సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -247;ఆలి సొత్తు-అత్త తొత్తు అంటే...
****
"ఏమో అవ్వా! గాడట్ల మార్తడని కలల సుత అన్కో లేదు.శెవ్వ! శెవ్వా! గాడొకప్పుడు ఎట్లుండేటోడు సీమ టపాసోలె ఎగిరెగిరి పడ్కుంట ఉంటే " గీడన్న దాంట్లె నిజముంది. గాని తీరే గట్లని అన్కునేటోళ్ళం.గట్లాంటిది గిట్ల పురాగ మార్తడని అన్కోలే".
ఎవలు శెల్లె గా రాజ్జెం శిన్నమ్మ అల్లుని ముచ్చెటేనా? అవును శెల్లె ఊల్లె సుత గాన్ని తెల్శిన సుట్టాలు,దోత్తులు ఉన్నరు.గాళ్ళు సుత గీన్ని సూశి ముక్కునేలేస్కుంటుండ్రు.గీడేందీ కోరలు పీకిన పామైండు.పైంగ బుసకొట్టుడు సుత మర్శిండు శెల్లె''
గట్ల ఎందుకైండు, ఎందుకట్ల మారిండో ఎంత యిశారిచ్చినా సమజైతలే అవ్వా!"
"గిందుల యింతేముది శెల్లే! సొమ్ము మహెత్తం గట్లనే ఉంటది.ఒకప్పుడు గాడే సంపాయిచ్చే దినాలల్ల ఎగిరెగిరి పడ్డడు. నా పైసల్ నా యిట్టమని తాగుడు పీకుడు సుత మొదలువెట్టిండు.నౌకరి సేశేకాడ సుత గట్లనే శేస్కుంట సరింగ పోకపోతే "ఇంగ నువ్వు గా తాగుడు పీకుడే ఉజ్జోగం అన్కొమ్మని ఉజ్జోగంల నించి ఎల్లగొట్టిండ్రు."
 "గప్పుడన్న సోయి దెచ్చుకుండా అంటే గదీ లేదు .పెళ్ళాం ఒంటిమీది బంగారం వొల్సుకొని జెల్స జేసిండు.'కూసోని తింటే కొండలు సుత కర్గుతయని' సామెతే ఉందిగా శెల్లే! అన్ని తొవ్వలు మూస్కబొయినయి.పైసొచ్చే తొవ్వ లేకుండయింది."
"గప్పుడు గాని అమ్మ నాయిన మీద పడ్డడు.ఇత్తరా సత్తరా అని. గాళ్ళు మా దగ్గరేముందని శేతులెత్తేశిండ్రు."
"గియ్యన్ని నీకెట్ల దెల్సినయి అవ్వా! అంజనమేస్కొని సూశినట్టే శెప్తున్నవ్!"
"గియ్యన్ని దాత్తె దాగుతయా శెల్లె!గాళ్ళింటి పక్కనోళ్ళు నాకు  మా బాగ తెల్సు. బట్టల్కి ,బాతల్కి సరుకులకి పోయినప్పుడు కలుత్తుంటం.మీ వూరే గద అని గీ యిష్యాలు శెప్తుంటది.గట్ల నా శెవుల బడ్డయి."
"గింతకీ మన రాజ్జెం శిన్నమ్మ ఏం మంత్రమేశిందవ్వా?"
" ఇనుము ఏడిగున్నప్పుడే సుత్తెతో గొట్టి ఏ వత్తువంటే గా వత్తువు శేత్తరు' సూశినవు గద.గట్లనే గాడికి బాద్దెతలు మీద బడ్డయి.శేతుల అరకాణి ఆమ్దాని లేదు. గా సయిమంల శిన్నమ్మ బిడ్డొచ్చి వల్లవల్ల ఏడ్శింది.పొల్లగాండ్ల సద్వులు ఆగమైతయని రంది వడ్డది. గంతే ఇంగ బాద్దెత మీదేస్కుని తన దగ్గరున్న  సొత్తుతో సూసుడు మొదలువెట్టింది.ఇంగేముంది.ఇంట్లె పైసల  పెత్తనమంత అత్తదేనని  గానికి అర్తమైంది."
"ఓష్నీ అస్లిషయం గదా! ఇంతకు ముందు పెళ్ళాం మాట ఎకరదిచ్చినోడు.తాగి తందనాలాడి మాట తూలినోడు.గిప్పుడు పిల్లికూన లెక్క అయ్యిండంటే ఏమో అన్కున్న. ఎన్కట మరుగు మందులు ఉండేయని గాటిని తెల్వకుండ తినిపిత్తెనో, తాగిపిత్తెనో  సచ్చేదన్క గా పెట్టినోళ్ళ మాటే ఇంటరని శిన్నప్పుడు బాల్నాగమ్మ కతల యిన్న అవ్వా! గిది సుత గట్లనే అనిపిత్తోంది.
 " అవ్ మల్ల ! గదేమో మరుగు మందు,గిదేమొ పైసల మందు. గందుకే"ఆలి సొత్తు-అత్త తొత్తు" అన్నరు. తొత్తంటే తెల్సుగా"అయ్యా నీ బాంచెన్! అని ఎదురు మాట్లాడకుండ శెప్పింది శేత్తరు సూడు".గట్ల గీడు మాగ లాగం గని అత్త మావఁ సేవలు జేత్తూ ఇల్లిర్కం అల్లునొతికె బత్కుతున్నడు."
 అర్టిపండు వొల్శి పెట్టిన తీర్గ సమజైందవ్వా!"
గదండీ సంగతి " ఆలి సొత్తు-అత్త తొత్తు" అంటే గిదే మరి.మన సుట్టున్న లోకంల గిస్మంటోళ్ళు ఆడాడ అగుపిత్తుంటరు. ఎన్కట మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే.గస్మంటోళ్ళని సూశే గిస్మంటి సామెత పుట్టించిండ్రు."

కామెంట్‌లు