు సారించి శరములు గుప్పిస్తూ అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు దుశ్శాసనుచే ప్రయోగించబడిన శరములు త్రుంచి అతని మీద ఇరవై ఆరు అతి క్రూర బాణములు ప్రయోగించాడు. వారివురి యుద్ధాన్ని మిగిలిన వారు యుద్ధం ఆపి చూస్తున్నారు. ఇంతలో అభిమన్యుడు దుశ్శాసనుని విల్లు విరిచి దుశ్శాసనుడి ఒళ్ళంతా తూట్లుగా కొట్టి నవ్వుతూ " దుశ్శాసనా ! నాడు నిండు పేరోలగములో నా తండ్రిగారు ధర్మరాజును తూలనాడిన నీ తల ఖండించి నా తల్లి తండ్రులకు మోదము కలిగిస్తాను " అంటూ రెండు వాడి అయిన బాణములు దుశ్శాసనుని వక్షస్థలముపై కొట్టాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడు మూర్చిల్లి రథముపై బడ్డాడు. అలా మూర్చపోయిన అతడిని రథసారథి పక్కకు తీసుకు పోయాడు. అభిమన్యుడు దారి చేయగా లోనికి ప్రవేశించిన పాండవ సైన్యం అది చూసి హర్షధ్వానాలు చేసారు. సుయోధనుడు కర్ణునితో " కర్ణా ! దుశ్శాసనుడు అభిమన్యుని చేతిలో మూర్చిల్లాడు కదా " అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు తన సైన్యంతో అభిమన్యుని మీదకు వెళ్ళి డెబ్భై మూడు బాణములు అభిమన్యునిపై ప్రయోగించాడు. అభిమన్యుడు వాటిని లక్ష్యపెట్టక మధ్యలోనే త్రుంచి కర్ణుడు అలసి పోయేదాకా శరములతో కొట్టాడు. కర్ణుని తమ్ముడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యుని హయముల మీద సారథి మీద శరములు గుప్పించాడు. అభిమన్యుడు చిరునవ్వుతో ఒకేఒక భల్లభాణముతో అతడి శిరస్సును త్రుంచాడు.
అభిమన్యుని విజయోత్సాహం
తమ్ముని మరణం చూసి కర్ణుడు తన సైన్యంతో పక్కకు తొలిగాడు. ఇది చూసిన కురుసేన విజృంభించింది.అభిమన్యుడు కురుసేనను బాణ వర్షంతో కట్టడి చేస్తూ పారి పోతున్న కర్ణుని తరిమాడు. కర్ణుడు ప్రాణభయంతో పారిపోయాడు. అతని వెంట కురుసైన్యమూ పారిపోయింది. అది చూసి ద్రోణుడు తల్లడిల్లి పోయి " కృపాచార్యా ! కర్ణా ! నిలవండి మీ లాంటి యోధాను యోధులు పారి పోవడము భావ్యమా ! సుయోధనా ! బాహ్లికా ! మీ పరాక్రమం చూపవలసిన తరుణం ఇదే కదా ! వెను తిరిగి వచ్చి అభిమన్యునితో పోరుసాగించండి " అని వారించినా వినక పారిపోసాగారు. అది చూసి అభిమన్యుడు సింహ నాదం చేసి విల్లు సారించి శరములు గుప్పిస్తూ కురుసేనను నాశనం చేసుతున్నాడు. రణరంగం విరిగిన ఆయుధములు, కేతనములు, ధనస్సులు, రథముల కుప్పలు హయములు, గజములు, సైనికుల కళేబరములతో నిండాయి. విరిగిన కాళ్ళు చేతుల విషయం అంతులేదు. రెండవ సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు " అన్నాడు ధృతరాష్ట్రునితో సంజయుడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఇప్పటి వరకు అభిమన్యుడు మాత్రమే యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నావు కాని మిగిలిన పాండవులు, ద్రుపదుడు, విరాటుడు ఏ మయ్యారు ఎందుకు సాయం రాలేదు " అని అడిగాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు