సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే, ఆరోగ్యానికి మంచి జరుగుతుందనే విషయం తెలిసిందే. కానీ, ఇలాంటి మాటలన్నీ కాగితాలవరకే పరిమితమవుతున్నాయి.
ప్రస్తుతం సైకిల్ తొక్కే వారి సంఖ్య చాలా తక్కువైంది. పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం స్కూటీలు, బైక్‌లపై చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు బద్ధకంతో తక్కువ దూరాలకు సైతం బైక్‌లు, కార్లులాంటి వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇటలీలోని ‘బారీ’ నగరంలో అధికారులు ఓ ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టారు. సైకిల్ మీద ఆఫీసుకు వెళ్లే వారికి నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారికి కిలోమీటరుకు 20 సెంట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుమారు వెయ్యిమందికి ఇందులో చేరే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఒక్కొక్కరికి మన కరెన్సీలో దాదాపు రెండు వేల రూపాయల వరకు చెల్లించే అవకాశముంది. అత్యధిక కిలోమీటర్లు సైకిల్ తొక్కినవారికి అదనంగా బోనస్ కూడా ఇస్తారట. దీనికోసం ఉద్యోగులు, పిల్లల కోసం తల్లిదండ్రులు సైకిళ్లు కొనేందుకు నగరపాలక సంస్థ నిధులూ కేటాయించింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా డబ్బులూ వస్తాయని నగర మేయర్ ఆంటోనియో డెకారో అంటున్నారు.
నిజానికి సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మంచి వ్యాయామం కూడా. సైకిలు ఒక సాధారణమైన రవాణా సాధనం. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు.
ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా.
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై వెళుతున్నాడు. ఆ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలున్నాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు. ముంజేతులను ఇనుప కడ్డీలపై ఉంచాడు. ముందు చక్రానికి సంబంధించిన కొయ్య కడ్డీని చేతులతో తిప్పితే పోదలచుకున్న మార్గంలో అతడు వెళ్ళగలుగు తున్నాడు. అతను పోతున్న తీరును చూసి వీధిలో పిల్లలు కేరింతలు పెడుతూ, వాహనం వెంట పరుగులు తీశారు. అయితే అదేమీ లెక్కచేయకండా ఆ యువకుడు ముందుకు సాగిపోతున్నాడు. అతడు బేడన్ ప్రభుత్వం లోని ఒక పెద్ద అధికారి కొడుకు. తన కొడుకు ఆఫీసర్ కావాలని తండ్రి ఆశించాడు. కానీ ఎక్కువ బాధ్యతలు నెత్తిన వేసుకోవటం ఇష్టంలేక బేరన్ డ్రే మామూలు గుమస్తాగా చేరాడు. అతనికి కొత్త విషయాలు కనుక్కోవాలనే తపన ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాల్లో అభిరుచి, ఉత్సుకత ఉన్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావటం వల్ల యాంత్రిక శాస్త్రం చదవలేకపోయా డు. తీరా 1851 లో దుర్భర దారిద్ర్యంలో అతడు మరణించేసరికి ఇతడు కనిపెట్టిన వాహనాన్ని రైలు పట్టాలపై వెళ్లి మరమ్మత్తులు చేయటానికి, కార్యకలాపాలు పర్యవేక్షించటానికీ, మాత్రమే ఉపయోగిస్తుండేవారు.
అయితే ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పెద్ద అంగలు వేసుకుంటూ ఈ వాహనం చాలా ముందుకు సాగిపోయింది. ఈ బండి ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఎర్నస్ట్ మికాక్స్ అనే ఫ్రాన్స్ దేశీయుడు మొదటి సైకిలు కర్మాగారాన్ని నెలకొల్పి ఫిషర్ నమూనా ప్రకారం సైకిళ్ళను తయారుచేశాడు.
ఇంగ్లండులో కూడా ఇలాంటివి తయారయ్యాయి. వీటిలో వెనక చక్రం కాస్త చిన్నదిగా ఉండేది. 1870 ప్రాంతంలో ఈ నమూనా బహుళ ప్రజాదరణ పొందింది. రాను రాను క్రీడాకారులకు దీనిపట్ల మోజు పెరిగింది.
ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ సైకిలును పోలిన కొన్ని బొమ్మలు గీశాడు.
ఫ్రాన్స్ జాతీయుడు దిసివ్రాక్ సైకిలులాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించాడు. దాన్ని "హాబీ హార్స్" అని పిల్చేవారు. దానికి పెడల్స్ ఉండేవి కావు. అయితే 1840లో స్కాట్లాండ్ దేశస్తుడు కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ ను జతచేసి నిజమైన సైకిలు రూపును కల్పించాడు. తర్వాత కొన్ని మార్పులు చోటుచేసుకుని 1900వ సంవత్సరంలో ఆధునికమైన సైకిలు తయారైంది.
ఐక్యరాజ్యసమితిలోని వియన్నా కన్వెన్షన్, 1968 ప్రకారం సైకిలును ఒక వాహనంగా, నడిపేవానిని చాలకునిగా గుర్తించారు. చాలా దేశాలలో దీని ప్రకారం లైసెన్సులు కూడా అమలులో ఉన్నాయి.
ఏదేమైనా సైక్లింగ్ మంచి వ్యాయామమే. అలాగని సైకిల్ తొక్కడంలో అతి కూడదు. అది మంచిది కాదు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి