అరుణిమలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
చిలుకముక్కు ఎరుపు —
చిలిపితనపు ప్రతిబింబం,
దొండపండు ఎరుపు — 
దోచుకునే అందచందం॥

చిన్నదానిమోము ఎరుపు — 
చిగురించే యవ్వనం,
సిగ్గుబుగ్గలు ఎరుపు — 
మనసును మురిపించే మాధుర్యం॥

ఉదయించే సూర్యుని ఎరుపు — 
ఉషోదయపు ఉత్సాహం,
మందార పూవు ఎరుపు — 
ప్రకృతి కిరీటపు ప్రకాశం॥

కోపపు కన్నులు ఎరుపు — 
హెచ్చరికల హోరు,
రక్తం రంగు ఎరుపు —
జీవనగీతపు జ్యోతి, ధైర్యత్యాగాల ప్రతీకం॥

ట్రాఫిక్ ఆపేది ఎరుపు — 
జాగ్రత్తల జెండా,
నిప్పు రవ్వలు ఎరుపు — 
శక్తికి ప్రతీక, ప్రమాదాలను తెలిపే హెచ్చరికల రంగు॥

గులాబీ రేకులు ఎరుపు — 
ప్రేమలేఖల పరిమళం,
కుంకుమ బొట్టు ఎరుపు — సంప్రదాయపు సొగసు, 
వధువు నుదుటి సిందూరమై వైవాహిక బంధానికి వన్నె॥

కోక ఎరుపు — 
కోమలాంగికి మరింత అందం,
నేల ఎరుపు — 
రైతన్నకు పంటల భాగ్యం॥

సాయంత్రపు మేఘం ఎరుపు — 
ఆకాశానికి సొబగు,
సిగ్గుతో నవ్వే చెలి ఎరుపు — 
హృదయానికి హాయి సొగసు॥

ఎరుపంటే కేవలం రంగు కాదు —
ఉత్సాహాలకు ఉప్పెన, ప్రేమలకు పరిమళం,
పోరాటాలకు పతాకం,
జీవితానికి జవసత్వం॥

ప్రకృతిలోనూ, ప్రణయంలోనూ,
పండుగలోనూ, పోరాటంలోనూ,
అందంలోనూ, ఆవేశంలోనూ
అగ్రస్థానంలో వెలిగే అరుణవర్ణ వైభవం — ఎరుపు॥


కామెంట్‌లు