సామెత -249: ఆటవిడుపు- చేట దెబ్బలు
****
"అవ్వా! ఆ మునక్కాయక్క సూడు నన్ను బుడ్డోడా అనకుండ బుడుబుంగ, పొట్టి బుడంకాయ్ అంటున్నది."
"మునిక్కాయక్కెవర్రా బలే పిలుత్తున్నవ్. గంత సన్నగున్నదెవలు భూలచ్మేనా?"
"అవ్వా!సూశినవా! గా లడ్డూ, పొత్రం గాడు ఏమంటుండో...మనింట్లె గీ నడ్మల సిలెండర్ దొర్కుత లేదు గద! గీనికి గా రంగేశి వాటి పక్కన నిలబెడితే నిజం సిలెండరని అన్కుంటరు. లేకపోతే గాడు నన్ను మునిక్కాయక్క అంటడా? గాడే గుండ్రాయ్- గాడే బోండాయ్"
"ఒరేయ్ బుడ్డోడా!భూలచ్మీ మీరు ఆడుకుంటుర్రా? మాటల్తో తన్నుకుంటుర్రార ముందుగాల శెప్పుండ్రి. గుండ్రాయ్ -బోండాయ్ ఏంది!మునిక్కాయక్కనా? భూలచ్మి నువ్వు సన్నగున్నవని గాడు మునిక్కాయ అంటుండు. నువ్వేమో గాన్ని గుండ్రాయ్- బోండాయ్ అంటున్నవ్? మీరు మీరే గట్లెవలైన తిట్టుకుంటరా శెప్పుండ్రి."
" అగ్గ సూశినవా?నవ్వులు బొయ్యి నువ్వులాయె? అంటిచ్చుకునే ముట్టిచ్చుకునే ఆటని ఉర్కితిరి.దెబ్బలు తాకిచ్చుకుంటిరి. 'బుడ్డోడా! మోకాలి చిప్ప పలిగిందా రకతం అగుపిత్తోంది. భూలచ్మీ! పసుపు డబ్బ తనబ్బిల ఉందిగని తేపో! ''
"ఆటవిడుపు - శేట దెబ్బలు అంటే గిదే! సద్వుకోండ్రా అంటే వొయ్యిలు ముందేస్కుని కూర్పట్ల బడుతుంటిరి.మజ్జెల జెరింత సయిమం ఆడుకోండిరా అంటే గిట్ల వొల్లు సోయి లేకుండా గిట్ల జేసి దెబ్బలు తాకిచ్చుకుంటిరి! ఏందిరా వారీ! పసుపు అద్దుతుంటే లబ్బలబ్బ మొత్తుకుంటున్నవ్. ముందుగాల ఉండొద్దా గీ సోయి?"
"అవ్వా! అవ్వా! ఇంకోపాలి గిట్ల జెయ్యం గని నిన్నొకటి అడగనా" "ఆటిడిపు - శేట దెబ్బలు" అంటేందో శెప్పవా?"
" గీ తెల్వి తేటలకేం తక్వ లేదు. తల్కాయ నిండా పశ్నలే. ఆటిడుపు అంటే మీరు గిప్పటి దనుక సద్వి సద్వి అల్శిపోయిండ్రు గద గప్పుడేమన్పిత్తది. జెర సేపు సద్వుబదులు ఇట్టమైన ఆట ఆడుకోడమో, పాటలు పాడుకోడమో శేత్తె బావుండు అన్పిత్తది. గట్ల అన్పిచ్చంగనే శేత్తున్న దాన్ని ఆపి గిట్ల మన్సుకు నచ్చినయి శేయడమన్నమాట."
" మరి శేట దెబ్బలంటే ఏందవ్వా?"
"గిట్ల సర్దాగ ఆడుకుంట దెబ్బలు తాకిచ్చుకోడం. ఎన్కట వొడ్లగడ్డి తొక్కి వొడ్లు తీశినంక జెర సేపు ఆరాంగ కూసుని ఆటెంక శిన్నగ ఆటిని శేటతో శెర్గేటోళ్ళు. గది సూత్తే సర్దగనే వుంటది గని గాలికి శేట అటీటు ఊగుతూ ఒకోపాలి శెంపల్కి మొఖానికి గా శేట తలిగేది. గాలి బాగొచ్చినపుడు ఊక్కుంట రువ్వడిగ తలిగేది. సర్దా కాత్త బాదయ్యేది. గందుకే గీ సామెత పుట్టుకొచ్చింది.
గిప్పటికీ ఐతారం సద్వు ముచ్చెటి మర్శి మీ పొల్లగాండ్లంత ఎంత ఆటిడుపుగుంటరో తెల్సుగద. పొద్దుగాల లెయ్యండ్రా అంటే ఐతారంగా జెరాగి లేత్తం తీ అంటరు. తినే కాడ, తాగే కాడ ఆత్రం లేకుండా పుర్సత్గ శేత్తుంటరు సూడు గదే ఆటిడుపు. "
" సమజైందవ్వా! ఇంకెప్పుడూ గిట్ల దెబ్బలు తాకిచ్చుకోం.మంచిగుంటం" అంటున్న ఆళ్ళిద్దర్కీ ఇట్టమైన సున్నుండ శెరోటి ఇచ్చింది."
గదండీ సంగతీ! "ఆటవిడుపు చేట దెబ్బలు'' అంటే గివే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి