మురిపాల మాలిక: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
కొమ్మను పూయిస్తా —
కుసుమాల కిరీటాలు తొడిగిస్తా,
వసంతపు వేళల్లో
వన్నెల వేడుకలు జరిపిస్తా॥

రెమ్మలు తొడిగిస్తా —
పచ్చదనపు పట్టుచీరలు కప్పిస్తా,
గాలుల గుసగుసల్లో
గలగల గానాలు వినిపిస్తా॥

బొమ్మను చూపిస్తా —
అందాల అద్దంలో నిలబెడతా,
చూసే ప్రతి కన్నునూ
చిరునవ్వుల చినుకులు చిందిస్తా॥

గుమ్మను వర్ణిస్తా —
గులాబీలు గుర్తుకుతెస్తా,
గుబులును పుట్టిస్తా
గుండెలను పులకరింపజేస్తా॥

రమ్మని పిలుస్తా —
రాగాల పల్లకిలోకి ఆహ్వానిస్తా,
మనసుల మల్లెలతో
మమతల హారాలు అల్లిస్తా॥

ఇమ్మని కోరుతా —
ప్రేమను పరిమళాలను పంచమని అడుగుతా,
మానవతా మందిరంలో
మధుర బంధాలు నింపమంటా||

చెమ్మచెక్కా ఆడిస్తా —
చెలిమెల సందడులు పెంచుతా,
నవ్వుల నందనవనంలో
నిత్య వసంతాలు విరిబూయిస్తా॥

చిమ్మచీకట్లు తొలగిస్తా —
చిరుదివ్వెలు వెలిగిస్తా,
ఆశల వెలుగులతో
ఆనందమార్గాలు చూపిస్తా॥

కమ్మని కవితలు కూరుస్తా —
కావ్యసుమాలు పూయిస్తా,
మధుర భావసుధలతో
మనసులను మురిపిస్తా॥


కామెంట్‌లు