ఆకుల్ని కట్టుకొని రాతి పనిముట్లను ఉపయోగించే ఆదిమ మానవుడి దశ నుండి అణ్వాయుధాలు ప్రయోగించే నేటి ఆధునిక మానవుడి దాకా సాగించిన ప్రయాణంలో అతడికి తోడుగా నిలిచింది విజ్ఞాన శాస్త్రమే. చక్రం ఆవిష్కరణలో మానవ జీవన గమనమే మారిపోయింది. మానవ జీవన గమనంలో శాస్త్ర విజ్ఞాన ప్రమేయం లేని అంశమేదీ కనిపించదు. మానవుడి ఆలోచనా పరిధి పెరుగుతున్న కొద్దీ 'సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడు? చంద్రుని నుంచి వెన్నెల ఎందుకొస్తుంది? కలరా వంటి వ్యాధులు ఒకేసారి అంతమందిని ఎలా పొట్టన పెట్టుకుంటున్నాయి?' వంటి ఎన్నో సందేహాలు తలెత్తాయి. ఆ సందేహాలను తెలుసుకునే క్రమంలో వాటి పని తీరును గమనించడం మొదలుపెట్టి తెలుసుకున్న ఆయా విషయాలను సూత్ర బద్దం చేయటం ప్రారంభించాడు. వ్యాధులు ఎందుకొస్తున్నాయో గుర్తిస్తే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. యూరప్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వలన చరిత్రలో ఎన్నో మార్పులు సంభవించాయి. శాస్త్ర విజ్ఞానం ప్రజల చెంతకు చేరినప్పుడే సమాజ పురోగతి సాధ్యమవుతుంది. విజ్ఞాన ఫలాలను అందుకోవటంలో ముందున్న ప్రజలు, శాస్త్రీయతను అలవరచుకోవటంలో మాత్రం వెనకబడే ఉన్నారు.
'నేటి బాలలే రేపటి పౌరులు' అన్న సూక్తి ప్రకారం ఈనాడే బాలలను శాస్త్ర విజ్ఞానం వైపు నడిపించగలిగితే రాబోయే తరం, నవతరం విజ్ఞానవంతంగా తయారవుతుంది. విజ్ఞానవంతమైన పౌరులున్న దేశం ప్రగతిపథంలో మున్ముందుకు దూసుకుపోతుంది. బాలలు శాస్త్ర విజ్ఞానం వైపు అడుగులు వేయాలంటే రచయితలు ప్రధాన పాత్ర పోషించాలి. బాల సాహిత్యమంటే పాటలు, కథలు మాత్రమే కాదు. విజ్ఞాన శాస్త్ర రచనలు కూడా. వేమరాజు, భానుమూర్తి, విస్సా అప్పారావు, వసంతరావు, వెంకటరావు, రావూరి భరద్వాజ వంటి ప్రసిద్ధ రచయితలు బాలల కోసం ఎన్నో వైజ్ఞానిక రచనలను చేశారు. పద్యం, గేయం, కథ, నవల, రూపకం, జీవిత చరిత్ర, నాటిక, వ్యాసం వంటి అన్ని రకాల ప్రక్రియల్లోనూ విజ్ఞాన శాస్త్ర రచనలు వెలువడ్డాయి. 1930 సంవత్సరంలో 'గృహలక్ష్మి' మాసపత్రికలో తొలిసారిగా బాలల కోసం విజ్ఞాన శాఖ ఏర్పాటు చేయబడింది.
భారతదేశంలో క్రికెట్ వంటి ఆటల్ని ప్రోత్సహించినట్లుగా సైన్స్ ప్రయోగాలను ప్రోత్సహించరు. క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడా కారులకు లక్షల డబ్బు, కార్లు, ఇళ్ళు ఇచ్చి సంతోష పరుస్తారు. అదే షార్, ఇస్రో కేంద్రాలలో చేసే రాకెట్ల ప్రయోగాలకు, చంద్రయాన్లకు బడ్జెట్ లేదంటారు. ఇస్రో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపితే పత్రికలలో ఏ మూలనో రాస్తారు. ఏ మాత్రం ప్రోత్సాహం ఇవ్వకుండా అగ్రరాజ్యాలతో ఇండియా పోటీపడలేకపోతోందని ఉపన్యాసాలు ఇస్తారు. అమెరికా, రష్యా, జపాన్ల తర్వాత చంద్రుడిపై కాలుమోపిన నాల్గవ దేశం భారతే.
బాలల మనసు మైనపు ముద్ద లాంటిది. బాల్యంలో దారిని ఏ విధంగా మలిస్తే ఆ విధంగా తయారవుతారు. చిన్నతనం నుంచే పిల్లల మెదళ్ళలో విజ్ఞాన శాస్త్రం పట్ల ఉత్సుకతను పెంచాలి. బాల్యంలోనే విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కలిగించినట్లైతే భవిష్య సమాజం అంధ విశ్వాసాల నుండి విముక్తి అవుతుంది.
ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే కోళ్ళను, మేకలను బలివ్వడం, మందులు వాడకుండా తాయెత్తులు కట్టించుకోవడం, ప్రమాదకర వ్యాధులకు కూడా ఆసుపత్రులకు రాకుండా చెట్ల మందులు తాగడం వంటివి 'సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్' మేనేజ్మెంట్ డైరెక్టరుగా మా ఆసుపత్రిలో ఎన్నో చూశాను. బాగా ఉన్నతమైన చదువులు చదువుకున్న వారు కూడా ఆటలమ్మ, పోశమ్మ వంటివి వచ్చినపుడు మందులు వాడకుండా ఇంట్లో పూజలు చేస్తూ, ప్రమాద స్థాయికి తెచ్చుకోవడం మా వారి పేషెంట్లలో ఎంతో మందిని కళ్ళారా చూశాను. మేనరికపు పెళ్ళిళ్ళ వల్ల పుట్టుకతోనే సమస్యలు వచ్చే పిల్లల్ని ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి మూఢనమ్మకాలను వదిలిపెట్టి ఆరోగ్యకర, ప్రగతికర సమాజం నిర్మితం కావాలంటే శాస్త్ర విజ్ఞాన ప్రచారం ఎంతో అవసరం.
ఈనాటి విద్యార్థులకు సైన్స్ అంటేనే భయం. ఆ భయాన్ని పోగొట్టాలంటే సైన్స్ సులభంగా అర్థమయేలా కథల రూపంలోనో, కళా రూపంలోనో చెప్పాలి. కథ, కవిత, పాట, గేయం ప్రక్రియ ఏదైనా సైన్స్ను అందులో అంతర్లీనంగా చెప్పాలన్నదే.
నా ఉద్దేశ్యం. అది సైన్స్ అని వారికి తెలియకుండానే వారి మెదళ్ళకు చేరాలి. పంచదార పూతతో చేదు మాత్రల్ని మింగించి రోగాల్ని తగ్గించినట్లుగా, సాహిత్య రూపంలో సైన్స్‌ను పిల్లలకు చేరవేయటం అనుకోవచ్చు. ఏదైనా ఫోబియా పోవాలంటే ఆ పనిని పదేపదే చేస్తుండాలని వైద్య నిపుణులు చెప్తారు. అలాగే సైన్స్ పట్ల భయం పోవాలంటే సైన్స్ రకరకాల రూపాల్లో వారిని చేరుతూనే ఉండాలి.
సైన్స్ విషయాలు ప్రధానంగా తీసుకొని రాసిన పుస్తకాలలో ఈ 'సైన్స్ కార్నర్' మూడవది. సైన్స్ పాయింట్, సైన్స్ వరల్డ్ మొదటి రెండు పుస్తకాలు. నేను రాసిన అన్ని బాల సాహిత్య పుస్తకాలలోనూ సైన్స్‌ను చెప్పాను. కాకపోతే సైన్స్ తప్ప వేరే అంశమేమీ లేని పుస్తకాలు ఈ మూడూ. పొడుపు కథలు, పాటలు, కవితలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు, నాటికలు, యాత్రా కథనాలు వంటి అనేక పక్రియల్లో పిల్లలకు సైన్స్‌ను చెప్పాను. కూరగాయలతో తయారయ్యే బొమ్మలను వివరించే వ్యాసాల్లో కూడా సైన్స్‌ను మిళితం చేసి రాశాను. మానవ శరీర అవయవాల గురించి కవితలు, పొడుపు కథలు రాశాను. ఆసుపత్రి పరికరాల గురించిన కవితలు రాసి, మా ఆసుపత్రి గోడలకు అతికించాను. ఇదీ నా సైన్స్.
ప్రస్తుతం వెలువడుతున్న ఈ 'సైన్స్ కార్నర్'లోని వ్యాసాలన్నీ విద్యార్థి చెకుముకి లోనూ, నవతెలంగాణ 'బుడుగు' లోనూ ప్రచురితమైనవి. చివర ఉన్న రెండు నాటికలు ఆశాశవాణి వరంగల్లు కేంద్రం నుంచి ప్రసారమైనాయి. నా ఈ పుస్తకం విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుందని ఆశీస్తున్నాను. 'బాల సాహిత్యంలో వైజ్ఞానిక రచనలు' అనే అంశంపై పిహెచ్‌డీ చేశాను. అందరూ ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదిస్తారని ఆశీస్తున్నాను. నా ఈ పుస్తకానికి 'ప్రిస్కిప్షన్లో సాహిత్యం' అంటూ ముందుమాట రాసిచ్చిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు గౌరవనీయులు డా॥ సి. హెచ్, మోహన వంశీ గారికి, 'రచయితలే మార్గదర్శకులు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన ఆర్‌ఇహెచ్ సూపరింటెండెంట్ డా॥ వి.వి.యల్ నరసింహారావు గారికి నా కృతజ్ఞతలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి